ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్

ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ యూజర్లకు ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఒకవేళ మీరు వాడుతున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ దురదృష్టవశాత్తూ పోతే.. అదేనండీ మీ ఫోన్ను కేటుగాళ్లు కొట్టేసినా, పొరపాటున మీరే పోగొట్టుకున్నా ఇకపై కంగారుపడాల్సిన అవసరం లేదని గూగుల్ హామీ ఇచ్చింది. ఫోన్లో ఉన్న డేటా చోరీకి గురికాకుండా థెఫ్ట్ డిటెక్షన్ లాక్ (Theft Detection Lock) అనే పేరుతో గూగుల్ ఒక కొత్త ఫీచర్ను డెవలప్ చేసింది. ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందంటే.. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను ఎవరైనా కొట్టేశారనుకుందాం. ఆ ఫోన్ను దొంగిలించిన వ్యక్తి నడిచి గానీ, ఏదైనా వెహికల్ మీద గానీ పారిపోతున్నాడనుకుందాం. మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఆటోమేటిక్గా థెఫ్ట్ డిటెక్షన్ మోడ్లోకి వెళ్లిపోయి లాక్ అయిపోతుంది. దొంగ చేతిలో ఫోన్ ఉందన్న విషయాన్ని ఈ ఫీచర్ ఎలా గుర్తి్స్తుందనే డౌట్ రావొచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న వ్యక్తి కదలికలను ఈ ఫీచర్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటుంది. ఉన్నట్టుండి ఫోన్ పట్టుకున్న వ్యక్తి కదలికల్లో మార్పు గమనించినా, సడన్గా స్పీడ్గా వెళుతున్నట్టు అనిపించినా, అప్పటివరకూ వాడుతున్నట్టుగా కాకుండా ఫోన్ను రఫ్గా హ్యాండిల్ చేస్తున్నట్టు అనిపించినా ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఫోన్ ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. ఆ లాక్ డీయాక్టివేట్ చేసి ఫోన్ను ఓపెన్ చేయడం అంత సులువైన పని కాదు. ఆండ్రాయిడ్ 10 లేదా అంతకు మించి లేటెస్ట్ వెర్షన్తో పనిచేస్తున్న స్మార్ట్ ఫోన్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని గూగుల్ తెలిపింది. మరికొన్ని వారాల్లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల భద్రత కోసం ఈ ఫీచర్తో పాటు మరో ఫీచర్ను కూడా గూగుల్ డెవలప్ చేసింది. అదే ఆఫ్లైన్ డివైజ్ లాక్. ఫోన్ దొంగిలించిన వ్యక్తి కొంత సమయం తర్వాత తన లొకేషన్ ట్రేస్ చేయకుండా ఉండేందుకు మొబైల్ డేటాను.. అదేనండీ ఇంటర్నెట్ను ఆఫ్ చేసుకుంటే.. ఆఫ్లైన్ డివైజ్ లాక్ వల్ల స్క్రీన్ లాక్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. అయితే.. ఈ ఫీచర్ యాక్టివేట్ అవడానికి మొబైల్ డేటా ఆఫ్ చేసి ఎంత సమయం అయి ఉండాలనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదు.