యువత భవిష్యత్తును  తీర్చిదిద్దేవి గ్రంథాలయాలు :  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ​అలీ 

 కామారెడ్డి టౌన్, వెలుగు: గ్రంథాలయాలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ పేర్కొన్నారు.   గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం  బుధవారం కామారెడ్డిలో  నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ... పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం గ్రంథాలయాల్లో అన్ని వసతులు కల్పించటంతో పాటు,  మెటీరియల్​ సమకూర్చామన్నారు.  

ప్రభుత్వ తోడ్పాటుతో పాటు, దాతల సహకారంతో  లైబ్రరీల్లో వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.  యువత లైబ్రరీలను వినియోగించుకొని ఉద్యోగాలు సాధించాలన్నారు.  ఏడాదిలో 51వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.   స్థానిక లైబ్రరీని మరింత ఆధునీకరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.  కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్​ మాట్లాడుతూ..గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం  లైబ్రరీలో చదువుకొని పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించారు.

జిల్లా  గ్రంథాలయ సంస్థ ​చైర్మన్​ మద్ది చంద్రకాంత్​రెడ్డి,  అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి, ఆర్డీవో రంగనాథ్​రావు,   డీఎస్పీ నాగేశ్వర్​రావు,  మున్సిపల్​ వైస్​ చైర్​పర్సన్​ ఉరుదొండ వనిత,   డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు పాల్గొన్నారు.