కొండపై మౌలిక సదుపాయాలు కల్పిస్తాం : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కొండపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. కొండపై బ్యాటరీ వాహనాల కోసం వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లులు వేచి ఉండేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన షెల్టర్, 'డోనర్ సెల్' ను ఆదివారం ఆయన ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం కోసం దాదాపుగా రూ.1200 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. కొండపై భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించిందన్నారు. తద్వారా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అసహనం వ్యక్తం చేశారు. కొండపై భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడంపై కాంగ్రెస్​ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు.

 ఇందులో భాగంగానే కొండపై అడుగడుగునా వాష్ రూంలు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడమే కాకుండా.. భక్తులు సేద తీరేందుకు వీలుగా జర్మన్ హ్యాంగర్ షెడ్స్, డార్మెటరీ హాల్, విష్ణుపుష్కరిణిని అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యామహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం, మాజీ ఉపసర్పంచ్ భరత్ గౌడ్ పాల్గొన్నారు. 

స్వర్ణతాపడానికి ఎమ్మెల్యే రూ. లక్ష విరాళం..

నారసింహుడి దివ్యవిమాన గోపురానికి ఏర్పాటు చేయనున్న స్వర్ణతాపడం కోసం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రూ.1,00,116 విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును స్వామివారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విరాళ చెక్కును ఆలయ ఈవో భాస్కర్ రావుకు అందజేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అంతకుముందు యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు.