అవుట్​ సోర్సింగ్​ జాబ్స్​కు లక్షల్లో వసూల్​.. కొత్తగూడెం మెడికల్ ​కాలేజీలో అక్రమాలు

  • కొత్తగూడెం మెడికల్ ​కాలేజీలో అక్రమాలు 
  • మరో 155 పోస్టుల భర్తీకి కదులుతున్న ఫైల్​
  • జీతం బిల్లులివ్వాలంటే లంచం ఇవ్వాల్సిందే!

భద్రాద్రికొత్తగూడెం,వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గవర్నమెంట్​హాస్పిటల్ ​అప్​ గ్రేడ్​ కావడం, మెడికల్​ కాలేజీ పరిధిలోకి పోవడంతో అవుట్​ సోర్సింగ్​ నియామకాలకు డిమాండ్​ పెరిగింది. ఈ క్రమంలో ఒక్కొక్కరు ఉద్యోగాల కోసం రూ.2 లక్షల నుంచి రూ. 3లక్షలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. మెడికల్ ​కాలేజీతో పాటు కాలేజీ పరిధిలోని జీజీహెచ్, ఎంసీహెచ్​ల్లో దాదాపు 300 మందికి పైగా పని చేస్తున్నారు. కొత్తగా మరో 155 మందిని నియమించనున్నట్టు సమాచారం. ఈ పోస్టుల కోసం బేరాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది.  

పైసలిస్తే పని అయిపోయినట్లే!

మెడికల్​ కాలేజీలో అవుట్​ సోర్సింగ్​ జామ్స్​ కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పాల్వంచలో మెడికల్​ కాలేజీని మూడేండ్ల కిందట ఏర్పాటు చేశారు. కొత్తగూడెం పట్టణంలోని 100 పడకల గవర్నమెంట్​ హాస్పిటల్​ను 330బెడ్స్​హాస్పిటల్​గా మార్చి మెడికల్​ కాలేజీ పరిధిలోకి తెచ్చారు.  పట్టణంలోని రామవరంలో మెడికల్​ కాలేజీకి అనుబంధంగా 100 పడకల మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

మెడికల్​కాలేజీతో పాటు గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​(జీజీహెచ్​), మాతా, శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్​)లలో సెక్యూరిటీ, పేషెంట్ కేర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్స్, ల్యాబ్ ​టెక్నీషియన్స్​తో పాటు పలు విభాగాల్లో ఇప్పటికే అవుట్ సోర్సింగ్​పద్ధతిలో ప్రయివేట్​ ఏజెన్సీల ద్వారా 300 మందికి పైగా సిబ్బందిని తీసుకు న్నారు. ఓ ఏజెన్సీ 220 మంది, మరో ఏజెన్సీ 81 మంది సిబ్బందిని నియమించింది. అవుట్​ ​సోర్సింగ్​ ఏజెన్సీలు పోస్టులను అమ్ముకుంటున్నాయని అప్పట్లో కలెక్టర్లకు కంప్లైంట్​ ఇచ్చారు.

 ఒక్కోపోస్టును రూ. 2 లక్షల నుంచి రూ. 3లక్షలకు అమ్ముకున్నారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పలు ప్రజా సంఘాల నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఓ ప్రయివేట్​ఏజెన్సీని అప్పటి కలెక్టర్​ బ్లాక్​ లిస్ట్​లో కూడా పెట్టారు. అవుట్​ ​సోర్సింగ్​ నియామకాల్లో జరిగిన లావాదేవీల్లో భాగంగానే అప్పటి ప్రిన్సిపాల్, హాస్పిటల్​ సూపరింటెండెంట్​మధ్య విభేదాలొచ్చాయి. ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసుకున్నారు. 

అప్పటి ప్రిన్సిపాల్​ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టారంటూ సూపరింటెండెంట్​అబ్జక్షన్స్​ పెట్టడంతో ఏడాది కిందట ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పేషెంట్​ కేర్ ​కింద తీసుకున్న కొందరిని డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించుకున్నందుకు కూడా పెద్ద ఎత్తున వసూళ్లు చేశారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కొందరైతే ఆర్నెళ్ల పాటు జీతాల్లేకుండానే డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేయడం గమనార్హం. 

మరో 155 పోస్టుల భర్తీకి కసరత్తు 

మెడికల్​కాలేజీతో పాటు జీజీహెచ్, ఎంసీహెచ్​లో పలు విభాగాల్లో అవుట్ ​సోర్సింగ్​ ద్వారా మరో 155 పోస్టులను భర్తీ చేసేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆమోదం కోసం ఫైల్ పంపారు. కాగా ఈ పోస్టుల కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్​ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు దళారులు రూ. 2.50 లక్షల నుంచి రూ. 3లక్షల వరకు డిమాండ్​ చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. 

లంచం ఇస్తేనే జీతం!

మెడికల్​ కాలేజీతో పాటు జీజీహెచ్, ఎంసీహెచ్​లలో పనిచేస్తున్న ఔట్​ సోర్సింగ్​ సిబ్బందికి జీతాలివ్వాలంటే ఆఫీసర్లకు డబ్బులివ్వాల్సిందేనని తెలుస్తోంది. ఇటీవల ఓ ఏజెన్సీ సిబ్బందికి చెందిన ఆర్నెళ్ల జీతం ఇవ్వకుండా తిప్పుకున్న దాఖలాలున్నాయి. జీతం బిల్లుల కోసం కలెక్టర్​కు కంప్లైంట్​పెట్టినా ఫలితం లేకపోవడంతో సిబ్బంది చివరకు ఆఫీసర్లు అడిగినంత ఇచ్చుకున్నారు.

ప్రస్తుతం జీతం ఇవ్వడంతోపాటు ఇప్పుడు ఔట్​ సోర్సింగ్​పద్ధతిలో పనిచేస్తున్న వారిని తీసేయకుండా ఉండేందుకు కాలేజీ ఏవో ఖలీలుల్లా రూ. 15 లక్షలు డిమాండ్​ చేశారు. రూ.7లక్షలకు ఒప్పందం కుదిరింది. మొదటి దశలో రూ. 3లక్షలు, వారం రోజుల తర్వాత రూ. 4లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో రూ. 3లక్షలు లంచం తీసుకుంటూ మంగళవారం కాలేజీ ఏవో ఏసీబీకి రెడ్​ హ్యాండెడ్​గా దొరికారు.