గోదావరి, కావేరి లింక్​ మళ్లీ మొదటికే!.. ప్రాజెక్ట్ అనుసంధానానికి బ్రేక్

  • ఐదు రాష్ట్రాల అభ్యంతరాలతో ప్రాజెక్ట్ అనుసంధానానికి బ్రేక్
  • 148 టీఎంసీలకు ఒప్పుకోబోమంటున్న చత్తీస్​గఢ్​
  • ఐదు హైడల్ పవర్ ప్రాజెక్టులు కట్టే ప్లాన్
  • కనీసం 50 టీఎంసీల వరకు కోత పడే అవకాశం
  • రెట్టింపు వాటా అడుగుతున్న కర్నాటక
  • పోలవరం నుంచి నీళ్లు తరలించాలంటున్న ఏపీ
  • తమకూ షేర్ కావాలంటూ మహారాష్ట్ర డిమాండ్
  • న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలంటూ ఒడిశా పట్టు

హైదరాబాద్, వెలుగు: గోదావరి – కావేరి నదుల లింక్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. అనుసంధానం తర్వాత తరలించాలనుకుంటున్న 148 టీఎంసీల జలాల్లో సగం వాటాకు తెలంగాణ డిమాండ్ చేస్తుండగా.. ఇవ్వలేమని నేషనల్ వాటర్ డెవలప్​మెంట్ అథారిటీ (ఎన్​డబ్ల్యూడీఏ) కరాఖండిగా చెప్పేసింది. ఐదు రాష్ట్రాలతో ఈ లింకింగ్​కు లంకె ఏర్పడడమే అందుకు కారణంగా తెలుస్తున్నది. చత్తీస్​గఢ్, కర్నాటక నుంచే ఇన్నాండ్లు ఆటంకాలు ఏర్పడుతుండగా.. ఇప్పుడు ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారాయని తెలుస్తున్నది. ఒక్కో రాష్ట్రం ఒక్కో డిమాండ్ పెడుతుండడంతో ఈ రెండు నదుల అనుసంధానం సవాల్​గా మారిందని అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది.

చత్తీస్​గఢ్ ఒప్పుకోవట్లే..

చత్తీస్​గఢ్ వాడుకోని మిగులు జలాల ఆధారంగా 148 టీఎంసీలను గోదావరి నదిలోకి మళ్లించి కావేరికి అనుసంధానం చేయాలన్నది ఈ లింకింగ్ ప్రతిపాదన. అయితే, ఇప్పుడు చత్తీస్​గఢ్​ కొత్తగా మరో పేచీ పెట్టినట్టు తెలుస్తున్నది. 148 టీఎంసీలను మళ్లించేందుకు అంగీకరించడం లేదని సమాచారం. అక్కడ కొత్తగా ఐదు హైడల్ పవర్ ప్రాజెక్టులను నిర్మించాలని ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయించిందని చెప్తున్నారు. 

అందులో మూడు ప్రాజెక్టులకు ఇప్పటికే డిటెయిల్డ్ ప్రాజెక్ట్​ రిపోర్ట్ (డీపీఆర్​)ను కూడా అక్కడి అధికారులు ప్రిపేర్​ చేశారని అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. మిగతా రెండు ప్రాజెక్టులకూ డీపీఆర్​లను సిద్ధం చేసే పనిలో ఆ రాష్ట్ర సర్కారు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే చత్తీస్​గఢ్​ వాడుకోని జలాలుగా చెప్తున్న ఈ 148 టీఎంసీల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తున్నది.

 ఆయా ప్రాజెక్టులకు ఎలా లేదన్నా కనీసం 40 నుంచి 50 టీఎంసీలైనా అవసరమవుతాయని, అలాంటప్పుడు 148 టీఎంసీల నీటి లభ్యత ఉండదనేది చత్తీస్​గఢ్​ వాదనగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే లింకింగ్​కు తరలించే నీటి వాటాకు ఆ రాష్ట్రం ఒప్పుకోవడం లేదని చెప్తున్నారు.

అదీగాకుండా.. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీని నిర్మించకుండా ఇప్పటికే కట్టిన సమ్మక్కసాగర్ బ్యారేజీ నుంచే లింకింగ్​ చేయాలని మన రాష్ట్రం ఎన్​డబ్ల్యూడీఏ ముందు డిమాండ్ పెట్టింది. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తే 83 మీటర్ల నుంచి 87 మీటర్ల వద్ద నీటిని తీసుకునేలా ఒప్పందం చేసుకోవాలని చెప్తున్నది. ఈ క్రమంలోనే 83 మీటర్ల వద్ద నుంచి నీటిని తీసుకునేందుకు ఎన్​వోసీ ఇచ్చేందుకు గత సమావేశాల్లో చత్తీస్​గఢ్​ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ.. ప్రస్తుతం కొత్త ప్రతిపాదనలతో పేచీ పెడుతున్నట్టుగా తెలుస్తున్నది.

కర్నాటకకు డబుల్ కావాలట!

ఈ ప్రాజెక్ట్​ ద్వారా కర్నాటకకు 16 టీఎంసీల నీటిని ఇచ్చేందుకు నిర్ణయించారు. కానీ, కర్నాటక ఇప్పుడు తనకు రెట్టింపు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి కర్నాటకలో గోదావరి నది పారేది కొంచెమే. అయినప్పటికీ.. ఆ రాష్ట్రంలో కరువు ప్రాంతాల పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికీ గోదావరి, కావేరి నదుల అనుసంధానంలో నీటి వాటాలను కేటాయించింది. మొన్నటిదాకా 16 టీఎంసీలకు కర్నాటక ఓకే చెప్పినా.. ఇప్పుడు మాత్రం మాట మార్చి 30 టీఎంసీలకు మించి నీటిని అడుగుతున్నట్టుగా తెలుస్తున్నది.

