మిస్టరీ : సుత్తి వెతికితే బంగారం దొరికింది!

‘పొలం దున్నుతుంటే బంగారం దొరికింది. పాత ఇంటిని కూల్చినప్పుడు లంకె బిందెలు దొరికాయి’ అని కథల్లో చెప్తుంటారు. అప్పుడప్పుడు పల్లెటూళ్లలో అలాంటి పుకార్లు వినిపిస్తుంటాయి. అలాంటి కథలు, పుకార్లు ఇక్కడ నిజమయ్యాయి. ఒక రైతు తన పొలంలో పోగొట్టుకున్న సుత్తి(హ్యామర్‌‌‌‌) గురించి వెతుకుతుంటే ఏకంగా వందల కోట్ల రూపాయల విలువైన బంగారం దొరికింది. ఇంతకీ ఆ బంగారం ఎవరిది? భూమిలో ఎందుకు అలా పాతిపెట్టారు? అనే ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానాలు ఇప్పటికీ దొరకలేదు. 

బ్రిటన్‌‌‌‌లో సఫోల్క్‌‌‌‌కి దగ్గర్లో హోక్స్​నే అనే చిన్న ఊరు ఉంది. ఆ ఊళ్లో ఉంటున్న ఒక రైతు 1992 నవంబర్ 16న ఉదయాన్నే పనులు చేసుకునేందుకు పొలానికి వెళ్లాడు. అలా పని చేస్తున్నప్పుడు తన దగ్గరున్న సుత్తి పోగొట్టుకున్నాడు. ఆ విషయాన్ని అదే ఊళ్లో ఉంటున్న తన ఫ్రెండ్‌‌‌‌ ఎరిక్‌‌‌‌ లాస్‌‌‌‌కి చెప్పాడు. ఎరిక్‌‌‌‌కు గతంలో మెటల్స్‌‌‌‌ని కనుగొన్న ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ ఉంది. రిటైర్ అయ్యేటప్పుడు అతను పనిచేసిన సంస్థ ఎరిక్‌‌‌‌కు ఒక మెటల్ డిటెక్టర్‌‌‌‌‌‌‌‌ని గిఫ్ట్‌‌‌‌గా ఇచ్చింది. 

అందుకే ఎరిక్‌‌‌‌ “ఏం పర్లేదు ఆ సుత్తిని నేను వెతికిపెడతాను పదా”అని ఆ రైతుతో కలిసి పొలానికి వెళ్లాడు. మెటల్ డిటెక్టర్ పట్టుకుని పొలమంతా తిరిగాడు. అలా తిరుగుతుంటే ఒక చోట డిటెక్టర్‌‌‌‌‌‌‌‌ నుంచి బీప్‌‌‌‌ సౌండ్ వచ్చింది. కానీ.. అక్కడ సుత్తి లేదు. ముందు ఎరిక్‌‌‌‌కు ఏం అర్థం కాలేదు. దాంతో డిటెక్టర్‌‌‌‌‌‌‌‌ని భూమ్మీద పెట్టాడు. బీప్ సౌండ్ పెరిగింది. దాంతో భూమి లోపల ఏదో ఉందనుకుని తవ్వడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు తవ్విన తర్వాత అక్కడ తనకు కావాల్సిన ఇనుప వస్తువుకు బదులు... పెద్ద మొత్తంలో బంగారం ఉందని అర్థమైంది. నిధిని కనుగొన్నానని తెలుసుకుని చాలా సంతోషించాడు. 

వెండి చెంచాలు... బంగారు నాణేలు 

బీప్​ సౌండ్​ వచ్చిన దగ్గర నేలని తవ్వుతున్నప్పుడు ముందుగా వెండి చెంచాలు, బంగారు నాణేలు బయటపడ్డాయి. వాటిని చూసిన వెంటనే ఎరిక్‌‌‌‌ లోకల్‌‌‌‌ పోలీసులకు, ఆర్కియాలజీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఇన్ఫర్మేషన్‌‌‌‌ ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయమే అక్కడికి ఆర్కియాలజిస్ట్‌‌‌‌లు వచ్చారు. చాలా సీక్రెట్‌‌‌‌గా తవ్వకాలు మొదలుపెట్టారు. తవ్వుతుంటే బంగారం, వెండి వస్తువులు వస్తూనే ఉన్నాయి. అలా దాదాపు60 పౌండ్ల (27 కిలోలు)కు పైగా  బంగారం, వెండి వస్తువులను బయటికి తీశారు. 

