బుద్ధవనం అభివృద్ధికి.. రూ.100 కోట్లు

నల్గొండ, వెలుగు: నాగార్జున సాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ సమీపంలో ఉన్న బుద్ధవనాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. ఆసియా ఖండంలోని వివిధ దేశాల నుంచి బౌద్ధ మతస్తులు, టూరిస్ట్‌‌‌‌లు ఇక్కడికి వస్తున్నందున అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు.

‘స్వదేశీ దర్శన్‌‌‌‌’ ప్రాజెక్ట్‌‌‌‌ కింద బుద్ధవనాన్ని ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. వివిధ రకాల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించింది.  సుమారు 274 ఎకరాల్లో విస్తరించి ఉన్న బుద్ధవనాన్ని అంతర్జాతీయ పర్యాటకులు ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు.

కేంద్రం ప్రకటించిన నిధులతో కన్వెన్షన్‌‌‌‌ సెంటర్‌‌‌‌, అంతర్జాతీయ బౌద్ధ విజ్ఞాన పరిశోధన కేంద్రం, బౌద్ధ విద్యాలయాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ పనులు ఈ నెలలోనే మొదలుకానున్నాయి.

రూ.100 కోట్లు కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘స్వదేశీ దర్శన్‌‌‌‌ 2.0’ స్కీమ్‌‌‌‌లో భాగంగా సాగర్‌‌‌‌ వద్ద గల బుద్ధవనాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి డీపీఆర్‌‌‌‌ పంపించింది. దీంతో బుద్ధవనాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం రూ.100 కోట్లను కేటాయించింది. 

ఇందులో రూ. 25 కోట్లతో బుద్ధిస్ట్‌‌‌‌ డిజిటల్‌‌‌‌ మ్యూజియం అండ్‌‌‌‌ ఎగ్జిబిషన్‌‌‌‌, డిజిటల్‌‌‌‌ ఆర్కివ్స్‌‌‌‌ను  ఏర్పాటు చేసి బుద్ధుడికి సంబంధించిన ప్రతి అంశాన్ని డిజిటల్ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌గా అందించేలా ప్రత్యేక సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చాకలి గట్టు ఐలాండ్‌‌‌‌ చుట్టూ హోటల్స్‌‌‌‌ నిర్మించడంతో పాటు, బోటింగ్‌‌‌‌ సౌకర్యాన్ని కల్పించనున్నారు. 

సాగర్‌‌‌‌ సందర్శనకు వచ్చే పర్యాటకులు రిజర్వాయర్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌లో బోట్లలో విహరించేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయనున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ఉద్దేశంతో అనువైన టూరిజం ప్యాకేజీలను రూపొందించనున్నారు. అలాగే వైజాగ్‌‌‌‌ కాలనీ వద్ద కాటేజీ నిర్మాణంతో పాటు బోటింగ్‌‌‌‌ ఏర్పాటు చేయనున్నారు.

బౌద్ధ విజ్ఞాన కేంద్రం, జూపార్క్‌‌‌‌ ఏర్పాటుకు ప్రపోజల్స్‌‌‌‌
నాగార్జునసాగర్‌‌‌‌లో బౌద్ధ విజ్ఞాన కేంద్రం, బౌద్ధ విశ్వ విద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్‌‌‌‌ సిద్ధం చేసింది. వీటితో పాటు బౌద్ధ వనంలోని వెయ్యి ఎకరాల్లో జూ పార్క్‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అంతే కాకుండా ఆసియా ఖండంలోని పలు దేశాల నుంచి బౌద్ధులు వచ్చే అవకాశం ఉండడంతో వారు బస చేసేందుకు వీలుగా సకల సౌకర్యాలతో స్టార్‌‌‌‌ హోటల్స్‌‌‌‌ నిర్మించనున్నారు. 

ఈ నెలలోనే మొదలుకానున్న పనులు
బుద్ధవనం అభివృద్ధికి ఈ నెలలోనే పనులు మొదలు కానున్నాయి. స్వదేశీ దర్శన్‌‌‌‌ స్కీమ్‌‌‌‌లో భాగంగా ఏడాదిలోనే పనులను పూర్తి చేయాల్సి ఉంది. పనులను వేగవంతం చేసేందుకు ఇప్పటికే నాగార్జున సాగప్‌‌‌‌ చుట్టుపక్కల గల ప్రభుత్వ భూములను నిర్మాణాల కోసం సేకరించాలని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసర్లు త్వరలోనే సర్వే నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్‌‌‌‌లు ఇవ్వనున్నారు.

ఏకో టూరిజంగా బుద్ధవనం 
నాగార్జునసాగర్‌‌‌‌లో ఉన్న బౌద్ధవనాన్ని ఏకో టూరిజంగా డెవలప్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రపంచ బౌద్ధ పర్యాటక కేంద్రంగా బుద్ధవనాన్ని తీర్చిదిద్దుతాం. 400 ఎకరాల్లో ఉన్న చాకలి గట్టు ఐలాండ్‌‌‌‌ను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. పనులను త్వరలోనే మొదలు పెడుతాం.


పటేల్‌‌‌‌ రమేశ్‌‌‌‌రెడ్డి, తెలంగాణ టూరిజం డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