ఇదివరకటితో పోలిస్తే.. నార్త్ ఇండియాలో స్నోఫాల్ (మంచు కురవడం) కాస్త ఆలస్యం అవుతోంది. ఆస్ట్రేలియాలో హీట్ వేవ్స్. చిలీలో చెలరేగుతున్న వైల్డ్ ఫైర్స్, సముద్రాల టెంపరేచర్లు పెరుగుతుండడం... వీటన్నింటితోపాటు ఇప్పుడు ఎండలు మండిపోవడానికీ కారణం గ్లోబల్ వార్మింగ్. 2023ను చరిత్రలో అత్యంత టెంపరేచర్లు నమోదైన ఏడాదిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది కూడా ఎండల తీవ్రత విపరీతంగానే ఉంది. ముఖ్యంగా మన దగ్గర పోయిన నెలలో టెంపరేచర్లు చాలా పెరిగాయి. ఇదిలాగే కొనసాగితే.. మరింత ముప్పు తప్పదు అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
ఏడాది ఏడాదికి ఎండ వేడి పెరిగిపోతోంది. ఎండాకాలం మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పులు కూడా వీస్తున్నాయి. జనం ఉక్కబోతతో అల్లాడిపోతున్నారు. ఊటీ లాంటి చల్లటి ప్రదేశాలు కూడా ఎండ తీవ్రతతో వేడెక్కుతున్నాయి. గత 73 ఏళ్లలో తొలిసారి ఊటీలో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదయ్యాయి! అక్కడ ఈ మధ్య 29 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లు నమోదైనట్లు తమిళనాడు వాతావారణ శాఖ తెలిపింది. మామూలు టైంలో ఊటీలో 5.4 సెంటిగ్రేడ్ మాత్రమే ఉండేది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరగడం ఇదేం మొదటిసారి కాదు. కొన్నేండ్ల నుంచి టెంపరేచర్లు వరుసగా పెరుగుతూనే వస్తున్నాయి. ముఖ్యంగా పోయినేడు రికార్డ్ స్థాయి టెంపరేచర్లు నమోదయ్యాయి.
2023 అత్యంత వేడి ఏడాది
టెంపరేచర్లను రికార్డ్ చేయడం మొదలైనప్పటి నుండి అంటే 1850 నుంచి174 ఏండ్ల టెంపరేచర్లు పరిశీలిస్తే.. 2023 వేసవిలోనే అత్యంత ఎక్కువ టెంపరేచర్లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని యూరోప్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ తెలిపింది. అంతకుముందు కూడా ఎప్పుడూ ఇంతలా టెంపరేచర్లు నమోదై ఉండకపోవచ్చనేది అంచనా. దాదాపు 1,25,000 సంవత్సరాల్లో అత్యంత వేడిగా ఉన్న ఏడాది ఇదే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. 2023లో ప్రాణాంతకమైన హీట్ వేవ్స్, వరదలు, కరువు, ఆర్కిటిక్, అంటార్కిటిక్‌లో విపరీతంగా మంచు కరగడం లాంటివి జరిగాయి.
శాటిలైట్ డాటా అందుబాటులోకి వచ్చిన 45 ఏళ్లలో 2023లోనే అంటార్కిటిక్ సముద్ర మంచు విస్తీర్ణం ఎక్కువగా తగ్గినట్టు రికార్డులు చెప్తున్నాయి. ఆర్కిటిక్ సముద్ర మంచు విస్తీర్ణం సాధారణం కంటే చాలా తక్కువగా ఉంది. అయితే.. ఇప్పుడు ఎండలను చూస్తుంటే.. 2024లో అలాంటి పరిస్థితులనే చూడాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. ఇలా టెంపరేచర్లు పెరగడానికి ముఖ్య కారణం గ్లోబల్ వార్మింగ్ అని సైంటిస్ట్‌లు చెప్తున్నారు.
భూమి వేడెక్కుతుందా?
భూమ్మీద టెంపరేచర్లలో ప్రతి ఏడాది కొంత మార్పు కనిపిస్తూనే ఉంది. ఎంతో కొంత టెంపరేచర్ పెరుగుతూనే ఉంది. భూమి సగటు టెంపరేచర్15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. కానీ.. కొన్ని పరిస్థితుల వల్ల గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువ, తక్కువ కూడా నమోదైంది. ఇలా టెంపరేచర్లలో మార్పులు రావడం సహజమే. కానీ.. గతంతో పోలిస్తే గడిచిన కొన్ని దశాబ్దాల్లో టెంపరేచర్లు చాలా వేగంగా పెరుగుతున్నాయి.1880 నుంచి సైంటిస్ట్‌లు టెంపరేచర్లలో మార్పులను తెలుసుకోవడానికి శాటిలైట్స్ ఉపయోగిస్తున్నారు. నాసా ప్రకారం.. భూమిపై సగటు ప్రపంచ ఉష్ణోగ్రత1880 నుండి ఇప్పటివరకు కనీసం1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగింది.
భూమి టెంపరేచర్ పెరుగుతోందని చెప్పడానికి మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. సైంటిస్ట్‌లు చెట్ల వలయాలు, ఐస్కోర్స్తో పాటు మరికొన్ని నేచురల్ ఇండికేషన్స్‌పై ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో కొన్ని శతాబ్దాల పాటు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు లేవని కొన్నేండ్ల నుంచే ఈ మార్పులు వస్తున్నాయని చెప్పారు.
మహాసముద్రాల టెంపరేచర్లు పెరగడం, ఉత్తరార్ధగోళంలో మంచు కరగడం లాంటివన్నీ భూమి వేడెక్కుతోందని చెప్పడానికి సూచికలే.
అయితే.. భూమి వాతావరణం దాని 4.5 బిలియన్ సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ మారుతూనే ఉంది. కానీ.. సాధారణంగా వందల, వేల సంవత్సరాల్లో జరిగే మార్పులు ఇప్పుడు దశాబ్దాల్లోనే జరుగుతున్నాయి. ఉదాహరణకు1975 నుండి దాదాపు దశాబ్దానికి 0.15 నుండి 0.20 డిగ్రీల సెల్సియస్ చొప్పున టెంపరేచర్లు పెరిగాయి.1977 నుంచి చూస్తే.. దాదాపు ప్రతి ఏడాది టెంపరేచర్లు పెరుగుతూనే ఉన్నాయి. 2010 నుండి ఇప్పటివరకు10 అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సంవత్సరాలుగా రికార్డ్ అయ్యాయి.
గ్రీన్ హౌజ్
సింపుల్‌గా చెప్పాలంటే వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి గ్రీన్‌హౌజ్ వాయువులు పెరగడం వల్లే ఇలా టెంపరేచర్లు పెరుగుతున్నాయి. అయితే.. ఇవి పెరగడానికి మాత్రం చాలా కారణాలు ఉన్నాయి.19వ శతాబ్దం మధ్య నుండి రకరకాల కారణాల వల్ల గ్రీన్‌హౌస్ వాయువులు వాతావరణంలో చేరుతున్నాయి. ఒకప్పుడు చిన్న మొత్తంలో చేరినప్పటికీ రానురాను వీటి పరిమాణం పెరిగిపోతోంది. వాస్తవానికి ఈ వాయువులే భూ వాతావరణాన్ని చాలావరకు నియంత్రిస్తున్నాయి. అదెలాగంటే.. సూర్యుడి నుంచి భూమిపై పడిన కిరణాలు తిరిగి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లిపోతాయి.
అయితే.. గ్రీన్‌హౌజ్ వాయువులు అందులో కొంత వేడిని గ్రహించుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. దీనినే గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్ అంటారు. వీటివల్లే భూమి వేడిగా ఉంది. ఈ ఎఫెక్ట్ లేకపోతే భూమి మరో 30 డిగ్రీల సెల్సియస్ చల్లగా ఉండేది. అంటే అవి భూమికి కప్పిన దుప్పటిలా పనిచేస్తాయి. భూమిని అంతరిక్షంలోని చలి నుండి ఇన్సులేట్ చేస్తాయి. లేదంటే.. మనిషి మనుగడే సాధ్యం కాదు. కాబట్టి గ్రీన్‌హౌజ్ వాయువులు భూమికి అవసరమే. కానీ.. అవసరానికి మించి ఉండడం వల్ల భూమి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా వేడెక్కుతోంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం) అంటున్నారు. ఈ వాయువులు ముఖ్యంగా పరిశ్రమలు, వ్యవసాయం, వాహనాల నుంచి వాతావరణంలో కలుస్తున్నాయి.
ఎప్పుడు మొదలైంది
పారిశ్రామిక విప్లవం1700ల్లో వచ్చింది. ఆ విప్లవంతో అభివృద్ధి, దాంతో పాటు గ్లోబల్ వార్మింగ్ కూడా మొదలైంది. పరిశ్రమల అవసరాలకు బొగ్గు లాంటి ఫ్యూయెల్స్‌ని కాల్చడం వల్ల ఎక్కువ స్థాయిలో గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల అయ్యాయి. అవి వాతావరణంలో కలవడం వల్ల టెంపరేచర్లు పెరగడం మొదలైంది. వాతావరణ మార్పులపై ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ (ఐపీసీసీ) 2023 మార్చిలో ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం “మానవ కార్యకలాపాలు, గ్రీన్‌హౌజ్ వాయువులే గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణం.
మనుషులే కారణమా?
భూమి 4.5 బిలియన్ ఏండ్ల చరిత్రలో అనేకసార్లు చల్లగా, వేడిగా మారింది. కానీ.. అందుకు అనేక రకాల నేచురల్ ఫ్యాక్టర్స్ కారణమయ్యాయి. అగ్నిపర్వతాల పేలుళ్లు లాంటివి వాతావరణంపై ఎఫెక్ట్ చూపిస్తాయి. విస్ఫోటనాలప్పుడు వాతావరణంలోకి వాయువులు, ధూళి విడుదల అవుతాయి. వాటివల్ల వాతావరణంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అలా 56 మిలియన్ ఏండ్ల క్రితం ఒకసారి జరిగింది. అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల పెద్ద మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదలైంది. దాంతో టెంపరేచర్లు ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి.
కానీ.. ఇప్పుడు వస్తున్న మార్పులకు మాత్రం మనిషే కారణం అంటున్నారు సైంటిస్ట్‌లు. మనుషులు తమ అవసరాలు తీర్చుకోవడానికి బొగ్గు, పెట్రోలియం, నేచురల్ గ్యాస్ లాంటి ఫాజిల్ ఫ్యూయెల్స్‌ని విపరీతంగా కాల్చేస్తున్నారు. వీటివల్లే గ్రీన్‌హౌజ్ వాయువులు ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఉదాహరణకు కార్బన్ డై ఆక్సైడ్ విషయానికి వస్తే.. యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. భూ వాతావరణంలో దాని కాన్సన్ ట్రేషన్150 ఏండ్లలో విపరీతంగా పెరిగింది. పారిశ్రామిక విప్లవానికి ముందు 280 పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం) ఉండేది. ఇప్పుడది 410 పీపీఎం కంటే ఎక్కువగా ఉంది. ఐస్ కోర్లలో కార్బన్ డై ఆక్సైడ్ 8 లక్షల ఏండ్లలో ఇప్పుడే ఎక్కువ స్థాయిలో ఉందని తెలిసింది.
ఐక్యరాజ్యసమితి ప్రకారం..
