ఓరుగల్లు ఆలయాలు అద్భుతం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

  • హిస్టారికల్​ టెంపుల్స్ ను కాపాడాలి

హనుమకొండ/ వరంగల్, వెలుగు: చారిత్రక దేవాలయాలైన రామప్ప, వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. వెయ్యేండ్లకుపైగా చరిత్ర కలిగిన ఆలయాలు ఓరుగల్లులో ఉన్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి వరంగల్​జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ములుగులో లక్నవరం సరస్సు అందాలను తిలకించారు. అనంతరం వరంగల్ ఎన్​ఐటీకి చేరుకున్న ఆయనకు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్ మినిస్టర్, ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క ఘనస్వాగతం పలికారు. 

ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ మేయర్​ సుధారాణి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదాదేవి, సీపీ అంబర్ కిశోర్ ఝా పూల బొకేలతో వెల్ కం చెప్పారు. హనుమకొండ కలెక్టరేట్​లో హనుమకొండ, వరంగల్ జిల్లా అధికారులతో గవర్నర్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు.

ప్రముఖులతో ఇంటరాక్షన్..

హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య చారిత్రక వేయి స్తంభాల గుడి, భద్రకాళి, పద్మాక్షి తదితర ఆలయాలు, పార్కులు, స్మార్ట్ సిటీ,  కమాండ్ కంట్రోల్ సెంటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాళోజీ కళాక్షేత్రం, గ్రేటర్ సిటీ తదితర అంశాల గురించి పవర్ పాయింట్​ ప్రజంటేషన్ ద్వారా గవర్నర్​కు వివరించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద విద్యా, వైద్యారోగ్యం, ఎంజీఎం ఆసుపత్రి, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించగా, వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు గురించి తెలియజేశారు. 

అనంతరం కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, ఇతర రంగాలకు చెందిన దాదాపు 40 మంది ప్రముఖులతో చర్చాగోష్టి నిర్వహించారు. ఇందులో రచయిత డాక్టర్ లంక శివరాం ప్రసాద్, ఐఎంఏ ప్రెసిడెంట్ ఎండీ అన్వర్ మియా, సామాజిక కార్యకర్త మండల పరశురాములు, రచయిత, సీనియర్ జర్నలిస్ట్​ గడ్డం కేశవమూర్తి, జాతీయ బ్లైండ్ పారాజూడో అవార్డు గ్రహీత నాగరాజు, చేనేత జాతీయ అవార్డు గ్రహీత పిట్టల రాములు, గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత, ప్రఖ్యాత కూచిపూడి నృత్యకళాకారిణి వెంపటి శ్రావణి, మహిళా శక్తి అవార్డు గ్రహీత కొంగ రజిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, కవి, రచయిత పొట్లపల్లి శ్రీనివాస్, ఇంటాక్ కన్వీనర్​​ పాండురంగారావు, తానా ప్రెసిడెంట్ ప్రవీణ్, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ చందర్ రెడ్డి తదితరులున్నారు. వారందరితో కలిసి గవర్నర్ లంచ్​ చేశారు. అనంతరం రెడ్ క్రాస్ బిల్డింగ్ ఆవరణలో తలసేమియా, సికిల్ సెల్ బిల్డింగ్ లో వార్డును ప్రారంభించారు.

ALSO READ : ముర్రెడు వాగుతో ముప్పు!

పులకించిన గవర్నర్..​

కాకతీయుల కాలంనాటి ఆలయాలు, చారిత్రక కట్టడాలను చూసి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ  పులకించిపోయారు. వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయాలను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, జిల్లా అధికారులతో కలిసి గవర్నర్ సందర్శించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజారులు గవర్నర్ ను స్వామివారి తీర్థ ప్రసాదాలతో సత్కరించారు. అనంతరం ఖిలా వరంగల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ పెరిణి శివతాండవం, శివ లాస్యం, రాణి రుద్రమ, చిందు యక్షగానం తదితర నృత్యాలను వీక్షించారు. 

ఓరుగల్లు కళలు, కళాకారులు, సంప్రదాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, గ్రేటర్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖడే, కార్పొరేటర్లు భోగి సువర్ణ, ఉమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా, ఖిలా వరంగల్ సందర్శన అనంతరం గవర్నర్ వరంగల్ ఎన్​ఐటీకి చేరుకున్నారు. అక్కడ రాత్రి బస చేసి, ఉదయం 9 గంటలకు జనగామ జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు.

గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

జనగామ అర్బన్: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సరిత, డీపీవో స్వరూప, డీఈవో రాము, డీడబ్ల్యూవో జయంతి, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.