10 గ్రాముల బంగారం 80,290..ఒక్క రోజే రూ.710 పెరిగిన 24 క్యారెట్ల గోల్డ్

  • దంతేరాస్, దీపావళి ముందు మరింత పెరిగిన ధరలు
  • వెండి కూడా మస్తు పిరం.. కొనుగోళ్లపై ఎఫెక్ట్​

హైదరాబాద్, వెలుగు : బంగారం రేట్లు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. దంతేరాస్​, దీపావళి, లగ్గాల సీజన్​ ముందు ఈ రేట్లు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే దేశవ్యాప్తంగా శనివారం బంగారం ధరల్లో భారీగా మార్పు కనిపించింది. ఒక్కరోజు వ్యవధిలోనే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 710 రూపాయలు పెరిగింది. అదే 22 క్యారెట్ల గోల్డ్​ 650 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్​లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.80,290కి చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.73,600 పలుకుతున్నది. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.  

కిలో వెండి రూ.లక్షా 7 వేలకు చేరింది. ప్లాటీనం ధర(10గ్రాములు)  రూ. 27,300గా ఉంది. ధంతేరాస్, దీపావళికి బంగారం కొనడం జనం సెంటిమెంట్ గా భావిస్తుంటారు. అయితే, ఈ సీజన్లో కొంత ధరలు పెరుగుతాయి. దీపావళి వరకు రూ.80 వేలు క్రాస్ అవుతుందని మార్కెట్​ నిపుణులు భావించారు. కానీ, ఇప్పటికే రూ.80 వేల మార్క్ దాటడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాబోయే రోజుల్లో గోల్డ్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

30 శాతం తగ్గిన కొనుగోళ్లు

బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో గోల్డ్ షాపుల్లో గిరాకీ తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు.   పెండ్లిళ్లు, పండుగల సీజన్​లో బంగారం ధరల్లో మార్పు కనిపించినా.. ఈ స్థాయిలో  పెరగడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.  జనం అవసరాల మేరకే బంగారం కొనుగోలు చేస్తున్నారని, గతంతో పోలిస్తే ఈసారి 30 శాతం కొనుగోళ్లు తగ్గాయని పేర్కొంటున్నారు.  గతంలో ఈ సీజన్లో బంగారం ధరలు పెరిగినా గిరాకీ ఉండేదని, ఈసారి భారీగా పెరిగిన ధరలు కొనుగోలుదారులకు భారంగా మారడంతో కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారని అంటున్నారు.  

ఇంకా పెరగవచ్చు..

భవిష్యత్ లో బంగారం, వెండి ధరలు  మరింత పెరిగే అవకాశం ఉంది.  డాలర్​ఫై నమ్మకం లేకపోవడంతో చైనా లాంటి దేశాలు ఎక్కువగా బంగారు కొనుగోలు చేస్తున్నాయి.  దీనికితోడు కొవిడ్ నుంచి బంగారం ధరల్లో ఇదే పరిస్థితి ఉంది. పలు దేశాల నడుమ నెలకొన్న ఉద్రిక్త  పరిస్థితుల ప్రభావం కూడా బంగారం ధరలపై పడుతున్నది.  ప్రస్తుతం బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు.  వెండి ధరలు (కిలో) మున్ముందు రూ.లక్షా ఇరవై వేలు క్రాస్ అయ్యే అవకాశం ఉంది.  బంగారం ధరలు కూడా రూ.85 వేల మార్క్ దాటినా ఆశ్చర్యం లేదు. 

-  రేణుకుంటల నమోశివయ్యా, గోల్డ్ మార్కెట్ అనలిస్ట్

పదిరోజులుగా హైదరాబాద్​లో బంగారం ధరలు ( ఒక గ్రాము)

తేదీ           22 క్యారెట్లు          24 క్యారెట్లు
17                 రూ.7,160              రూ.7,811
18                 రూ.7,240              రూ.7,898
19                 రూ.7,280               రూ.7,942
20                 రూ.7,280               రూ.7,942
21                 రూ.7,300               రూ.7,964
22                 రూ.7,300               రూ.7,964
23                 రూ.7,340               రూ.8,007
24                 రూ.7,285                రూ.7,947
25                 రూ.7,295               రూ.7,958
26                 రూ. 7,360              రూ.8,029