క్లైమెట్ ఛేంజ్ మీద 2014లో ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఇచ్చిన ఒక నివేదికలో “వాతావరణ వ్యవస్థపై మనుషుల ప్రభావం పెరుగుతోంది. అన్ని ఖండాలు, మహాసముద్రాల్లో మార్పులు వచ్చాయి” అని చెప్పింది. అంతేకాదు1950ల నుండి గమనించిన అనేక మార్పుల ఆధారంగా గ్లోబల్ వార్మింగ్‌కు 95 శాతం మనుషులే ప్రధాన కారణమని చెప్పింది.
సహజంగానే..
గ్రీన్‌హౌజ్ వాయువుల్లో నీటి ఆవిరి, కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్ ముఖ్యమైనవి. ఈ వాయువులు కొంతవరకు సహజంగా వాతావరణంలో ఏర్పడతాయి. గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్‌కు అవి సరిపోతాయి. కానీ.. మనుషుల వల్ల వాటి కాన్సన్ ట్రేషన్ పెరిగిపోతోంది. అందుకు ఫాజిల్ ఫ్యూయెల్స్‌ని మండించడం, అడవులను నరికివేయడం లాంటి పనులు కారణం. వాతావరణంలోకి విడుదలైన కార్బన్ డై ఆక్సైడ్ శతాబ్దాలపాటు ఉంటుంది.
అది భూమి వేడెక్కడం, సముద్ర మట్టాలు పెరగడానికి కారణం అవుతోంది. అంతేకాదు.. సహజంగా ఏర్పడే గ్రీన్‌హౌజ్ వాయువులను పెంచడంతోపాటు కొత్తవి కూడా జోడించారు మనుషులు. వాటిలో క్లోరోఫ్లోరో కార్బన్‌లు ముఖ్యమైనవి. ఇవి ఎయిర్ కండిషనర్లు, ఫ్రీజర్‌లు, రిఫ్రిజిరేటర్‌లలో రిఫ్రిజెరాంట్‌గా పనిచేస్తాయి. ఈ రసాయనాలు ఓజోన్ పొరను విపరీతంగా దెబ్బతీస్తాయి. కార్బన్ డై ఆక్సైడ్‌తో పోలిస్తే ఇవి గాలిలో ఉన్నప్పుడు10,000 రెట్లు ఎక్కువ వేడెక్కుతోంది.
బోలెడు అంశాలున్నాయి
విద్యుత్ హైదరాబాద్ లాంటి సిటీల్లో ఒక గంట కరెంట్ పోతేనే అల్లకల్లోలం అయిపోతుంది. కరెంట్‌ని అంతలా వాడుతున్నారు. కానీ.. ఆ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ వల్ల వాతావరణం చాలా దెబ్బతింటోంది. ఇప్పటికీ చాలావరకు కరెంట్ బొగ్గు, ఫ్యూయెల్‌ని మండించి తయారుచేస్తున్నారు. దానివల్ల కార్బన్ డై ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ గాలిలో కలుస్తాయి.
వస్తువుల తయారీ
తయారీ పరిశ్రమ నుంచి కూడా చాలావరకు గ్రీన్‌హౌజ్ వాయువులు వస్తున్నాయి. ఎక్కువగా సిమెంట్, ఇనుము, ఉక్కు, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్, బట్టలు.. ఇతర వస్తువులను తయారుచేయడానికి ఫాజిల్ ఫ్యూయెల్స్ వాడుతున్నారు. మైనింగ్ లాంటివి కూడా ఈ వాయువులను విడుదల చేస్తాయి. ఈ ఫ్యాక్టరీల్లో మెషిన్లు కూడా ఫాజిల్ ఫ్యూయెల్‌తో పనిచేస్తాయి. ప్లాస్టిక్ లాంటివి కూడా ఫాజిల్ ఫ్యూయెల్స్ నుంచే తయారవుతాయి.
అడవులను నరికివేయడం
పొలాలు, పచ్చిక బయళ్ల కోసం అడవులను నరికేస్తున్నారు. ఇతర కారణాల వల్ల కూడా అడవులు నరికేస్తున్నారు. దీనివల్ల గ్రీన్‌హౌజ్ వాయువులు ఎక్కువగా పెరుగుతున్నాయి. చెట్టుని కోసినప్పుడు అది నిల్వ చేసిన కార్బన్‌ను విడుదల చేస్తుంది. కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించే అడవులు ప్రతి ఏడాది సుమారు12 మిలియన్ హెక్టార్ల వరకు నాశనం అవుతున్నాయి.
రవాణా
చాలావరకు కార్లు, ట్రక్కులు, ఓడలు, విమానాలు ఫాజిల్ ఫ్యూయెల్స్‌తోనే నడుస్తాయి. దీనివల్ల కూడా గ్రీన్‌హౌజ్ వాయువులు ముఖ్యంగా కార్బన్- డై ఆక్సైడ్ పెరుగుతోంది. పెట్రోలియంతో తయారయ్యే పెట్రోల్, డీజిల్లాంటివి మండడం వల్ల గ్రీన్‌హౌజ్ వాయువులు పెరుగుతాయి. ప్రపంచ కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల్లో నాలుగింట ఒక వంతు ట్రాన్స్‌పోర్టేషన్ వల్లే వస్తోంది.
ఫుడ్ ప్రొడక్షన్
పంటలు పండించడం వల్ల వివిధ మార్గాల్లో కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్‌తోపాటు మరికొన్ని గ్రీన్‌హౌజ్ వాయువులు వాతావరణంలో కలుస్తాయి. పశువుల మేత కోసం అడవులు నరకడం.. పంటలను పండించడానికి ఎరువులు వాడడం వల్ల ఈ వాయువులు ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు వస్తున్న అన్ని వ్యవసాయ పరికరాలు, ఫిషింగ్ బోట్లను నడపడానికి పెట్రోల్, డీజిల్ లాంటి వాటిని మండిస్తున్నారు. ఇది వాతావరణ మార్పులకు కారణం అవుతోంది. ఫుడ్ ప్యాకేజింగ్‌లో కూడా ఈ వాయువులు ఉత్పత్తి అవుతాయి.
