జీవన్‌‌‌‌దాన్‌‌‌‌కు కొత్త రూల్స్‌‌‌‌ .. ఆఫీసర్లకు మంత్రి దామోదర రాజనర్సింహ సూచన

  • బ్రెయిన్‌‌‌‌ డెత్స్‌‌‌‌పై ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ కమిటీతో ఆడిట్
  • జ్వరాలపై డీఎంహెచ్‌‌‌‌వోలతో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న అవయవ మార్పిడి దందాపై ప్రభుత్వం దృష్టి సారించింది.  జీవన్‌‌‌‌దాన్‌‌‌‌లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని కార్పొరేట్ హాస్పిటళ్లు చేస్తున్న అక్రమ వ్యాపారంపై ఇటీవల ‘వెలుగు’లో వచ్చిన వరుస కథనాలపై మంత్రి దామోదర రాజనర్సింహా స్పందించారు. గురువారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో జీవన్‌‌‌‌దాన్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి, జీవన్‌‌‌‌దాన్ పూర్వాపరాలను తెలుసుకున్నారు. ‘‘ఒక కిడ్నీ నీకు, ఒక కిడ్నీ నాకు అన్నట్టుగా రూల్స్ ఉన్నాయి’’ అని, దీన్ని ఎట్లా కొనసాగిస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది.

 2011లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను ఎందుకు అడాప్ట్‌‌‌‌ చేసుకోలేదని ప్రశ్నించినట్టు సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలను మార్చాల్సి ఉందని, కొత్త రూల్స్ అవసరం అని అధికారులు, డాక్టర్లు మంత్రికి సూచించగా, పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని సూచించినట్టు తెలిసింది. అంతేకాదు, బ్రెయిన్ డెత్స్‌‌‌‌పై ఆడిట్ చేసేందుకు ఎక్స్‌‌‌‌పర్ట్ కమిటీని నియమించాలని మంత్రి సూచించినట్టు సమావేశంలో పాల్గొన్న అధికారులు వెలుగుకు తెలిపారు. బ్రెయిన్‌‌‌‌ డెత్స్ ప్రకటనలో పూర్తి పారదర్శకత ఉండాలని, అవయవాలను ఎవరికి ఇవ్వాలనే దానిపైనా స్పష్టమైన నిబంధనలు ఉండాలని మంత్రి సూచించినట్టు తెలిసింది. మరో రోజు ఈ అంశంపై పూర్తిస్థాయిలో రివ్యూ చేస్తానని, అన్ని వివరాలతో సిద్ధంగా రావాలని మంత్రి తెలిపారు.

డెంగీపై చర్యలు తీసుకోండి

డెంగీ విషయంలో ప్రజలను ఆందోళనకు గురిచేసే హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌‌‌వోలను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు గురువారం డీఎంహెచ్‌‌‌‌వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాస్పిటళ్లలో పర్యటించి, తనకు నివేదిక అందజేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి జ్వరంతో ఇబ్బంది పడుతున్న వారి రక్త నమూనాలను సేకరించి, పరీక్షలు చేయించాలని సూచించారు. డెంగీ హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలను చేపట్టాలన్నారు. 

దోమల నివారణకు నాలాలు, చెరువుల్లో ఆయిల్ బాల్స్ వేయించాలని సూచించారు. ప్రతి రోజూ సాయంత్రం డెంగీ, వైరల్ ఫీవర్లపై సమాచారాన్ని కంట్రోల్‌‌‌‌ రూమ్‌‌‌‌కు అందజేయాలని డీఎంహెచ్‌‌‌‌వోలను ఆదేశించారు. డెంగీ నిర్దారణకు ఎలీసా టెస్ట్‌‌‌‌ తప్పనిసరిగా చేసేలా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ర్యాపిడ్ టెస్ట్‌‌‌‌ ద్వారా డెంగీ నిర్దారించి, పేషెంట్లను భయాందోళనకు గురిచేసే హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని హాస్పిటళ్లలో డాక్టర్లు, ఇతర సిబ్బంది, అవసరమైన మెడిసిన్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.