నుడా విస్తరణకు గ్రీన్​ సిగ్నల్​

  • కార్పొరేషన్ సహా మూడు మున్సిపాలిటీలు, 380 గ్రామాలు విలీనం 
  • జిల్లాలో మూడు విభాగాల పరిధి కూర్పు
  • నుడా చైర్మన్​ పదవీకాలం మూడేళ్లు
  • వైస్​ చైర్మన్​గా నగర పాలక సంస్థ కమిషనర్

నిజామాబాద్,  వెలుగు:  నిజామాబాద్​అర్బర్​డెవలప్​మెంట్​అథారిటీ (నుడా) పరిధిని ప్రభుత్వం​విస్తరించింది. టౌన్​ల మాదిరి పల్లెల రూపరేఖలు మార్చే తలంపుతో జిల్లాలోని మొత్తం 545 గ్రామాలలోని 380 గ్రామాలను దీని కింద చేర్చారు. ఇంతకు ముందు కేవలం 73 గ్రామాలు నుడా కింద ఉండేవి. నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్ల నుడా పరిధిలోకి ఇప్పుడు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలను చేర్చారు. కార్పొరేషన్​ సహా జిల్లాలోని మొత్తం మూడు మున్సిపాలిటీలను విలీనం​ చేశారు.

లేఅవుట్లు, బిల్డింగ్​పర్మిషన్లు

2017 మే నెలలో నుడా ఏర్పడింది. మున్సిపల్​కార్పొరేషన్ కమిషనర్ కొన్నాళ్లు దీనికి ఇన్​చార్జి​ చైర్మన్​గా వ్యవహరించారు. తరువాత మూడేండ్ల పదవి బాధ్యతలతో ప్రభాకర్​రెడ్డి చైర్మన్​గా నియమితులు కాగా పాలక సభ్యులు ఉండేవారు. తరువాత ఈగ సంజీవ్​రెడ్డి రెండవ చైర్మన్​గా కేవలం రెండు నెలలు మాత్రమే పనిచేశారు.  నగరంతో పాటు డిచ్​పల్లి, మాక్లూర్, ఎడపల్లి, నవీపేట మండలాల్లోని 73 గ్రామాలు నుడా కింద కొనసాగేవి. 

రియల్​ ఎస్టేట్​ వెంచర్లు డెలప్​మెంట్,  అపార్ట్​మెంట్ల నిర్మాణం, 200 గజాలకు మించిన ప్లాట్​లో ఇంటి నిర్మాణాల పర్మిషన్ కూడా నుడా కింద చేర్చారు. టౌన్​ ప్లానింగ్ సిబ్బంది కోఆర్డినేషన్​తో పర్మిషన్ల ఇవ్వడంతో పాటు మెయిన్​ రోడ్​లలో డివైడర్ల మధ్య మొక్కల పెంపకం నిర్వహించేది. ఇప్పుడు దాని పరిధిని భారీగా విస్తరించారు. గతంలో 169 చదరపు కిలోమీటర్ల మేరకు 6.33 లక్షల జనాభాకు పరిమితమైన సేవలు ఇప్పుడు 4,288 చదరపు కిలోమీటర్లతో 12 లక్షల జనాభాకు పెంచేశారు. జిల్లాలోని 33 మండలాల కింద ఉన్న 380 గ్రామాలకు నుడా సర్వీస్​లు అందబోతున్నాయి. 

కీలకం కానున్న అదనపు కలెక్టర్ల సేవలు

మూడేండ్ల పదవీ కాలంతో  నుడాకు మూడవ చైర్మన్​గా  కేశవేణును ప్రభుత్వం నామినేట్​చేయగా పది రోజుల కింద బాధ్యతలు స్వీకరించారు.  వైస్​ చైర్మన్​గా నగర పాలక సంస్థ కమిషనర్​ వ్యవహరిస్తారు. జిల్లాలోని టౌన్​ ప్లానింగ్​ విభాగం అంతా దీనికింద పనిచేస్తుంది.  ఇక నుంచి అదనపు కలెక్టర్లు​(లోకల్​ బాడీస్​) పాత్ర​ కీలకం కానుంది. 

బిల్డింగ్​ నిర్మాణాల పర్మిషన్​ కోసం ఆన్​లైన్​ దరఖాస్తులు, లేఅవుట్​అర్జీలు వీరికి డైవర్ట్​అవుతాయి. ఐఏఎస్​ స్థాయి ఆఫీసర్ల పర్యవేక్షణ ఉంటుంది, దీంతో నిబంధనల అతిక్రమణకు, అక్రమాలకు ఆస్కారం ఉండదు. అయితే అర్బన్​, రూరల్​ ఏరియాల గ్రౌండ్​ లెవల్​ సిబ్బంది కోఆర్డినేషన్ విషయంలో కొన్ని క్లారిటీలు రావాల్సి ఉంది. ​