భవనాల వల్ల
ఉత్పత్తయ్యే మొత్తం కరెంట్‌లో సగానికి పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నివాస భవనాలతోపాటు, ఆఫీస్ బిల్డింగ్స్ వాడుతున్నాయి. ముఖ్యంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వాడకం కూడా గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్‌కి కారణం అవుతోంది. వంట గ్యాస్ కూడా ఇందుకు కారణమే. ఇవన్నీ గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తాయి.
మనిషి తినే తిండి నుంచి వేసుకునే బట్టల వరకు అన్ని గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్ కు కారణమవుతున్నాయి. అంతెందుకు వేడి నుంచి తట్టుకోవడానికి వాడే ఏసీలు కూడా వేడి పెరిగేందుకు కారణం అవుతున్నాయి. కాబట్టి అవసరానికి మించి ఏదీ వాడకూడదు. ముఖ్యంగా లగ్జరీ కోసం వాడే ప్రతీది ప్రమాదాన్ని తెచ్చి పెట్టేదే. ఒక స్టడీ ప్రకారం.. ప్రపంచ జనాభాలో ధనవంతులైన ఒక శాతం మందే పేదరికంలో ఉన్న 50 శాతం మంది కంటే ఎక్కువ గ్రీన్‌హౌజ్ వాయువులు వాతావరణంలో కలవడానికి కారణం అవుతున్నారు.
ఇవన్నీ నష్టాలే..ఉష్ణోగ్రతలు
గ్రీన్‌హౌజ్ వాయువులు పెరిగేకొద్దీ ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 1980ల నుండి ప్రతి దశాబ్దం గతంతో పోలిస్తే.. వేడిగా ఉంటోంది. ముఖ్యంగా వడగాలుల (హీట్ వేవ్స్) వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటోంది. ఇంటి బయటికి వచ్చి పనులు చేసుకోవడానికి వీలు కావడం లేదు. అడవులు కాలిపోవడం వల్ల ఎన్నో జీవులు చనిపోతున్నాయి.
తుపాన్‌లు
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చాలా తుపాన్‌లు వచ్చాయి. టెంపరేచర్లు పెరిగే కొద్దీ నీరు ఎక్కువగా ఆవిరైపోతుంది. తర్వాత అదే తీవ్ర వర్షపాతంగా మారుతోంది. వరదలకు కారణం అవుతోంది. ఉష్ణమండల తుపాన్‌లకు ఇదే కారణం అవుతోంది. ఈ తుపాన్‌ల వల్ల సాధారణ జనాలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఎన్నో మరణాలకు కారణం అవుతున్నాయి.
పెరిగిన కరువు
గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతోంది. పెద్ద పెద్ద నగరాల్లో తాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ పంటల మీద కూడా పడుతోంది. దాంతో దిగుబడులు తగ్గి, ధరలు పెరుగుతున్నాయి. ఇసుక, ధూళి తుపాన్‌లు పెరుగుతున్నాయి. ఇవి బిలియన్ల టన్నుల ఇసుకను జనావాసాల్లోకి తెస్తాయి. అంతేకాదు.. ఎడారుల విస్తీర్ణం పెరుగుతోంది.
వేడెక్కుతున్న సముద్రం
గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రం చాలా వేడిని పీల్చుకుంటుంది. దాంతో వేడెక్కుతోంది. రెండు దశాబ్దాలుగా సముద్రంలోని నీటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నీరు వేడెక్కడంతో సముద్ర పరిమాణం పెరుగుతుంది. మంచు పలకలు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయి. తీరప్రాంతాలు, ఐల్యాండ్స్‌లో ఉండేవాళ్ల మీద ఈ ఎఫెక్ట్ చాలా పడుతుంది. అంతేకాకుండా సముద్రం కార్బన్ డై ఆక్సైడ్‌ని గ్రహిస్తుంది. దానివల్ల సముద్ర ఆమ్లత్వం పెరుగుతుంది. అందువల్ల సముద్ర జీవులకు, పగడపు దిబ్బలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే.. భూమిపై జీవుల మను గడకూ ప్రమాదం తప్పదు. రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఎన్నో జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది.
ఫుడ్ దొరకదు
వాతావరణంలో మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఆకలిని పెంచుతాయి. చేపల పెంపకం, పంటల దిగుబడి లాంటి వాటిమీద పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుంది. దానివల్ల సరిపడా ప్రొడక్షన్ ఉండదు. సముద్రం ఆమ్లంగా మారడంతో బిలియన్ల మందికి తిండి పెట్టే సముద్ర వనరులు కోల్పోవాల్సి వస్తుంది. ఆర్కిటిక్ ప్రాంతాల్లో వచ్చిన మార్పులు పశువుల పెంపకం, చేపలు పట్టడం లాంటి వాటి మీద ఎఫెక్ట్ చూపించాయి.
పేదరికం
ఉష్ణోగ్రతలు పెరగడంతో పేదరికం కూడా పెరుగుతోంది. వరదలు మురికివాడలను తుడిచిపెట్టేసే ప్రమాదం ఉంది. ప్రజలు ఇండ్లు, జీవనోపాధి కోల్పోవాల్సి వస్తుంది. నీటి కొరత పంటలపై ప్రభావం చూపుతుంది. దాంతో వలసలు పెరిగే ప్రమాదం ఉంది. గత దశాబ్దంలో వాతావరణ మార్పుల వల్ల ప్రతి ఏడాది సగటున 23.1 మిలియన్ల మంది వలస వెళ్లారు. చాలామంది శరణార్థులుగా మారారు.
