ఏటీఎం కార్డు లెక్క .. తెలంగాణలో కొత్త రేషన్ ​కార్డు!

  • ఈ‌‌–పాస్​ మెషీన్​లో స్వైప్​ చేసి సరుకులు తీసుకొనేలా ఏర్పాట్లు
  • రేషన్​కార్డులో ప్రత్యేక చిప్​..స్వైప్​ చేయగానే వివరాలన్నీ డిస్‌‌ ప్లే
  • ప్రత్యేకంగా చర్చించిన కేబినెట్​ సబ్​ కమిటీ 
  • --హర్యానా, యూపీ, ఒడిశా విధానాలపై అధికారుల అధ్యయనం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సర్కారు విప్లవాత్మక మార్పునకు నాంది పలకనున్నది. కొత్త రేషన్ కార్డుల జారీలో పాత పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఏటీఎం కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు తీసుకురావాలని భావిస్తున్నది. ఈ పాస్​ మెషీన్​లో స్వైప్​ చేసి రేషన్​ తీసుకునేలా ఈ  కార్డులను తీసుకురావాలని ఆలోచన చేస్తున్నది. ఏటీఎంలో కార్డు పెట్టి డబ్బులు తీసుకున్నంత ఈజీగా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఇందులో భాగంగా ఇప్పటికే సివిల్​ సప్లయ్స్​ అధికారుల బృందం హర్యానా, ఉత్తరప్రదేశ్​,  ఒడిశా రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్టు సమాచారం. ఒక ఐడీ కార్డు పరిమాణంలో ఉండే స్వైపింగ్ కార్డులను రూపొందించి అందులో ఒక చిప్​ను అమర్చాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ పాస్​ మెషిన్​లో స్వైప్ చేయగానే చిప్ యాక్టివేట్ అయ్యేలా కార్డును డిజైన్ చేయనున్నారు. యాక్టివేట్ అయిన  చిప్​లో రేషన్ కార్డు లబ్ధిదారుల వివరాలతో సహా పూర్తి సమాచారం స్వైపింగ్​ మెషీన్​ మానిటర్ పై డిస్ ప్లే అవుతుంది. ఈ విధానం అమల్లోకి వస్తే రేషన్ షాపుల్లో జరిగే మోసాలను అరికట్టడంతోపాటు డూప్లికేషన్  తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. 

కొత్త కార్డుల జారీ దిశగా సర్కారు చర్యలు

రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది  ఎదురు చేస్తున్నారు. తాజాగా, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్​కార్డులు ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీనిపై ఇటీవలే  సివిల్​సప్లయ్స్​మంత్రి ఉత్తమ్ కుమార్  చైర్మన్ గా ముగ్గురు సభ్యులతో కేబినెట్​సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ  కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేషన్ కార్డు, హెల్త్ కార్డులకు అర్హతలు, విధివిధానాలు, వార్షిక ఆదాయ పరిమితిపైనే మంత్రివర్గ ఉప సంఘం  ప్రధానంగా చర్చించింది. కొత్త కార్డుల జారీకి దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరించాలనే దానిపై త్వరలో విధివిధానాలను జారీ చేయనున్నారు.  

సాఫ్ట్​వేర్​ ఎక్స్​పర్ట్స్​తో సబ్ ​కమిటీ చర్చలు

గ్రెయిన్ ఏటీఎంల తరహాలో రేషన్​ కార్డులు రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏటీఎం కార్డుల తరహాలో ఉండే ఈ కార్డులకు ప్రత్యేకమైన మైక్రో చిప్​ను అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి సాఫ్ట్​వేర్  ఎక్స్​పర్ట్స్​తో కేబినెట్​ సబ్ కమిటీ మాట్లాడింది. ఈ తరహా కార్డుల రూపకల్పన, జారీకి సంబంధించి సాధ్యాసాధ్యాలపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించింది.  కొత్త రేషన్ కార్డులను ఏటీఎం కార్డుల తరహాలో తీసుకురావొచ్చని సాఫ్ట్​వేర్​ నిపుణులు కేబినెట్​సబ్​కమిటీకి సూచించారు. ఈ నేపథ్యంలో ఈ రేషన్​ కార్డులను వీలైనంత త్వరగా రేషన్​లబ్ధిదారులకు అందించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు 

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో డిజిటల్​ రేషన్​ కార్డులు వినియోగిస్తున్నారు. ప్రధానంగా హర్యానా రాష్ట్రంలో ఏటీఎం కార్డుల తరహాలో ఉండే డిజిటల్ రేషన్ కార్డ్స్ విధానం విజయవంతంగా అమలవుతున్నది. ఉత్తరప్రదేశ్​లో బార్ కోడ్ తరహాలో రేషన్ కార్డుల విధానం అమల్లో ఉంది. ఒడిశాలో ఏటీఎం తరహాలో ఉండే రేషన్ కార్డులను అమలు చేయడానికి  అక్కడి ప్రభుత్వం ప్లాన్​ చేస్తున్నది. గ్రెయిన్ ఏటీఎంల పేరుతో ఒడిశాలో కొత్త రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నది. రాష్ట్రంలోనూ ఇదే తరహాలో డిజిటల్​ విధానంతో రేషన్​ కార్డులను అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.