ఉమ్మడి ఖమ్మం జిల్లాలో .. టూరిజం హబ్​గా పాలేరు టు పర్ణశాల

  • పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్లాన్​ 
  • ఖమ్మం జిల్లాలో రూ.44 కోట్లతో సిద్ధమైన ప్రపోజల్స్​
  • రూ.29 కోట్లతో ఖిల్లాపై  రోప్​వేకు ప్రతిపాదనలు
  • భద్రాద్రి జిల్లాలో రూ.23 కోట్లతో జరుగుతున్న పనులు
  •  నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన 

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టూరిజం డెవలప్​మెంట్​పై ప్రభుత్వం దృష్టిపెట్టింది. పాలేరు నుంచి పర్ణశాల వరకు ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో తుమ్మల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల అభివృద్ధికి ఉన్న అవకాశాల గురించి చర్చించారు. ఫీల్డ్ విజిట్ చేయాలన్న మంత్రి తుమ్మల ఆహ్వానం మేరకు సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు.  

చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలెన్నో..

ఉమ్మడి జిల్లాలో టూరిజం ఎట్రాక్షన్స్ చాలానే ఉన్నాయి. చారిత్రక ప్రాంతాలతో పాటు, ఆధ్యాత్మిక ప్రాంతాలు కూడా ఉన్నాయి. జాతీయ రహదారికి సమీపంలోనే పాలేరు రిజర్వాయర్​ ఉండడంతో పర్యాటకంగా అభివృద్ధి చేయా లని భావిస్తున్నారు. రిజర్వాయర్​లోని మూడు ఐలాండ్స్​ను అనుసంధానం చేసి అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.9 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదించారు. పాలేరులోని పార్కులు కళావిహీనంగా మారడంతో వాటిని కూడా డెవలప్ ​చేయనున్నారు. సమీపంలోనే దేశంలోనే రెండో అతిపెద్ద శివలింగం కొలువైన కూసుమంచి శివాలయం ఉంది. 

ఇక దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన నేలకొండపల్లి బౌద్దస్తూపం అభివృద్ధి కోసం రూ.5.82 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారు. సైట్ మ్యూజియం ఏర్పాటు చేసి, తవ్వకాల్లో లభించిన కళాఖండాలను, ఇతర విగ్రహాలను అందులో ఉంచాలని  ప్లాన్​  చేశారు. ఇతర మౌలిక వసతుల కల్పన, స్తూపానికి ఎదురుగా ఉన్న బాలసముద్రం చెరువు అభివృద్ధి, బోటింగ్ సిద్ధం చేయాలని భావిస్తున్నారు. టూరిజం శాఖ ద్వారా ఇప్పటికే అక్కడ ఆరు గదులు, కేఫెటేరియాతో గెస్ట్ హౌజ్​ సిద్ధం కాగా, ఇతర వసతులు కల్పించనున్నారు. భక్త రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధికి ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. 

భద్రాద్రి జిల్లాలో ఎకో టూరిజం కింద..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎకో టూరిజం కింద ప్రస్తుతం రూ.23 కోట్లతో పనులు జరుగుతున్నాయి. కొత్తగూడెం క్రాస్ రోడ్డులో(హరిత) బడ్జెట్ హోటల్ నిర్మాణం కొనసాగుతుంది. ఈ ప్యాకేజీలోనే కిన్నెరసానిలో అద్దాలమేడ నిర్మాణం, తొమ్మిది బ్లాకుల్లో కాటేజీల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఒక్కో కాటేజీ బ్లాకులో నాలుగు రూములు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కిన్నెరసానిలో డీర్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల కిందట కిన్నెరసానిలోని అద్భుత కట్టడమైన అద్దాలమేడను మావోయిస్టులు పేల్చివేశారు. అప్పటినుంచి అద్దాలమేడ పర్యాటకులకు కలగానే మిగిలింది.

 భద్రాచలంలో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీం కింద దాదాపు రూ.40 కోట్లతో టెంపుల్ డెవలప్​మెంట్, ఇతర పర్యాటక పనులు కొనసాగుతున్నాయి. భద్రాచలంలో రామాయణ థీమ్ ​పార్క్​ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. కరకట్ట దగ్గర టూరిజం డెవలప్​మెంట్​కోసం అభివృద్ధి పనులు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. వీటికి అదనంగా కిన్నెరసాని అభయారణ్యం, సింగరేణి గనులు, కేటీపీఎస్​పవర్​ప్లాంట్స్, ఐటీసీ, హెవీ వాటర్ ప్లాంట్ ఉండడంతో పర్యాటకులకు వినోదంతో పాటు వైజ్ఞానికంగా ఆహ్లాదం కలగనుంది. 

వీటిన్నింటిలో కొన్ని పర్యాటక హంగులు కల్పించడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి మరిన్ని అవకాశాలున్నాయి. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ఉమ్మడి జిల్లా పర్యటనకు వస్తుండడంతో, ఆయా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు.

వందల ఏండ్ల ఖిల్లా అభివృద్ధి 

ఖమ్మం నడిబొడ్డున ఉన్న ఖిల్లా 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 900 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కోట పురాతన వైభవాన్ని సంతరించుకునేలా పునర్నిర్మాణం చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం రూ.29 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. ఖిల్లాపై రోప్​ వే, టూరిస్టులకు మౌలిక వసతులు, టాయిలెట్స్​, చుట్టూ లైటింగ్, ఖిల్లా చరిత్రను వివరించేలా సూచిక బోర్డుల ఏర్పాటుతోఓ పాటు కోట గోడలను పునరుద్ధరించాలని భావిస్తున్నారు.  వీటితో పాటు ఖిల్లాపై వ్యూ పాయింట్ నిర్మించాలని మంత్రి తుమ్మల ప్లాన్ చేస్తున్నారు.

 ఖిల్లాను ఆనుకొని ఉన్న జాఫర్​ బావిని గతేడాది రూ.60 లక్షల ఖర్చుతో పునరుద్ధరించి లైటింగ్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు లకారం ట్యాంక్​బండ్​పై పర్యాటక అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటు వైరా రిజర్వాయర్ డెవలప్​మెంట్, మధిరలో పెద్ద చెరువు అభివృద్ధికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్లాన్​ చేస్తున్నారు.