ఇక్కడే ఆ ఎఫెక్ట్ ఎక్కువ
వాతావరణ మార్పు ప్రపంచంలోని ప్రతి దేశం మీద పడుతోంది. కానీ.. కొన్ని కారణాల వల్ల దాని ప్రభావం అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, బాగా పేదరికంలో ఉన్న ప్రదేశాలు క్లైమెట్ ఛేంజ్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు అభివృద్ధి చెందిన అమెరికా, కెనడా లాంటి దేశాలు కూడా గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నాయి. పోయినేడాది పాకిస్తాన్‌లో విపరీతంగా వరదలు వచ్చి బోలెడంత నష్టం కలిగింది. కెనడా, అమెరికాల్లో అడవులు తగలబడిపోయాయి.
ఈ మధ్య చిలీలో అడవులు కాలిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు123 ఏండ్లలో ఎప్పుడూ ఇంతలా నష్టం జరగలేదని లెక్కలు చెప్తున్నాయి. అంతేకాదు.. కెన్యాలో వచ్చిన వరదల వల్ల చాలా ప్రాణనష్టం జరిగింది. ఓల్డ్ కిబాజే డ్యామ్ కూలిపోయింది. ఈ వరదల వల్ల కెన్యాలో100 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలు బురద నీళ్లతో నిండిపోయాయి. ఇలాంటి సమస్యలతో నిత్యం పోరాడే దేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ...
చాడ్
గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆఫ్రికాలోని ‘చాడ్’ చాలా ఎఫెక్ట్ అయ్యింది. అందుకే ఇది హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ లో191 దేశాల్లో 190వ స్థానంలో ఉంది. గడిచిన 50 సంవత్సరాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరువు, సహజ వనరులను అధికంగా వాడడం.. లాంటి కారణాల వల్ల ఈ దేశం ప్రమాదపు అంచులకు చేరింది. ఈ దేశంలోనే అతిపెద్దదైన ‘చాడ్ సరస్సు’ ఇప్పటికే 90శాతం కనుమరుగైంది.
ఈ సరస్సును ఇప్పుడు ఒక చెత్తబుట్టగా మార్చేశారు. అంతేకాదు.. భారీ వర్షాలు, వరదల వల్ల చాడ్ సరస్సు బేసిన్ చాలావరకు క్షీణించింది. ఇది ఎడారి ప్రాంతం కాబట్టి నీటిని ఎక్కువగా పీల్చుకోదు. అందువల్ల వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ దేశ శ్రామికశక్తిలో 80 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు. దేశ జీడీపీలో 50శాతం కంటే ఎక్కువ వాటా వ్యవసాయానిదే. ఇలాంటి దేశంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల వరదలు వస్తే పరిస్థితులు దారుణంగా మారతాయి.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఒక దశాబ్దం పాటు జరిగిన సంఘర్షణ దేశ పర్యావరణ వ్యవస్థపై, వేల మంది పౌరుల జీవితాలపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. ఈ దేశం ఇప్పుడు ఎన్నో పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలోని ఉత్తర, పడమర ప్రాంతాల్లో ఇప్పటికే కరువు తాండవిస్తోంది. దక్షిణం వైపు ఉన్న ఉష్ణమండల ప్రాంతంలో ఈ మధ్య సంవత్సరాల్లో విపరీతంగా వరదలు వచ్చాయి. రాజధాని బంగూయ్‌లో 2022లో వచ్చిన వరదల వల్ల 2 వేల ఇండ్లు నాశనం అయ్యాయి. వరదలు, దేశంలో సరైన కంట్రోల్ లేని మైనింగ్ ఇండస్ట్రీల వల్ల నీరు కలుషితం అయిపోయింది.
ఎరిట్రియా
హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న ఒక చిన్న తీరప్రాంత దేశం ఇది. ఇక్కడ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎరిట్రియాలో 1960 నుండి ఇప్పటివరకు సగటు ఉష్ణోగ్రతలు దాదాపు 1.7 సెల్సియస్ వరకు పెరిగాయి. ఈ ఉష్ణోగ్రతలు కరువు, సముద్ర మట్టం పెరుగుదల, జీవవైవిధ్యం దెబ్బతినడం, ఆహార ఉత్పత్తి తగ్గడం లాంటి సమస్యలను తెచ్చిపెట్టాయి. అంతేకాదు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదం నుంచి తమను తాము కాపాడుకునే వనరులు ఈ దేశంలో లేవు.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోని చాలాకాలం పాటు ఫ్రాన్స్ పాలించింది. అప్పటి పాలకులు దేశంలోని అనేక సహజ వనరులను విపరీతంగా వాడేశారు. ఆ తర్వాత కాంగోకి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ అప్పటికే సహజ వనరుల దుర్వినియోగం వల్ల కొన్ని దశాబ్దాల నుంచి కాంగో సంక్షోభం ఎదుర్కొంటోంది. దేశంలో ముఖ్యంగా కార్పొరేట్ మైనింగ్ వల్ల విపరీతంగా నష్టం కలుగుతోంది. ఇవన్నీ చాలదన్నట్టు గ్లోబల్ వార్మింగ్ వల్ల వరదలు ముంచెత్తుతున్నాయి. దాంతో కరువు, ఆకలి బాధలు పెరుగుతున్నాయి.
గినియా–బిస్సౌ
లైబీరియాకు వాయువ్యంగా ఉన్న ఒక చిన్న పశ్చిమ ఆఫ్రికన్ దేశం. గినియా–బిస్సౌలో దాదాపు 350 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఈ దేశంలో 88 ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడ కూడా వరదలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. ముఖ్యంగా వర్షాకాలంలో జులై నుండి సెప్టెంబర్ వరకు వస్తుంటాయి. పోయినేడు అనూహ్యంగా భారీ వర్షాలు వచ్చాయి. ఆ ప్రభావం దేశంలోని 80 శాతం రైతుల మీద పడింది.
