పెద్దపల్లి ఆర్డీవో ఆఫీస్‌ జప్తు చేయండి

  • పరిహారం చెల్లించకపోవడంతో ఆదేశాలిచ్చిన గోదావరిఖని కోర్టు 
  • ఈ నెల 19 లోగా  డిపాజిట్‌ చేస్తామన్న ఆర్డీవో  

గోదావరిఖని/పెద్దపల్లి, వెలుగు : రైతుల భూములు తీసుకొని నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆర్డీవో ఆఫీస్‌ ఆస్తులను జప్తు చేయాలని కోర్డు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతులు బుధవారం ఆఫీస్‌కు వెళ్లగా ఐదు రోజుల్లో డబ్బులు జమ చేస్తామని ఆర్డీవో రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, కుందనపల్లి, మల్యాలపల్లి, రాయదండి గ్రామాల్లో విద్యుత్‌ ప్లాంట్‌ కోసం 2000 సంవత్సరంలో ఏపీ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు ఆధ్వర్యంలో భూ సేకరణ ప్రారంభించారు.

నాలుగు గ్రామాలకు చెందిన 300 మంది రైతుల వద్ద 1200 ఎకరాలు తీసుకున్నారు. దీని కోసం ఖుష్కి భూమి ఎకరానికి రూ.22 వేలు, తడి భూమికి రూ.32 వేల నుంచి రూ.42 వేల వరకు చెల్లించారు. అయితే తమ భూములకు సరైన ధర ఇవ్వలేదంటూ రైతులు 2004లో పెద్దపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఖుష్కి భూమికి రూ.90 వేలు, తడి భూమికి రూ.95 వేలు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్‌చేస్తూ అప్పటి ఆర్డీవో హైకోర్టుకు వెళ్లారు. ఈ టైంలో సగం డబ్బులను బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయాలని హైకోర్టు సూచించగా ఆర్డీవో ఆఫీస్‌ స్పందించలేదు.

తర్వాత భూములను ఏపీ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి బీపీఎల్‌ కంపెనీకి బదలాయించారు. తమకు డబ్బులు చెల్లించాలని రైతులు మరోసారి కోర్టుకు వెళ్లడంతో డబ్బులైనా చెల్లించాలని లేదంటే ఆర్డీవో ఆఫీస్‌ ఆస్తులైనా జప్తు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. చివరికి బీపీఎల్‌ కంపెనీపై ఒత్తిడి తేవడంతో మల్యాలపల్లి, కుందనపల్లి నిర్వాసితులకు సగం డబ్బులు చెల్లించగా బ్రాహ్మణపల్లి రైతులకు పరిహారం ఇవ్వలేదు.

దీంతో 36 మంది నిర్వాసితులు గోదావరిఖని సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పిటిషన్‌ వేయగా నష్టపరిహారం కింద రూ.2.11 కోట్లు చెల్లించాలని, లేకపోతే పెద్దపల్లి ఆర్డీవో ఆఫీస్‌ ఆస్తులను జప్తు చేయాలని జడ్జి శ్రీనివాసులు ఇటీవల తీర్పుచెప్పారు. దీంతో బ్రాహ్మణపల్లి నిర్వాసితులతో పాటు పెద్దపల్లి కోర్టు సిబ్బంది బుధవారం ఆర్డీవో ఆఫీస్‌కు వెళ్లి నోటీసులిచ్చారు. దీంతో ఆర్డీవో గంగయ్య ఈ నెల 19లోగా డబ్బులు జమ చేస్తామని రాతపూర్వకంగా హమీ ఇవ్వడంతో జప్తు చేయకుండా వెనుదిరిగారు.