పోలవరం నుంచి చేయాలంటున్న ఏపీ

గత సమావేశాల్లో ఏపీ కూడా పోలవరం నుంచి గోదావరి, కావేరి అనుసంధానం చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ఆ డిమాండ్​ను ఏపీ మరింత గట్టిగా వినిపిస్తున్నట్టుగా అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది. పోలవరం నుంచి నీటిని తరలిస్తే.. నీటి లభ్యత కూడా ఎక్కువగా ఉంటుందని ఆ రాష్ట్రం వాదిస్తున్నట్టుగా సమాచారం. బొల్లపల్లి వద్ద రిజర్వాయర్​ను నిర్మించి.. పోలవరం నుంచి 230 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు వీలుంటుందని ఏపీ వాదిస్తున్నట్టు సమాచారం. 

ఈ రిజర్వాయర్ నుంచి కావేరి నదికి నీటిని మళ్లించి తమిళనాడుకు నీళ్లందించేందుకు సులభమవుతుందని చెప్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఇటు గోదావరి డెల్టాకు నీటిని అందించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ఏపీ భావిస్తున్నట్టు సమాచారం.

రంగంలోకి మహారాష్ట్ర, ఒడిశా

నదుల అనుసంధాన ప్రక్రియలో అనుకోకుండా మహారాష్ట్ర, ఒడిశా కూడా ఎంటరైనట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది. గోదావరి మహారాష్ట్ర నుంచే ప్రవహిస్తుంది కాబట్టి.. లింకింగ్​లో తమకూ వాటా ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర సర్కారు ఎన్​డబ్ల్యూడీఏ ముందు పట్టుబట్టినట్టు తెలిసింది. ఆ రాష్ట్రానికి వాటాల విషయం ఇంకా క్లారిటీ రానప్పటికీ.. ఎన్​డబ్ల్యూడీఏ మాత్రం మహారాష్ట్రకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్టు సమచారం.  తొలి దశలో నీటి వాటాలు ఇవ్వడం సాధ్యపడదని, ఇప్పటికే మిగతా రాష్ట్రాలకూ వాటి అవసరాలకు సరిపడా వాటాలు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పినట్టు తెలిసింది. రెండో దశలో చేపట్టే మహానది – గోదావరి – కావేరి లింక్ ప్రాజెక్ట్​లో వాటాలు ఇస్తామని సర్దిచెప్పినట్టు సమాచారం. అయితే, మహానది గోదావరి లింకింగ్​కు ఒడిశా ఎప్పటి నుంచో మోకాలడ్డుతున్నది.

రిప్లై ఇచ్చేందుకు మన సర్కారు రెడీ

నీటి వాటాల విషయంలో తగ్గేదే లేదని మన రాష్ట్ర సర్కారు కూడా తేల్చి చెప్తున్నది. మన రాష్ట్రం నుంచి చేపట్టే అనుసంధాన ప్రాజెక్టులో ఎట్టిపరిస్థితుల్లోనూ సగం వాటా దక్కాల్సిందేనని వాదిస్తున్నది. తమ నీటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉందని అంటున్నది. గోదావరి నది ఎక్కువ భాగం ప్రవహించేది తెలంగాణలోనేనని, అలాంటప్పుడు తక్కువ వాటాలిస్తే ఇప్పటికే తలపెట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు తగ్గిపోతాయని వాదిస్తున్నది. దీనిపై ఎన్​డబ్ల్యూడీఏకి వివరణాత్మకంగా రిప్లై ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.

మహానది నీటి  కేటాయింపులపైనా వివాదాలు

ఒడిశాలోని బర్మూరు నుంచి మహానదిలోని 408 టీఎంసీల జలాలను తరలించేలా అప్పట్లో ఎన్​డబ్ల్యూడీఏ ప్రతిపాదన పెట్టింది. అందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ప్రాజెక్టులకు ఇచ్చేందుకు ఒప్పుకున్నది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరానికి ఎగువన గోదావరిలోకి మళ్లించి.. కావేరి నదికి తరలించేలా ప్లాన్​ చేసింది. అయితే, దానికి ఒడిశా ఒప్పుకోవడం లేదు. తమకు కేటాయించిన నీటి వాటాలు సరిపోవని తేల్చి చెప్తున్నది. మిగులు జలాల ఆధారంగానే తాము ప్రాజెక్టులను నిర్మించుకుంటు న్నామని, ఇంత తక్కువ కేటాయింపులతో ఒరిగేదేమీ లేదని చెప్తున్నది. మహానది నీటి కేటాయింపులకు సంబంధించిన వివాదాలపై ఇప్పటికే ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నది. వాటాల్లో న్యాయపరమైన సమస్యలు పరిష్కరించేంత వరకు ఒప్పుకోబోమని ఒడిశా తేల్చి చెప్తున్నది. ఈ ఐదు రాష్ట్రాల మధ్య గోదావరి, కావేరి అనుసంధానం ప్రాజెక్టు చిక్కుముడులు వీడాలంటే.. తొలుత ఎన్​డబ్ల్యూడీఏ ప్రతిపాదనలకు ఒడిశా ఒప్పుకోవాల్సి ఉంటది. అది తేలకుంటే ఇటు మహారాష్ట్రకు నీటి కేటాయిం పులు ఉండవని, ఫలితంగా ఆ రాష్ట్రం కూడా ఇప్పుడు తెలంగాణ నుంచి చేపట్టే లింక్​లో వాటాలు అడగడంపై డిమాండ్​ను మరింత పెంచే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.