బలూచ్​కు ట్రైన్ సర్వీసులు రద్దు

  • భద్రతా కారణాలతో పాకిస్తాన్​ ప్రభుత్వం నిర్ణయం
  • క్వెట్టా స్టేషన్ లో పేలుడు నేపథ్యంలో 4 రోజులు బంద్

క్వెట్టా: బలూచిస్తాన్ ప్రావిన్స్​కు రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు రోజుల పాటు రైళ్లు నడవబోవని తెలిపింది. ఇటీవల బలూచిస్తాన్​లోని క్వెట్టా రైల్వే స్టేషన్ లో సూసైడ్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో రైల్వే సిబ్బంది, సైనికులతో పాటు మొత్తం 26 మంది చనిపోయారు. మరో 62 మంది వరకు గాయపడ్డారు. వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఈ దాడికి పాల్పడింది.

ఈ నేపథ్యంలో భద్రత కారణాల వల్ల ట్రైన్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పాక్ రైల్వే శాఖ ప్రకటించింది. ఈ నాలుగు రోజుల పాటు బలూచ్ ప్రావిన్స్ నుంచి రైళ్లు ఏవీ బయలుదేరబోవని, అదేవిధంగా ఆ ప్రావిన్స్​కు రైళ్లు నడపబోమని పేర్కొంది. భద్రతా ఏర్పాట్లు, రైల్వే స్టేషన్లలో తనిఖీల తర్వాత రైళ్లను పునరుద్ధరించనున్నట్లు వివరించింది. కాగా, క్వెట్టా రైల్వే స్టేషన్ లో జరిగిన సూసైడ్ దాడిలో చనిపోయిన వారికి నివాళిగా బలూచ్ ప్రావిన్స్ లో మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది. బీఎల్ఏపై ప్రతీకారం తీర్చుకుంటామని బలూచ్ ప్రావిన్స్ సీఎం సర్ఫరాజ్ బుగ్తీ ప్రకటించారు.