వేములవాడకు మహర్దశ .. పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని వేములవాడ

  • ఆలయంతోపాటు పట్టణ అభివృద్ధికి ఫండ్స్‌‌ రిలీజ్‌‌ చేసిన ప్రభుత్వం 
  • పీసీసీ హోదాలో మాట ఇచ్చి నిలుపుకున్న సీఎం రేవంత్‌‌రెడ్డి  

వేములవాడ, వెలుగు:  పవిత్ర పుణ్యక్షేత్రం వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఆలయంతోపాటు పట్టణాభివృద్ధికి సోమవారం రూ.127.65కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పదేళ్లుగా అభివృద్ధికి నోచని టెంపుల్​టౌన్‌‌కు ఇక మహర్దశ పట్టనుంది. ఈ నిధులతో టెంపుల్‌‌తోపాటు పట్టణంలో రోడ్ల వెడల్పు, రాజన్న గుడిచెరువు, మూలవాగుపై అదనపు బ్రిడ్జిల నిర్మాణం, నాంపల్లి గుట్టను అభివృద్ధి చేయనున్నారు. ఈనెల 20న సీఎం రేవంత్‌‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

పట్టణంలో రోడ్ల వెడల్పు, మౌలిక వసతుల కల్పన 

2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ హోదాలో సీఎం రేవంత్‌‌రెడ్డి వేములవాడను అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం అయిన ఏడాదిలోనే రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన సౌకర్యాలకు గానూ రూ.76 కోట్లు, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు. రాజన్న ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ.47.85 కోట్లు, పట్టణంలోని డ్రైనేజీ గుడి చెరువులో కలవకుండా మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌‌ లైన్‌‌ నిర్మాణానికి రూ.3.8 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్‌‌రెడ్డి ఈ నెల 20 జిల్లా పర్యటన సందర్భంగా ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా రాజన్న ఆలయ అభివృద్ధిపై గత ప్రభుత్వ పెద్దల వివక్షపై మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌, ప్రభుత్వ విప్‌‌, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌  ఆందోళనలు చేశారు. అనంతరం కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చాక పొన్నం, ఆది శ్రీనివాస్​ చొరవతో వేములవాడ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మాటిచ్చి మరిచిన మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ 

2015 జూన్​ 18న సీఎం హోదాలో కేసీఆర్‌‌‌‌ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. రాజన్న ఆలయాన్ని రాష్ట్రంలో నంబర్‌‌‌‌వన్‌‌గా చేస్తానని ఆ టైంలో హామీ ఇచ్చారు. ఏటా రూ.100కోట్లు కేటాయిస్తానని రాజన్న సాక్షిగా మాటిచ్చారు. ఆలయ సమీపంలోని గుడిచెరువు చుట్టూ ట్యాంక్‌‌బండ్ నిర్మిస్తామని చెప్పారు. 35 ఎకరాల్లో భక్తులకు సకల సౌకర్యాలతో కాంప్లెక్స్‌‌లు, రోడ్ల విస్తరణ చేపడుతామన్నారు. ఆలయ అభివృద్ధిపై బ్రోచర్లు విడుదల చేశారు. అనంతరం  వేములవాడ టెంపుల్​డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ(వీటీడీఏ) ఏర్పాటు చేసి ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆ తర్వాత వేములవాడ రాజన్న సాక్షిగా ఇచ్చిన హామీలను మరిచిపోయారు.