పెద్దపల్లి జిల్లాలో.. కూల్చివేతలు షురూ 

  • చెరువు, కుంటలు, నాలాల ఆక్రమణలపై సర్కార్ ​ఫోకస్‌‌
  • అధికారుల నిర్ణయంతో ఆక్రమణదారుల్లో టెన్షన్​
  • ఇప్పటికే జిల్లాలోని బఫర్ జోన్లలో ఉన్న వెంచర్ల గుర్తింపు
  • అధికారుల చేతికి కబ్జాల చిట్టా 

పెద్దపల్లి, వెలుగు: హైడ్రా తరహాలో పెద్దపల్లి జిల్లాలోనూ ఆక్రమణలపై సర్కార్​ ఫోకస్ పెట్టింది. జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగుల బఫర్‌‌‌‌జోన్లు, ఎఫ్టీఎల్​ పరిధుల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఇప్పటికే స్టార్ట్‌‌ అయ్యాయి. ఇప్పటికే చాలాచోట్ల బఫర్‌‌‌‌జోన్లలో ఏర్పాటు చేసిన వెంచర్లను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆ వివరాల ఆధారంగా కూల్చివేతలు కొనసాగే చాన్స్‌‌ ఉంది. అలాగే పట్టణాల్లో కబ్జాకు గురైన నాలాలను గుర్తించిన అధికారులు.. ఆక్రమణలు కూల్చివేతకు సిద్ధపడుతున్నారు. 

బఫర్‌‌‌‌జోన్‌‌, ఎఫ్‌‌టీఎల్ పరిధిలో వెంచర్లు

పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని బంధంపల్లి, రంగంపల్లి చెరువుల్లో వెంచర్లు ఏర్పాటయ్యాయి. బఫర్‌‌‌‌జోన్, ఎఫ్టీఎల్‌‌లో చాలావరకు వెంచర్లు వేసినట్లు అధికారులు గుర్తించారు. ఈక్రమంలో రెండు రోజుల కింద బంధంపల్లి చెరువు బఫర్‌‌‌‌జోన్‌‌లో నిర్మించిన షెడ్లతో పాటు వెంచర్ల చుట్టూ నిర్మించిన కాంపౌండ్​ వాల్స్​ను కూల్చివేశారు. దీంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన రియల్టర్లలో టెన్షన్‌‌ మొదలైంది.

అయితే వీరిలో కొందరు ఇప్పటికే ఆ ప్లాట్లను అమ్మేశారు. ఇలాంటి ప్లాట్లపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని తీసుకుంటారోనని కొన్నవారిలోనూ ఆందోళన మొదలైంది. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపినట్లయితే ఈ రెండు చెరువులకు సంబంధించి మరిన్ని ఆక్రమణలు బయటపడుతాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. 

పట్టణాల్లో నాలాలు కబ్జా

జిల్లాలోని పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, సుల్తానాబాద్​ పట్టణాల్లో నాలాలు కబ్జాకు గురయ్యాయి. గతంలో గోదావరిఖనిలో ఓ బీఆర్​ఎస్​ నాయకుడు నాలాను కబ్జా చేశాడని,  దాంతో వర్షపు నీటితో పాటు డ్రైనేజీ నీరు ఇండ్లల్లోకి వస్తుందని,  అక్కడి ప్రజలు ఆందోళన చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్‌‌నగర్, సాగర్​రోడ్​, భూంనగర్​, కునారం రోడ్​, పాత కోర్టు ఏరియా, రంగంపల్లి ఏరియాల్లోని నాలాల మీద నిర్మాణాలు జరిగాయని గతంలో ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. నాలాలు కబ్జా కావడంతో వర్షం పడినప్పుడల్లా పోలీస్‌‌స్టేషన్‌‌ రోడ్​ పూర్తిగా మునుగుతోంది.

అలాగే రాజీవ్​ రహదారికి అనుబంధంగా ఉన్న కునారం రోడ్​, ఆర్టీఏ ఆఫీసు రోడ్​తో పాటు ఆ ప్రాంతమంతా మునుగుతోంది. ప్రస్తుతం సర్కార్​ ఆదేశాలతో కలెక్టర్ ఆక్రమణల గుర్తింపు చేపట్టడంతో నాలాల మీద ఉన్న నిర్మాణాల యజమానుల్లో టెన్షన్ మొదలైంది.  రానున్న రోజుల్లోనూ ఆక్రమణలు కూల్చివేతలు కొనసాగించేందుకు యంత్రాంగం సమాయత్తమవుతోంది.