గూగుల్ ఇనుస్ట్రుమెంట్ ప్లే గ్రౌండ్ అనే టూల్ తీసుకొచ్చింది. ఇది సంగీతాన్ని క్రియేట్ చేస్తుంది. ఇందుకోసం మనదేశానికి చెందిన వీణతోపాటు ప్రపంచవ్యాప్తంగా వంద సంగీత వాయిద్యాలతో శిక్షణ ఇచ్చారు. యూజర్లు వాళ్లకు నచ్చిన ఇనుస్ట్రుమెంట్ని సెలక్ట్ చేసుకుని పదాల రూపంలో ప్రాంప్ట్చేస్తే చాలు. దీనిలోని మ్యూజిక్ ఎల్. ఎం. 20 సెకండ్లలో సంగీతం క్లిప్‌ను క్రియేట్ చేస్తుంది. అంతేకాదు.. సంతోషం, ప్రేమ వంటి వాటిని ప్రాంప్ట్‌లో రాయొచ్చు. ఏఐ సాయంతో సంగీతాన్ని క్రియేట్ చేయొచ్చు. దీన్నుంచి వచ్చే మ్యూజిక్‌కి కాపీ రైట్ లేదు. ఒక గ్రూప్ డిజైన్ చేసిన మ్యూజిక్ ఆధారంగానే ఈ టూల్ పనిచేస్తుంది. కాబట్టి ఇది కాపీ ట్యూన్స్ ఇవ్వదు.
ఎడిటెడ్ మెసేజ్
ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పంపిన తర్వాత కూడా ఎడిట్ చేసే వీలు ఉంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ కనిపించి టెక్స్ట్ ఎడిట్ చేయాలనుకున్నా లేదా మనసు మార్చుకుని వేరే మెసేజ్ టైప్ చేయాలనుకున్నా ఈ ఆప్షన్ వాడుకోవచ్చు. అయితే, పోస్ట్ పెట్టిన పావుగంట లోపు ఎడిట్ చేయాలి. ఆ టైం దాటాక ఎడిట్ చేసేందుకు వీలుపడదు. అంతేకాకుండా ఎడిట్ చేసిన మెసేజ్ పైన ‘ఎడిటెడ్’ అనే లేబుల్ కనిపిస్తుంది.
ఎడిట్ ఇలా
- ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇంతకుముందు పంపిన మెసేజ్ సెలక్ట్ చేయాలి.
- దాన్నినొక్కి పట్టుకుంటే కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి.
- వాటిలో ఎడిట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
- తర్వాత మెసేజ్ ఎడిట్ చేసి సెండ్ చేయాలి.
ఏఐతో పాడ్ కాస్ట్
ఈ మధ్య పాడ్ కాస్ట్‌ల ట్రెండ్ నడుస్తోంది. కాకపోతే పాడ్ కాస్ట్లను రికార్డ్ చేసేటప్పుడు కొన్ని అనవసరమైన సౌండ్స్ వచ్చే అవకాశం ఉంది. పాడ్‌కాస్ట్ దాన్ని ప్లే చేసినప్పుడు అవి డిస్టర్బెన్స్‌గా అనిపించొచ్చు. అలాంటప్పుడు పాడ్ కాస్ట్లను వినడం చిరాకుగా అనిపిస్తుంది. కాబట్టి బ్యాక్‌గ్రౌండ్‌లో అలాంటి సౌండ్స్ తీసేయడానికి ఏఐలో కొత్త అప్డేట్ వచ్చింది. ‘పాడ్ క్యాజిల్’ అనే ఏఐ సాఫ్ట్వేర్ ద్వారా పాడ్ కాస్ట్లను మరింత వినసొంపుగా చేయొచ్చు.
పాడ్ క్యాజిల్ అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి లాగ్ ఇన్ కావాలి. అందులో క్రియేట్, ఎడిట్, పబ్లిష్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇది క్లియర్ రికార్డింగ్ చేస్తుంది. ఆటోమెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ తీసేస్తుంది. అంతేకాదు.. ఇందులో ఆడియో, వీడియో పాడ్ కాస్ట్‌లు క్రియేట్ చేయడమే కాకుండా ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్, వాయిస్ ఓవర్స్, రిమోట్ ఇంటర్వ్యూస్, ఎడ్యుకేషనల్ కంటెంట్, ఆడియో బుక్స్ వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
లాక్ తీయకుండానే బ్లాక్!
ఫోన్ చేతిలో పట్టుకోగానే ముందు ఏం చెక్ చేస్తారంటే? చాలామంది వాట్సాప్ అని చెప్తారు. వాట్సాప్ వచ్చినప్పటి నుంచి కాల్స్, మెసేజ్‌లు.. అన్నింటికీ దాన్నే వాడుతున్నారు. పైగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తోంది వాట్సాప్. ఈసారి తీసుకొచ్చిన కొత్త అప్డేట్.. ఫోన్ ఆన్ చేయకుండానే అనవసరమైన మెసేజ్‌లను బ్లాక్ చేసే ఫీచర్. ఇంతకుముందు మెసేజ్‌లు ఏవైనా వస్తే వాటిని చూడటానికి, యాప్ ఓపెన్ చేయాల్సి వచ్చేది. మెసేజ్ చూసే టైంలో పొరపాటున స్పామ్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక అంతే! ఆ స్పామ్లో చిక్కుకున్నట్లే.
అందులో చిక్కుకోకుండా ఉండేందుకు చాలామంది ఎప్పటికప్పుడు అనవసరమైన లేదా స్పామ్ మెసేజ్‌లను చూడకుండానే డిలీట్ చేస్తుంటారు. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు. ఫోన్ లాక్ తీయకుండానే ఆ మెసేజ్‌లకు చెక్ పెట్టొచ్చు. మెసేజ్ రాగానే నోటిఫికేషన్ వస్తుంది. అందులో రిప్లయ్, మార్క్ యాజ్ రీడ్ వంటి ఆప్షన్స్ వస్తాయి. తెలియని నెంబర్ నుంచి పదే పదే మెసేజ్‌లు వస్తుంటే... వాటిని స్పామ్ మెసేజ్లుగా గుర్తిస్తుంది వాట్సాప్. అవి వచ్చినప్పుడు ‘రిప్లయ్, బ్లాక్’ అనే ఆప్షన్స్ చూపిస్తుంది. అవసరమైన నెంబర్ అయితే రిప్లయ్ ఇవ్వొచ్చు. స్పామ్ మెసేజ్ అయితే బ్లాక్ చేసేయడమే.