వరదలు పెద్ద మొత్తంలో ఆహార సంక్షోభాన్ని సృష్టించాయి. దానివల్ల దేశం1,20,000 టన్నుల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఏటా పెరుగుతున్న సముద్ర మట్టం వల్ల మొత్తం జనాభాలో 70 శాతం మంది ప్రమాదపు అంచుల్లోకి వెళ్తున్నారు. సముద్రంలో పెరిగిన సాలినిసేషన్(లవణీకరణ) వల్ల బియ్యం ఉత్పత్తి విపరీతంగా తగ్గింది. దేశంలో పండించే ప్రధాన పంటల్లో ఒకటి వరి. ఈ దేశంలో దాదాపు 65 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.
అఫ్గానిస్తాన్
అఫ్గానిస్తాన్‌లో 1950 నుంచి 2010 మధ్య టెంపరేచర్లు 1.8 సెల్సియస్ పెరిగాయి. వర్షాలు 40% తగ్గాయి. ప్రస్తుతం అక్కడి ప్రజలు కరువుతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈ శతాబ్దం చివరి నాటికి టెంపరేచర్లు ఆరు డిగ్రీల సెల్సియస్ పెరిగే ప్రమాదం ఉందనేది ఎక్స్‌పర్ట్స్ అంచనా. వరుసగా గడిచిన మూడేండ్లు ఇక్కడి ప్రజలు కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ప్రభావం దాదాపు కోటి మందిపై పడింది. నీటి సంక్షోభానికి దారి తీసింది.
సముద్రపు కోత
మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా గ్లోబల్ వార్మింగ్ వల్ల సమస్యలను ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో 294.89 కిలోమీటర్లు లేదా 28.7 శాతం తీరప్రాంతం కోతకు గురవుతోంది. తూర్పుగోదావరి (89.25 కి.మీ), కృష్ణా (57.55 కి.మీ), నెల్లూరు (53.32 కి.మీ), విశాఖపట్నం (25.81 కి.మీ), శ్రీకాకుళం (25.12 కి.మీ) జిల్లాలు కోతకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఉష్ణమండల తుపానులు, వరదలు, సముద్ర మట్టం పెరగడం లాంటివి తీరం కోతకు కారణమవుతాయి. దీనివల్ల తీరప్రాంతంలో భూమి, నివాసాలు కోల్పోవాల్సి వస్తోంది. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ చేసిన స్టడీలో వైజాగ్ సిటీ మూడు దశాబ్దాలుగా కోతకు గురవుతోందని తేలింది. బీచ్‌లు, 3.5 కిలో మీటర్ల మేర తీరప్రాంత రోడ్లు పోయాయి.
ఉప్పాడ తీరంలో విపరీతంగా నష్టం కలిగింది. గత పదేండ్లలో సముద్రపు కోత చాలా పెరిగింది. ఈ ప్రాంతంలో గడిచిన పదేండ్లలో కిలోమీటరుకుపైగా సముద్రం ముందుకొచ్చింది. ఇప్పటికే ఇక్కడ కొన్ని గ్రామాలు ఖాళీ అయ్యాయి. మరికొన్ని ఖాళీ అయ్యే అవకాశం కూడా ఉంది.
ఓజోన్ లేయర్
శత్రువుల నుంచి తప్పించుకోవడానికి సైనికుడి చేతిలో షీల్డ్ ఉంటుంది. అలాగే భూమిపైన ఉన్న జీవకోటిని అతినీలలోహిత కిరణాలు (యూవీ(అల్ట్రా వైలెట్) రేస్) అనే శత్రువు నుంచి ఓజోన్ పొర కాపాడుతుంటుంది. అలాంటి రక్షణ పొరకి చిన్న రంధ్రం పడితే.. భూమ్మీద అనంత జీవరాశి మనుగడ ఒక్కసారిగా మారిపోతుంది. ఓజోన్ పొరకు పడిన రంధ్రం పెద్దది అవుతుంటే... యూవీ కిరణాల దాడి ఎక్కువ అవుతోంది. భవిష్యత్తు తరాలను యూవీ రేస్ ప్రమాదం నుంచి కాపాడాలంటే మన ముందున్న ఒకే ఒక్క దారి ఓజోన్ పొరకు పడిన రంధ్రాన్ని పూడ్చడమే. ఆ రంధ్రం పూడ్చాలంటే అసలు ఓజోన్ పొరకు రంధ్రం ఎందుకు పడిందో తెలుసుకోవాలి.
అంతా మన వల్లే
ఓజోన్ పొరకు రంధ్రం పడడానికి మొదటి కారణం రసాయనాల తయారీ. రసాయనాల తయారీలో కొన్ని టాక్సిక్ కెమికల్ గ్యాస్‌లు రిలీజ్ అవుతాయి. వాటిని పీల్చితే మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం. దానికి మొన్నామధ్య జరిగిన వైజాగ్ ఇన్సిడెంట్ ఉదాహరణ. అలాగే హాలోకార్బన్స్, సాల్వెంట్స్ (ఇథనాల్, మిథనాల్, ఎసిటోన్), ప్రొపెల్లెంట్స్(ఎన్టుఓ, నైట్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్), ఫోమ్ బ్లోయింగ్ ఏజెంట్స్, హెచ్ఎఫ్సిలు కూడా కారణం.
రికార్డు స్థాయిలో ప్రమాద హెచ్చరిక
ఓజోన్ పొర క్షీణించేస్థాయిలో పర్యావణంలో మార్పులు వచ్చాయా? వచ్చాయి. ధృవ ప్రాంతాల్లో స్ట్రాటోస్పియరిక్ ఓజోన్ తగ్గుతున్నట్లు1970 మొదట్లోనే సైంటిస్ట్‌లు గుర్తించారు. ఆ తర్వాత1979లో ఓజోన్ పొరకు మొదటిసారి పెద్ద రంధ్రాన్ని గుర్తించారు. ఆ తర్వాతి రోజుల్లో అది నెమ్మదిగా పూడిపోయింది. కానీ... తరచూ ఎంతో కొంత తగ్గిపోతూనే ఉంది. దాని ఫలితంగా పోయిన ఏడాది సెప్టెంబర్ నెల, మొదటి రెండు వారాల్లో మునుపటి కంటే 75శాతం పెద్ద రంధ్రం ఉన్నట్టు గుర్తించారు. అది అంటార్కిటికా ప్రాంతంలో కనిపించింది. అందుకే దాన్ని ‘అంటార్కిటికా హోల్’ అంటారు. ఆ తర్వాత కూడా అది వేగంగా పెరుగుతూ పోయింది. అక్టోబర్ మొదలయ్యే టైంలో 24.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్‌కి చేరింది.
