రాజీవ్ స్వగృహ’ వేలంపై సర్కార్ ఫోకస్

  • ఖాళీగా ఉన్న జాగాలు,  టవర్ల వివరాలు సేకరణ
  • వేలంతో రూ.1,900 కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా
  • గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో భారీగా ఆమ్దానీ
  • ధరలపై స్టడీ చేసి సర్కారుకు రిపోర్టు ఇచ్చిన అధికారులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్లు, జాగాలను వేలం వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రుణమాఫీ, అప్పులు, వడ్డీలతో ఖజనాకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో వేలం చేపట్టి ఆమ్దాని రాబట్టుకునేందుకు ప్రయత్నాలు స్పీడప్ చేసింది. ఇందులో భాగంగా హౌసింగ్ అధికారులు అన్ని జిల్లాల్లో ఉన్న ఖాళీ జాగాలు, అపార్ట్ మెంట్లు, టవర్ల వివరాల గురించి రిపోర్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి అందజేశారు.

 వీటి ద్వారా సుమారు రూ.1,900 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. కోర్టు వివాదాల్లో ఉన్న జాగాలను కూడా వేలం వేస్తే మరో రూ.1,500 కోట్లు వస్తాయని అధికారులు చెప్తున్నారు.  స్పెషల్ లాయర్లను నియమించి అడ్వకేట్ జనరల్​తో  మాట్లాడి త్వరగా భూ వివాదాలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఈ నిధులు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలుకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తున్నది.

అధికారులతో మూడు కమిటీలు

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ జాగాలు, అపార్ట్ మెంట్లు అమ్మే టైమ్​లో ఖరారు చేయాల్సిన ధరలపై ఇప్పటికే ప్రభుత్వం మూడు కమిటీలు ఏర్పాటు చేసింది. వీటికి జిల్లాల్లో కలెక్టర్లు, జీహెచ్ఎంసీలో కమిషనర్, హెచ్ఎండీఏలో కమిషనర్ నేతృత్వం వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేలం నిర్వహణలో ఎంత రేటు ఖరారు చేశారు? ఇప్పుడు ఎంత రేట్ పెట్టొచ్చు? జాగాలు, అపార్ట్ మెంట్లు ఉన్న ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్​లో ధరలెలా ఉన్నాయి? 

అనే అంశాలపై కమిటీలు స్టడీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాయి. గత ప్రభుత్వంలో కంటే ఈసారి ధరలను స్వల్పంగా పెంచే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి ఈ రిపోర్టు అందజేసి వేలంపై నిర్ణయం తీసుకోనున్నారని అధికార వర్గాల సమాచారం.

గతంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు ఫుల్ రెస్పాన్స్

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల్లో జాగాలు, అపార్ట్ మెంట్లు, బండ్లగూడ, పోచారంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న టవర్లను, అందులో సింగిల్, డబుల్, ట్రిపుల్, ట్రిపుల్ డీలక్స్ ప్లాట్లుగా విభజించి వేలం వేసింది. 2021 నుంచి 2023 డిసెంబర్ వరకు వేలం ద్వారా సుమారు రూ.1,900 కోట్లకు పైగా రెవెన్యూ వచ్చిందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

 బహిరంగ మార్కెట్​తో  పోలిస్తే రాజీవ్ స్వగృహ జాగలు, అపార్ట్ మెంట్ల ధర తక్కువగా ఉండడంతో పబ్లిక్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్ సిటీకి బండ్లగూడ దగ్గర ఉండడం, నాగోల్ మెట్రోకు దగ్గర ఉండడంతో పబ్లిక్ ఇక్కడ రాజీవ్ స్వగృహ అపార్ట్​మెంట్లు కొన్నారు. డబుల్, ట్రిపుల్​, ట్రిపుల్​ డీలక్స్ ఫ్లాట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. డబుల్ బెడ్​రూమ్​ రూ.30 లక్షలు, ట్రిపుల్​ బెడ్ రూమ్ రూ.45 నుంచి రూ.50 లక్షలు, ట్రిపుల్​ డీలక్స్ రూ.60 లక్షల వరకు పలికాయి. కొన్ని జిల్లాల్లో జాగాలను వ్యాపారులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటీపడి కొన్నాయి.

రూల్స్ సవరించే అవకాశం!

పోచారం, గాజుల రామారాం, జవహార్​నగర్​లో  రాజీవ్ స్వగృహ టవర్లను గంపగుత్తగా అమ్మాలని గత బీఆర్ఎస్ సర్కారు భావించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, బిల్డర్లు, పోలీసులు, ఇన్ఫోసిస్ కంపెనీతో పాటు సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్​కు విక్రయించాలనుకుని లెటర్లు రాసింది. అప్పట్లో అధికారులు ఫ్రీ బిడ్డింగ్ మీటింగ్ కూడా నిర్వహించారు. అయితే, జవహార్​నగర్​లో  డంపింగ్ యార్డ్ ఉండడంతో పోలీసులు వెనుకడుగు వేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు, బిల్డర్లు తీసుకొని డెవలప్ చేసి అమ్ముకోవాలని భావించాయి. 

కానీ.. గత సర్కారు ఖరారు చేసిన రూల్స్ వారికి నచ్చలేదు. సవరించాలని నిరుడు జవనరిలో రాజీవ్ స్వగృహ ఆఫీసర్లు నిర్వహించిన మీటింగ్​లో పలు కంపెనీలు, బిల్డర్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. టవర్లు కొనే వాళ్లు చెల్లించే డిపాజిట్​ను 15 రోజుల నుంచి నెలకు పెంచాలని, ఫైనల్ పేమెంట్ కోట్లలో ఉన్నందున మొత్తం చెల్లింపునకు 6 నెలలు టైం ఇవ్వాలని, సింగిల్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయాలని.. ఇలా కొన్ని ప్రతిపాదనలు చేశారు. అయితే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తర్వాత పట్టించుకోలేదు. అయితే, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు.. వేలానికి ముందు ఫ్రీ బిడ్ మీటింగ్ నిర్వహించి వారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించాలని అధికారులు కోరుతున్నారు. గత సర్కార్ పెట్టిన రూల్స్ సవరించే అవకాశాలు, బిల్డర్లు కొనేలా మార్చాలని అధికారులు సూచిస్తున్నారు.

వేలం నిర్వహించే జాగాలు, అపార్ట్ మెంట్ల వివరాలు
పోచారం, గాజుల రామారం, జవహార్ నగర్, ఖమ్మంలో టవర్లు
9 జిల్లాల్లో 1,342 ప్లాట్లు (100 గజాల నుంచి 250 గజాల వరకు)
బండ్లగూడలో 100 సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు
పోచారంలో 580 డబుల్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు