పంట నష్టం లెక్కింపు షురూ .. గైడ్​లైన్స్ విడుదల చేసిన వ్యవసాయశాఖ డైరెక్టర్

  • ఏఈవోలకు గణన బాధ్యతలు
  • 33 శాతం నష్టం జరిగిన ప్రాంతాల పర్యవేక్షణ
  • ఈ నెల 12లోగా పూర్తి చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవలి వర్షాలతో జరిగిన పంట నష్టం లెక్కలు తీసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు, మొత్తం సాగు భూమిలో 33 శాతానికి మించి పంట నష్టం ఉంటే క్షేత్రస్థాయికి వెళ్లి పంట నష్టం లెక్కించాలని అన్ని జిల్లా వ్యవసాయ అధికారులకు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పంట నష్టం లెక్కించే ప్రక్రియలో వ్యవసాయం, ఉద్యాన పంటల నష్టాలను రెండింటినీ లెక్కించాలని ఆదేశించింది. పంట నష్టం లెక్కింపు  బాధ్యతను క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏఈవోలు) అప్పగించింది. మండల వ్యవసాయ అధికారులు (ఎంఏవో), ఉద్యానవన శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. పంట నష్టంపై ఒకే లిస్ట్ తయారు చేయాలని నిర్ణయించారు.

ఏరోజుకారోజు రిపోర్టు ఇవ్వాలి

సాగు చేసిన పంట పొలాల్లో 33శాతానికి పైగా నష్టం జరిగితే అంచనా వేసి ఏఈవోలు పంపిస్తే ఏడీఏలు, ఎంఏవోలు గ్రామాల వారీగా కచ్చితత్వాన్ని నిర్ధారించి జాబితా రూపొందిస్తారు. జిల్లా వ్యవసాయ అధికారులు ఎన్యుమరేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్లు పంట నష్టం జరిగిన  ప్రాంతాల్లో 25% ఏరియాలో పంటపొలాలను, జిల్లా అగ్రికల్చర్ అధికారులు 5 శాతం ప్రభావిత మండలాలను స్వయంగా సందర్శిస్తారు. డీఏవో ప్రతీ రోజు ఆయా జిల్లాల్లో ఎన్యూమరేషన్ డెయిలీ ప్రొగ్రెస్​ను సాయంత్రం 4 గంటలలోగా డైరెక్టర్ అగ్రికల్చర్​కు నివేదిక అందించాల్సి ఉంటుంది.

పంట నష్టంపై లెక్కలు తీసి మండల అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు, అసిస్టెంట్ అగ్రికల్చర్, హార్టికల్చర్ డైరెక్టర్లు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు, ఆయా జిల్లా కలెక్టర్లు​ సంతకాలు చేసిన పంట నష్టం జాబితాను ఆయా గ్రామపంచాయతీ  కార్యాలయాలలో బహిరంగంగా ప్రదర్శిస్తారు. ఇలా ఇన్‌‌‌‌పుట్ సబ్సిడీలను పొందేందుకు అర్హులైన రైతుల తుది జాబితాను ను సెప్టెంబర్ 12 లోపు సమర్పించాలని వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతులకు సకాలంలో పంట నష్ట పరిహారం అందించడం, పంట నష్టాల నుంచి కోలుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందేలా చూడడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకున్నారు.

గురువారం నుంచే ఎన్యుమరేషన్..

వర్షాలకు జరిగిన పంట నష్టంపై వివరాలను సేకరిస్తూ ఏఈవోలు క్షేత్ర స్థాయిలో ఎన్యుమరేషన్ సర్వే షురూ చేశారు. ప్రత్యేక ఎక్సెల్‌‌‌‌ షీట్‌‌‌‌లో పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరణ చేపట్టారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి రైతు పేరు, తండ్రి పేరు, సోషల్‌‌‌‌ స్టేటస్‌‌‌‌, గ్రామం, మండలం, వేసిన పంట, జరిగిన నష్టం, సర్వే నంబరు, 33 శాతం నష్టం జరిగిందా? అంతకంటే ఎక్కువా? అనే వివరాలను నమోదు చేస్తున్నారు.  రైతుల బ్యాంకు ఎకౌంట్‌‌‌‌ నంబరు, బ్యాంకు, బ్రాంచ్‌‌‌‌, ఐఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌సీ కోడ్‌‌‌‌, ఆధార్‌‌‌‌ నంబరు, భూమి ఉన్న రైతా? కౌలు రైతా? ఇలా అన్ని వివరాలను ఎఈవోలు సేకరిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఏఈవోలు చేపట్టిన సర్వే నివేదికలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందించనున్నారు. గ్రామాల వారిగా పంట నష్టం వివరాలు పొందుపరిచిన జాబితాను ప్రదర్శిస్తారు. ఈ వివరాల ఆధారంగా పంట నష్టపోయిన రైతులను గుర్తించి వారి బ్యాంకు ఖాతాలో ఎకరానికి రూ.10వేల చొప్పున పంట నష్ట పరిహారాన్ని జమ చేయనున్నారు. జిల్లాల వారిగా సమగ్ర వివరాలు వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో పంట నష్టంపై సమగ్ర నివేదికతో నిధులు విడుదల చేయనున్నారు.