2020లో 7లక్షల చదరపు మీటర్లని దాటింది. 2021లో మరోసారి రికార్డు స్థాయిలో రంధ్రం పెరిగింది. కాగా ఇప్పుడు ఇది ఎనిమిదోసారి. అయితే 2023 డిసెంబర్ 20 నాటికి అంటార్కిటిక్ ఓజోన్ హోల్ మూసుకుపోయిందని యూరోపియన్ అట్మాస్పియర్ మానిటరింగ్ సర్వీస్ చేసిన ఒక స్టడీ చెప్పింది. ఇప్పుడున్న పాలసీలు అలాగే ఉంటే 2066 నాటికి అంటార్కిటిక్, 2045 నాటికి ఆర్కిటిక్, 2040 నాటికి మిగిలిన ప్రపంచమంతా కూడా బాగుపడుతుంది. ‘1980లో ఓజోన్ రంధ్రం కనపడకముందు ఎలా ఉందో అలాంటి పరిస్థితులు మళ్లీ చూడొచ్చు’ అనేది వాతావరణ శాస్త్రవేత్తల అంచనా.
ఆ ప్రభావం ఇదే...
ఒకవేళ ఓజోన్ హోల్ పూడకపోయినా లేదా ఓజోన్ పొర క్షీణిస్తూపోయినా భూమ్మీద ప్రతి ప్రాణి లైఫ్ సైకిల్లో మార్పులు వస్తాయి. అదెలాగంటే... మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఆ ఆక్సిజన్ వల్లే జీవరాశి బతుకుతోంది. అయితే, వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్‌తో పాటు నైట్రోజన్ గ్యాస్ కూడా ఉంటుంది. దాన్ని మొక్కలు పీల్చుకోలేవు. కానీ ఇండస్ట్రీల్లో తయారయ్యే విషవాయువులు గాల్లోనే కలుస్తాయి.
దానివల్ల మొక్కల లైఫ్ సైకిల్ గందరగోళంగా మారుతుందని 2019లో చేసిన ఒక స్టడీ చెప్పింది. దీని కారణంగా సముద్రాల్లో ఆల్గల్ బ్లూమ్స్ (విషాలు), సముద్ర జీవులు బతకడానికి వీలులేని ప్రదేశాలుగా మారిపోతాయి. అంతేకాదు నేల, నీళ్లలో నివసించే ప్రాణులన్నీ అపాయంలో చిక్కుకుంటాయి. జీవవైవిధ్యం నష్టానికి దారి తీస్తుంది. దీనంతటికీ కారణం భూమ్మీద నైట్రోజన్ ఎక్కువగా లేదా తక్కువగా ఉండడం. ‘వాతావరణంలో నైట్రోజన్ ఎక్కువైనా, తక్కువైనా ఆ ప్రభావం కనిపిస్తుంది’ అని ఒక స్టడీ వెల్లడిచేసింది. అలా జీవులన్నీ నశించిపోతుంటే వాటి మీద ఆధారపడిన మన మనుగడ సాధ్యమవుతుందా?
వడగాలులు పెరిగిపోయాయి
ఏటేటా ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎండలు మండిపోయాయి. ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో 40 దాటి 45 డిగ్రీల వరకు వాతావరణం వేడెక్కింది. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 21న 46.0 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. జార్ఖండ్‌లోని ఈస్ట్ సింఘభుమ్ జిల్లాలోని భర్గొరా అనే ఊళ్లో ఈ రికార్డ్ స్థాయి ఎండ తీవ్రత నమోదైంది. ఏప్రిల్ నెల మొదలైనప్పటి నుంచి ఎండ మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ‘ఇంకో రెండు రోజుల్లో టెంపరేచర్ పెరుగుతుంది. అప్రమత్తంగా ఉండండి’ అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రెండు రోజులు గడిచాక మరో మూడు రోజులు. ఆ తరువాత మరో ఐదు రోజులు అని ఉష్ణోగ్రతల గురించి ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్‌లు ఇస్తున్నారు. ఇలాగే నెలంతా టెంపరేచర్ ఓ రేంజ్లో ఆడుకుంది. పొద్దున పది గంటల తర్వాత బయటకు రావద్దు. సాయంత్రం నాలుగ్గంటల వరకు ఇంట్లో లేదా నీడ పట్టునే ఉండాలని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు.
తెలుగు రాష్ట్రాల్లో వందేండ్ల తర్వాత
తెలంగాణ, ఏపీల్లో సూర్యుడి ప్రతాపం విపరీతంగా చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ ఏప్రిల్ నెలలో1921-–2024 మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు ఉన్న డాటాను షేర్ చేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏప్రిల్ నెల అత్యంత వేడి నెలగా ఉన్నదని ఈ డాటా రిపోర్ట్. ఐ.ఎమ్.డి.(ఇండియా మెటిరియోలాజికల్ డిపార్ట్మెంట్) ప్రకారం దేశంలోని తూర్పు, దక్షిణ ద్వీపకల్పంలో వేడిగాలుల ప్రభావం కనిపిస్తోంది.
మే నెలలో ఎండ వేడి వల్ల పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, రాయలసీమ వంటి ప్రాంతాల్లో హీట్ స్ట్రోక్ ప్రమాదం ఉందని రెడ్ అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. హిమాలయా పర్వత ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణ, కర్నాటక వంటి ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చారు. ఉష్ణోగ్రత 2-–3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది.
