ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా చైతన్య

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు వ్యవసాయ మార్కెట్ కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ తో కలుపుకొని మొత్తం 18 మంది సభ్యులతో నూతన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఐనాల చైతన్యామహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా మచ్చిమట్ల మదార్ గౌడ్ నియమితులయ్యారు. కొత్తగా ఎన్నికైన కమిటీ రెండేళ్లపాటు కొనసాగనుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

రిజర్వేషన్లలో భాగంగా ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఓసీ(మహిళ)కి కేటాయించారు. ఏఎంసీ చైర్ పర్సన్ గా నియమితులైన చైతన్య భర్త మహేందర్ రెడ్డి 2006 నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతుండగా.. పెళ్లి తర్వాత చైతన్య 2012 నుంచి కాంగ్రెస్ లో యాక్టివ్ గా పనిచేస్తున్నారు.

ఈ సందర్భంగా ఏఎంసీ చైర్ పర్సన్ చైతన్యామహేందర్ రెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. నూతన సభ్యులుగా తండ పాండురంగం, ఎగ్గిడి యాదగిరి, చిలుకు కిష్టయ్య, సిలువేరు బాలరాజు, మాడోత్ విఠల్ నాయక్, ఎండీ నసీరుద్దీన్, ధీరావత్ పట్టూనాయక్, పుచ్చుల జహంగీర్, శివరాత్రి దానయ్య, మోతె మైసయ్య, సముద్రాల సత్యనారాయణ, ఇల్లందుల మల్లేశం నియమితులయ్యారు.