దోపిడి సంస్థలను అరికట్టలేకపోతే ఏ దేశం సుపరిపాలన దిశగా అడుగులు వెయ్యలేదు. దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోలేదు. సహనం లేక ట్రాఫిక్ సిగ్నల్‌ను జంపు చేసి, ప్రభుత్వ సేవల కోసం అధికారులకు లంచం ఇచ్చి పని చేయించుకొని, అధికార దాహంతో ఎన్నికలలో ఖర్చుపెట్టి చట్టసభలలోకి ప్రవేశించిన వ్యక్తి, ప్రభుత్వంలోని అధికారుల అవినీతిని ప్రశ్నించగలడా ? రాజ్యాంగబద్దమైన ప్రజాస్వామ్యాన్ని తెలుసుకొని, అర్థం చేసుకుని ప్రజల కనీస అవసరాలను తీర్చగలడా? గుత్తేదారుల దగ్గర కమీషన్లు తీసుకోకుండా ప్రజాపనులు నాణ్యతగా ఉండాలని కోరుకుంటాడా? ఉద్యోగ నియామకాల్లో పరీక్షా పత్రాలు లీక్ కాకుండా బాధ్యత వహిస్తాడా అంటే ముమ్మాటికి కాదని చెప్పాలి.
ప్రజాస్వామ్యంలో ప్రజలు చెల్లించిన పన్నులతోనే ప్రభుత్వాలు నడుస్తాయి. ప్రజలకు ప్రభుత్వాలపై విశ్వాసం కలిగించే విధంగా పాలన సాగించాలంటే మన ప్రభుత్వ వ్యవస్థలు వారి సంక్షేమం, అభివృద్ధి కోసమే పారదర్శకంగా జవాబుదారీతనంతో సుపరిపాలన అందించాలి. కొన్ని దేశాలు అభివృద్ధి చెందుతుంటే, మరికొన్ని దేశాలు పేదరికంలో మగ్గడానికి కారణం చట్టబద్ధమైన పాలన చేయలేకపోవడమే. మంచి పరిపాలన ఇవ్వలేకపోవడం, దోపిడీ సంస్థలను అరికట్టడంలో విఫలమవడం అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువగా పెరగడానికి దారితీస్తుంది.
పెరుగుతున్న బాధ్యతారాహిత్యం
రోడ్డుపై ఒక ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదం గురించి గొడవపడి ఆరా తీస్తారే తప్ప ప్రమాదానికి గురై రక్తంకారుతూ దీనస్థితిలో ఉన్న మనిషిని పట్టించుకోం. అంబులెన్స్‌కు ఫోను చేయం. అదే సమాజం నుంచి చట్ట సభలలోకి వెళ్ళిన వ్యక్తి ఆసుపత్రిలో ఆపరేషన్ కిట్స్, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు లేవని మన గురించి ఆలోచిస్తాడా? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మారేవారు ప్రజల గురించి ఆలోచిస్తారని అనుకోవడం మన భ్రమే. శాసన వ్యవస్థ ప్రథమ కర్తవ్యం దేశానికి, రాష్ట్రానికి అవసరమైన చట్టాలను లేక శాసనాలను చేయటం.
ప్రజా సమస్యలను చట్టసభల దృష్టికి తెచ్చి వాటిపై కూలంకషంగా చర్చ జరగాలి. పరిష్కార మార్గాలను అన్వేషించాలి. కానీ, అక్కడ దూషణలతో కాలయాపన జరుగుతోంది. పరుషమైన భాషను ఉపయోగించి బలప్రదర్శన చేసి తమ విలువైన సమయాన్ని దుర్వినియోగం చేస్తున్న విషయం గమనిస్తూనే ఉన్నాం. చట్టసభల్లో చేసిన శాసనాలను అమలు చేయడమే పాలనా వ్యవస్థ బాధ్యత. అధికారులు తమ విధులు నిర్వర్తించడంలో అలసత్వం. తాత్సారం చేసి ప్రజలను తమకు హక్కుగా భావించే వాటి విషయంలో కూడా లంచాల కోసం వేధిస్తున్నారు.
నోబెల్ గ్రహీతల హితవు గమనించాలి
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఎంత మందికి శిక్షలు వేస్తున్నారు? చట్టాలను అమలు చేసేవారే అవినీతికి పాల్పడితే దోపిడీదారులను పన్నుల ఎగవేతదారులను ఎలా ఎదుర్కొంటారు? కంచే చేను మేసేలాగ ఉంది. సమాచారహక్కు చట్టం అమలులోకి వచ్చి 19 ఏండ్లు పూర్తి అయ్యాయి. ఈ చట్టం ద్వారా ప్రజలు ప్రభుత్వం నుంచి సమాచారం కోరుకునే హక్కు కలిగి ఉన్నాం.
దేశంలో చాలా రాష్ట్రాలు అధికారములో ఉన్నవారు. సమాచార కమీషనర్లను నియమించకపోవడం చాలా దురదృష్టకరం. దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలపై పరిశోధన చేసిన టర్కీష్ అమెరికన్ డారన్ ఎసి మోగ్లు , బ్రిటిష్ అమెరికన్ సైమన్ జాన్సన్, బ్రిటిష్ ఎకనమిస్ట్ జేమ్స్ ఎ రాబిన్సన్ అనే ముగ్గురు ప్రొఫెసర్లకు ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించిన సంగతి మనకు తెలిసిందే.
ఒక దేశ శ్రేయస్సులో సామాజిక సంస్థల ప్రాముఖ్యతను వివరిస్తూ ఆయా దేశాలలో చట్టబద్ధమైన పాలన లోపించడంతో ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం లేదని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు సామాజిక సంస్థలు బలంగా ఉన్న దేశాలే సుసంపన్నంగా మారాయని తెలిపారు.
- సోమ శ్రీనివాస్ రెడ్డి,కార్యదర్శి, ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్–