రామగుండంలో రోడ్ల విస్తరణకు గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌

  • వివిధ పనుల కోసం టీయూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐడీసీ నిధులు రూ.100కోట్లు రిలీజ్‌‌‌‌‌‌‌‌.. 
  • వీటిలో రోడ్ల విస్తరణకేరూ.30 కోట్లు 
  • ఇప్పటికే మార్కింగ్​పనులు షురూ
  • అడ్డుగా ఉన్న నిర్మాణాల తొలగింపునకు చర్యలు

గోదావరిఖని, వెలుగు:రామగుండం కార్పొరేషన్​ పరిధిలో రోడ్ల విస్తరణకు ప్రభుత్వం గ్రీన్‌‌‌‌‌‌‌‌సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ప్రధాన వ్యాపార కేంద్రం లక్ష్మినగర్​, కళ్యాణ్​నగర్​, మార్కండేయకాలనీ, గణేశ్​ నగర్​, తదితర ప్రాంతాలలో రోడ్ల విస్తరణకు మోక్షం లభించింది. ఇరుకుగా ఉన్న రోడ్లను వెడల్పు  చేసేందుకు బల్దియా టౌన్​ ప్లానింగ్​ విభాగం ఆధ్వర్యంలో మార్కింగ్​ మొదలు పెట్టారు. 

ఆయా ప్రాంతాల్లో నిర్దేశించిన మేరకు కొలతలు పెట్టి అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. రోడ్ల విస్తరణ పూర్తయితే మార్కెట్‌‌‌‌‌‌‌‌తోపాటు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్​ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. టీయూఎఫ్​ఐడీసీ స్కీమ్​ కింద విడుదలైన రూ.100 కోట్లను ఈ పనుల కోసం కేటాయించగా.. వీటిలో కేవలం రోడ్ల విస్తరణకే రూ.30 కోట్లు కేటాయించనున్నారు. 

30 నుంచి 60 ఫీట్ల వరకు విస్తరణ...

రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని  వివిధ ప్రాంతాల్లో రోడ్ల వెడల్పు కోసం సెప్టెంబర్​11న నిర్వహించిన కౌన్సిల్​ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో తీర్మానం చేశారు. ఇందులో భాగంగా ఓల్డ్​ అశోక్​ టాకీస్​ నుంచి సాయి జ్యువెల్లరీ వరకు, మార్కండేయకాలనీ గణేశ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు నుంచి విజయ పిల్లల హాస్పిటల్​ వరకు, రీగల్​ షూమార్ట్​ నుంచి బాలాజీ స్వీట్​ హౌస్​ వరకు, కల్యాణ్​నగర్​ మెయిన్​ రోడ్డు నుంచి ప్రాఫిట్​ షూ మార్ట్​ వరకు, స్వతంత్ర చౌక్​ నుంచి పాత మున్సిపల్​ ఆఫీస్​ వరకు, రీగల్​ షూమార్ట్​ జంక్షన్​ విస్తరణ, అభివృద్ధి చేయడానికి నిర్ణయించగా, ఆ మేరకు పనులు మొదలు పెట్టారు.  

రోడ్ల విస్తరణ ఆయా ప్రాంతాలను బట్టి 30 ఫీట్ల నుంచి 60 ఫీట్ల వరకు చేయనున్నారు. రోడ్ల విస్తరణతో పాటు డ్రైనేజీలు, ఇతర నిర్మాణల కోసం టీయూఎఫ్​ఐడీసీ స్కీమ్​ కింద విడుదలైన రూ.100 కోట్ల నిధులతో ఈ పనులు చేపట్టడానికి టెండర్లు చేపట్టారు. రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని మెయిన్​ మార్కెట్​ ఏరియాలో రోడ్ల విస్తరణ సమస్య కొన్నేళ్లుగా ఉండగా.. ఎమ్మెల్యేగా ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ ఎన్నికయ్యాక విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్న పలు సింగరేణి క్వార్టర్లను కూల్చివేశారు. ఓల్డ్​ అశోక్​ థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా పూర్తిగా పడగొట్టారు. మొత్తంగా విస్తరణకు అడ్డుగా ఉన్న 72 సింగరేణి క్వార్టర్లు ఖాళీ చేసేలా వారికి అవగాహన కల్పించారు. తాజాగా మెయిన్​ మార్కెట్​ ఏరియాలో గల ఇరుకు రోడ్లను విస్తరించేందుకు మార్కింగ్​ పనులు మొదలు పెట్టారు. 

ట్రాఫిక్​ కష్టాలకు చెక్​

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కేశోరామ్​, ఇతర పరిశ్రమలున్నాయి. వీటిల్లో పనిచేసే ఆఫీసర్లు, ఉద్యోగులు, కార్మికులు వివిధ అవసరాలు, హాస్పిటళ్ల కోసం నిత్యం గోదావరిఖనిలోని లక్ష్మినగర్​, కల్యాణ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అశోక్​నగర్, మేదరిబస్తి, తదితర ప్రాంతాలకు రావాల్సి ఉంటుంది. అయితే వారు తీసుకువచ్చిన వాహనాలను రోడ్డుపై నిలిపేందుకు పార్కింగ్ స్థలాలు దొరకని పరిస్థితి. దూర ప్రాంతాలలో తమ వాహనాలను నిలిపి నడిచి వస్తుంటారు. అలాగే హాస్పిటళ్లకు రోగులు రావాలన్నా, ఇక్కడి నుంచి రోగులు కరీంనగర్​, హైదరాబాద్​తరలించాలన్నా అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లకు కూడా దారి దొరకదు. రోడ్ల విస్తరణతో ఈ సమస్యలకు చెక్‌‌‌‌‌‌‌‌ పడనుంది.