వాటిలో15,234 రోమన్ నాణేలు, డజన్ల కొద్దీ వెండి స్పూన్లు, 200 వరకు బంగారు వస్తువులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా గోర్లకు అలంకరించుకునేవి, తాళాలు ఉన్నాయి. కొన్ని వస్తువులను గడ్డితో ప్యాక్ చేసి మరీ దాచారు. కొన్నింటిని తోలుతో కప్పిన చెక్క పెట్టెల్లో పెట్టారు. వాటిలో పులి ఆకారంలో ఉన్న వెండి హ్యాండిల్, దెబ్బతిన్న పెప్పర్‌‌‌‌‌‌‌‌ డబ్బాలు  కూడా ఉన్నాయి. ఆ తర్వాత రైతు పోగొట్టుకున్న సుత్తిని కూడా వెతికిపెట్టారు వాళ్లు. 

ఇచ్చినందుకు 1.75 మిలియన్లు 

బంగారం దొరికినా దానిమీద ఆశ పడకుండా గవర్నమెంట్‌‌‌‌కు ఇచ్చినందుకు  బ్రిటన్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ రూల్స్‌‌‌‌ ప్రకారం.. ఎరిక్‌‌‌‌కు1.75 మిలియన్ల యూరోలు ఇచ్చారు. ఆ నిధి దొరకడానికి ఆ రైతే కారణం. కాబట్టి.. అందులో నుంచి సగ భాగాన్ని రైతుకు ఇచ్చాడు ఎరిక్‌‌‌‌. అప్పటివరకు బ్రిటన్‌‌‌‌లో కనుగొన్న దాదాపు 40 నిధుల్లో ఇదే పెద్దది. దీన్ని అందరూ ‘‘హోక్​స్నే హోర్డ్”  అని పిలుస్తుంటారు. ఈ నిధిని బ్రిటిష్ మ్యూజియంలోని ‘రొమానో–బ్రిటిష్ కలెక్షన్స్’లో పెట్టారు. 

ఎవరు పాతిపెట్టారు? 

ఈ నిధి గురించి తెలుసుకోవడానికి బ్రిటన్ ఆర్కియాలజిస్ట్‌‌‌‌లు చాలా రోజులు ట్రై చేశారు. చివరకు క్రీస్తు శకం 410 సంవత్సరం నాటిదని తేల్చారు. అవన్నీ  రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన నాణేలు, ఆభరణాలు అని గుర్తించారు. కానీ.. వాటిని ఎవరు పాతిపెట్టారు? ఎందుకు పాతిపెట్టారు? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. 

ఒకప్పుడు రోమన్‌‌‌‌.. 

క్రీస్తుశకం నాల్గవ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం అస్థిర పరిస్థితులను  ఎదుర్కొంది. అప్పటివరకు సామ్రాజ్యంలో ఇటలీ, స్పెయిన్, గ్రీస్, ఫ్రాన్స్‌‌‌‌తోపాటు ఉత్తర ఆఫ్రికా, టర్కీ, బ్రిటన్‌‌‌‌లోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. అంటే.. దాదాపు మద్యధరా అంతటా విస్తరించి ఉండేది. కానీ.. కొన్ని కారణాల వల్ల పశ్చిమ రోమన్ సామ్రాజ్యం క్షీణిస్తూ.. వచ్చింది. గోతిక్ యోధులు యుద్ధాలను గెలిచారు. చక్రవర్తి వాలెన్స్ లాంటి నాయకులను చంపారు. 410లో విసిగోత్‌‌‌‌లు (సంచార జర్మనీ ప్రజలు) రోమ్‌‌‌‌ను కొల్లగొట్టారు. ఇంతలో బ్రిటన్‌‌‌‌లోని రోమన్ పౌరులు స్కాట్లాండ్, ఐర్లాండ్ నుండి వచ్చిన వాళ్లను వ్యతిరేకించారు. అప్పుడే జర్మనీ, హున్నిక్ సమూహాల దండయాత్రలు జరిగాయి. అప్పుడు బ్రిటన్‌‌‌‌లో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. అదే టైంలో ఎవరో ఒకరు హోక్​స్నేలో ఈ నిధి దాచి ఉండొచ్చనేది కొందరు రీసెర్చర్ల వాదన.