కరీంనగర్ జిల్లా మొత్తం సుడా పరిధిలోకి..

  • పట్టణాభివృద్ధి సంస్థ ప్రతిపాదనకు సర్కార్​ ఓకే..

కరీంనగర్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎక్కువగా నిధులు రాబట్టుకోవడంతోపాటు లేఔట్ చార్జీలు, బిల్డింగ్ పర్మిషన్ల ద్వారా స్వయం సమృద్ధి అయ్యేందుకు శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(సుడా) పరిధిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు 62 గ్రామాలు సుడా పరిధిలో ఉన్నాయి. వీటితోపాటు మరో రెండు మున్సిపాలిటీలతోపాటు 168 గ్రామాలను తీసుకొచ్చేందుకు సుడా ప్రతిపాదనలు పంపగా.. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. సుడా పరిధి విస్తరిస్తే జిల్లా నలుమూలలా ఎక్కడైనా ఆయా గ్రామాల పరిధిలో ఏర్పాటయ్యే లేఔట్లకు, ఆ తర్వాత జీ+ 3 బిల్డింగ్ నిర్మాణాలకు సుడా స్థాయిలోనే అనుమతులు మంజూరు కానున్నాయి. 

పరిధి తక్కువ.. ఆదాయమూ తక్కువే..

శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(సుడా)ను 2017లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ పరిధిలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు 62 గ్రామపంచాయతీలను చేర్చారు. రాష్ట్రంలోని ప్రధాన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలైన హెచ్ఎండీఏ, కుడాతో పోలిస్తే.. సుడా పరిధి చాలా తక్కువగా ఉంది. పరిధి తక్కువగా ఉండడంతో సుడాకు లేఔట్లు, భారీ నిర్మాణాల ద్వారా వచ్చే ఆదాయం కూడా తక్కువగానే ఉంది.

 అందుకే సుడా పరిధిని విస్తరించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలనే ఆలోచలనతోనే సుడా పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందుకే కరీంనగర్ జిల్లా మొత్తాన్ని సుడా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. ఈ మేరకు సుడా ఆఫీసర్లు ప్రపోజల్స్ సిద్ధం చేసి పంపారు. ఈ ప్రపోజల్స్ ప్రకారం జిల్లాలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు కొత్తపల్లి, చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు, 230 గ్రామపంచాయతీలు సుడా పరిధిలోకి రానున్నాయి. 

సులువుగా అనుమతులు.. 

ప్రస్తుతం సుడా పరిధి అవతల ఉన్న మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో లేఔట్లు వేయాలన్నా, జీప్లస్ 3 బిల్డింగ్స్ నిర్మించాలన్నా హైదరాబాద్ లోని డీటీసీపీ అప్రవూల్ కు వెళ్లాల్సి ఉంది. కానీ ఆయా గ్రామాలు, మున్సిపాలిటీలు సుడా పరిధిలోకి వస్తే కరీంనగర్ లోని సుడాలోనే ఈ అనుమతులు పొందవచ్చు. తద్వారా సుడాకు వచ్చే ఆదాయాన్ని ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో రోడ్లు, పార్కులు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, డివైడర్ల నిర్మాణానికి ఖర్చు చేయవచ్చు. 

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.. 

గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చాలా తక్కువ విస్తీర్ణంతో సుడాను ఏర్పాటు చేశారు. దీంతో సుడాకు సొంతంగా పెద్దగా ఆదాయం రావడం లేదు. సుడా నిధులతో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే జరిగాయి. అందుకే సుడా పరిధిని కరీంనగర్ జిల్లావ్యాప్తం చేయాలని, సుడాకు ప్రత్యేకంగా ఓ ఆఫీసర్ ను వైస్ చైర్మన్ గా నియమించాలని ప్రతిపాదనలు పంపాం. త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. - కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్