సింగరేణి క్వార్టర్ల కూల్చివేతకు రంగం సిద్ధం

  • నోటీస్​లు జారీ చేసిన మేనేజ్​మెంట్​

గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని పట్టణంలో రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్న సింగరేణి క్వార్టర్లను కూల్చివేసేందుకు రంగం సిద్ధమైంది. హనుమాన్​నగర్​, శివాజీనగర్​, అశోక్​నగర్​, మెయిన్​ చౌరస్తా, తదితర ఏరియాల్లో ఉన్న 81 క్వార్టర్లలో నివాసముంటున్న వారు ఖాళీ చేయాలని ఇప్పటికే నోటీస్​లు జారీ చేయగా, బుధవారం ఆఫీసర్ల బృందం స్వయంగా వారి ఇండ్లకు వెళ్లి తెలిపారు. రెండు రోజుల్లో సింగరేణి క్వార్టర్లను కూల్చివేసేందుకు మేనేజ్​మెంట్​ చర్యలు చేపట్టింది. 

ఒక వరుసలో... మూడు క్వార్టర్ల కూల్చివేత

గోదావరిఖని హనుమాన్​ నగర్​ గవర్నమెంట్​ స్కూల్​ నుంచి మెయిన్​ చౌరస్తా వరకు, అక్కడి నుంచి శివాజీనగర్​ బట్టల బజార్​ వరకు ఒక వరసలో మూడు  సింగరేణి క్వార్టర్లను మేనేజ్​మెంట్​ కూల్చడానికి నిర్ణయం తీసుకుంది. రీగల్​ షూమార్ట్​ నుంచి వెంకటేశ్వర సైకిల్​ స్టోర్​ వరకు, అశోక్​నగర్​ మజీద్​ ఏరియా నుంచి మున్సిపల్​ కాంప్లెక్స్​ వరకు ఉన్న సింగరేణి క్వార్టర్లను కూడా కూల్చనున్నారు. ఈ క్వార్టర్లలో ఉన్న కార్మికులందరికీ ఇప్పటికే నోటీసులు అందజేశారు. 

కోరుకున్న చోట క్వార్టర్ల అప్పగింత...

గోదావరిఖని పట్టణంలో కూల్చనున్న 81 క్వార్టర్లలో నివాసముంటున్న వారికి మరో చోట కోరుకున్న క్వార్టర్లను ఇచ్చేందుకు మేనేజ్​మెంట్​ సిద్దమైంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న క్వార్టర్ల లిస్ట్​ను వారికి అందజేసి కోరుకున్న వాటికి  నివాసయోగ్యంగా ఉండేందుకు వీలుగా రిపేర్లు చేసి ఇవ్వనున్నారు. 

పీనల్​ రెంట్​ మినహాయింపు....

సింగరేణిలో ఉద్యోగులుగా పనిచేసి రిటైర్డ్​ అయినప్పటికీ సంస్థ నుంచి వచ్చే గ్రాట్యూటీ తీసుకోకుండా కొంతమంది అలాగే క్వార్టర్లలో నివాసముంటున్నారు. ఇలాంటి వారికి మేనేజ్​మెంట్ ఫీనల్​రెంట్​ విధిస్తుంది. అలా నివాసముంటున్న రిటైర్డ్​ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో గ్రాట్యూటీ మొత్తాన్ని జమ చేసేలా మేనేజ్​మెంట్​ చర్యలు తీసుకుంది.

 క్వార్టర్లలో వారుంటున్నందుకు వేస్తున్న పీనల్​రెంట్​ను కూడా వన్​టైమ్​ సెటిల్​మెంట్​ కింద మినహాయింపు ఇచ్చేందుకు కూడా మేనేజ్​మెంట్​ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మొత్తంగా గోదావరిఖని పట్టణ సుందరీకరణలో భాగంగా అడ్డుగా ఉన్న సింగరేణి క్వార్టర్లను కూల్చివేసేందుకు రంగం సిద్దం కావడంతో పట్టణ వాసుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.