కొండరెడ్ల గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు సర్కారు నిర్ణయం

  • పీఎం జన్​మన్​ స్కీంతో సమస్యల పరిష్కారం 
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 8 గ్రామాల ఎంపిక 
  • ఈనెల 28 నుంచే ఆ గ్రామాల్లో క్యాంపులు 

భద్రాచలం, వెలుగు : పీవీటీజీ(పర్టిక్యులర్లీ వల్నరబుల్​ ట్రైబల్​ గ్రూప్స్​)లకు మహర్దశ పట్టనుంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొండరెడ్ల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సర్కారు నిర్ణయం తీసుకుంది. పీఎం జన్​మన్​స్కీంతో వారి సమస్యలు తీర్చాలని  భద్రాచలం ఐటీడీఏ ముందుకొచ్చింది. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్​ స్పెషల్ సెక్రటరీ శరత్​ ఆదేశాలతో పీవో రాహుల్​ కొండరెడ్ల గ్రామాల్లో సమస్యలను గుర్తించాలని యూనిట్​ఆఫీసర్లకు సూచించారు. 

8 గ్రామాల ఎంపిక

పీఎం జన్​మన్​ స్కీం అమలుకు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 8 పీవీటీజీ కొండరెడ్ల గ్రామాలను ఎంపిక చేశారు. రెడ్డిగూడెం, గోగులపూడి, తిరుమలకుంట, శుద్ధగోతులగూడెం, నడిమిరెడ్డిగూడెం, బండారిగుంపు, గాండ్లగూడెం, పూసుకుంట గ్రామాల్లో 368 కుటుంబాల్లోని 1,100 మంది జనాభాకు పీఎం జన్ ​మన్​ స్కీం ద్వారా లబ్ధి చేకూర్చాలని భద్రాచలం ఐటీడీఏ యాక్షన్​ప్లాన్ తయారు చేస్తోంది. 

ఆధార్​కార్డులు, బ్యాంకు అకౌంట్, ఆయుస్మాన్ భవకార్డు, పీఎం కిసాన్​ క్రెడిట్ ​కార్డు, ఫారెస్ట్ పోడు భూములకు పట్టాలు అందించే కార్డు, రేషన్​ కార్డు ఇలా అన్నీ వారికి ఏకకాలంలో అందించనున్నారు. ఆదివాసీలు బ్యాంకు అకౌంట్లలో టెక్నికల్​ ప్రోబ్లమ్స్​ఉండడంతో ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ రకాల నగదులు జమ కావడం లేదు. తునికాకు బోనస్​డబ్బులు అందకపోవడానికి కారణం కూడా ఇదే. 

ఇందుకోసం తక్షణమే ఎనిమిది గ్రామాల్లో స్పెషల్​ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. సర్వే నిర్వహించనున్నారు. పలు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. పూసుగుంట గ్రామంలో  రోడ్డు నిర్మాణానికి ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ పేరుతో అనుమతులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కరెంట్, తాగునీటి పైపు లైన్ల నిర్మాణానికి టెక్నికల్​ ప్రాబ్లమ్స్​ వస్తున్నాయి. వీటన్నింటికి  చెల్లుచీటీ పలికి కొండరెడ్ల ఆదివాసీ గ్రామాలకు అభివృద్ధి పనులు తీసుకెళ్లేందుకు ఐటీడీఏ రంగంలోకి దిగింది.

28 నుంచే క్యాంపులు

ఈనెల 28 నుంచే ఎంపిక చేసిన  ఎనిమిది కొండరెడ్ల గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రకాల కార్డులు ఒకేసారి వారికి అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇక ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్వే ద్వారా గుర్తించి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వానికి పంపుతాం. మోడల్​ విలేజ్​లుగా వాటిని తీర్చిదిద్దేలా స్కీంలు అమలు చేస్తాం.

నరేశ్, కొండరెడ్ల ప్రత్యేకాధికారి, ఐటీడీఏ