ఇంట్లో ఉన్నా..
కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్, గ్రాసరీ ట్రాన్స్పోర్ట్ చేసే ఉద్యోగులు, ట్రాఫిక్ పోలీసులు, స్పోర్ట్స్ పర్సన్స్, అపార్ట్మెంట్లలో పై అంతస్తుల్లో ఉండేవాళ్లు, 65 ఏండ్లు దాటిన వాళ్లకు ఈ ఎఫెక్ట్ ఎక్కువ. అలాగే సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఇంట్లో ఉన్నా వడదెబ్బ నుంచి తప్పించుకోలేరని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అందుకు కారణం వేడి గాలి. ఇంటి పైకప్పు నుంచి వేడి గాలి లోపలికి వస్తుంది. అందుకే ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటే వేడి గాలి వస్తుంది. అందువల్ల ఇంట్లో ఉన్నా కూడా 60 ఏండ్లు దాటిన వాళ్లు, పదేండ్ల లోపు పిల్లలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. వాళ్లలో ఇమ్యూనిటీ తక్కువ ఉండి త్వరగా ఎఫెక్ట్ అవుతారు. మధ్యాహ్నం టైంలో బాల్కనీలో నిలబడడం, కిటికీలు తెరిచి ఉంచడం వల్ల వేడి గాలి ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్నా ఇంటి పైకప్పుకు చల్లదనం కలిగించే పెయింటింగ్‌లు వేయించాలి. ఇంట్లో మొక్కలు పెంచాలి. దాహం అనిపించినప్పుడే కాకుండా మధ్య మధ్యలో నీళ్లు లేదా పానీయాలు తాగాలి. ఫ్రూట్స్ తినాలి.
వడదెబ్బ ఎఫెక్ట్ ఇలా..
వడదెబ్బ ప్రభావం మెదడు, గుండె, కిడ్నీలు, లివర్, కండరాల మీద ఉంటుంది. అంతెందుకు మానసిక స్థితిలో కూడా మార్పు వస్తుంది. ఒత్తిడి, గందరగోళం, కోపం వంటివి కనిపిస్తాయి. కండరాల నొప్పులు, తిమ్మిర్లు, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటివి ఉంటాయి. కండరాలు బిగుసుకుపోతాయి. వడదెబ్బకు సరైన చికిత్స తీసుకోకపోతే రక్తం చిక్కబడి శరీరంలో అవయవాలకు రక్తప్రసరణ వేగం తగ్గిపోతుంది. ఆ ఎఫెక్ట్ ప్రధానంగా కిడ్నీలు, గుండె, మెదడుపై పడుతుంది. మూత్రం చిక్కగా, ఎర్రగా కూడా వస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారి తీస్తుంది. దీన్ని ‘ర్యాబ్డోమయోలైసిస్’ అంటారు.
డీహైడ్రేషన్ అనేది పెద్ద సమస్యగా ఉంటుంది ఈ సీజన్లో. దీని ఎఫెక్ట్ అర్ధం కావాలంటే ఈ మధ్య ఒక టీవీ ఛానెల్ యాంకర్ వార్తలు చదువుతూ లైవ్‌లోనే కుప్పకూలింది. ఏమైందా? అని చూస్తే డీహైడ్రేషన్ అని తేలింది. ఇదే విషయాన్ని తన ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేసిందామె. ‘అందరూ నీళ్లు ఎక్కువ తాగండి’ అని ఆ వీడియోలో చెప్పింది. ఆ యాంకర్ చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది అని చెప్పాలి.
ఎందుకంటే ఒక కూలీ పనిచేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌కి తీసుకెళ్తే చనిపోయాడన్నారు. అలాగే కర్నాటకలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి వడదెబ్బ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతన్ని ట్రీట్మెంట్ కోసం బెంగళూరు తీసుకెళ్తే అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. వయోవృద్ధులు, ఎండల్లో పనిచేసే వాళ్లలో వారానికి దాదాపు ముగ్గురు లేదా నలుగురు చనిపోతున్నారట!
వడదెబ్బ ప్రమాదమా?
శరీరం తీవ్రమైన వేడిని తట్టుకోలేనప్పుడు వడదెబ్బ తగులుతుంది. నార్మల్ బాడీ టెంపరేచర్ 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా 37 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. బాడీ టెంపరేచర్ సాధారణం కంటే పెరిగి 104 డిగ్రీల ఫారెన్ హీట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎండలో బయటకు వెళ్లడం, ఎక్కువ సేపు ఉండడం వల్ల వడదెబ్బ తగులుతుంది. జ్వరం వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్ పెరగడం అనేది సాధారణం. మెడిసిన్ వేసుకోవడం వల్ల చెమటలు పట్టడంతోపాటు శరీరంలో వేడి తగ్గుతుంది. కానీ వేసవిలో పొడి వాతావరణం వల్ల చెమట పట్టదు. శరీరం నుంచి చెమట బయటకు రాకపోతే శరీరం వేడెక్కుతుంది. దాంతో టెంపరేచర్ కంట్రోల్ కాదు. అప్పుడు వడదెబ్బ తగులుతుంది. దానివల్ల స్పృహ తప్పి పడిపోతారు. ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మరణాలకి దారితీస్తుంది.
ఏం చేయాలి?
శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు మించి ఉన్నప్పుడు సమస్య వస్తుంది. కాబట్టి ఎండలో ఎక్కువ టైం పనిచేసేవాళ్లు వడదెబ్బ లక్షణాలు కనపడగానే నీడలోకి వెళ్లాలి. అలాంటప్పుడు శరీరాన్ని చల్లబరిచే ప్రయత్నం చేయాలి.
తల, ఛాతి, నడుము, చేతులు, కాళ్లలో ఐస్ లేదా గోరువెచ్చని క్లాత్‌తో రుద్దడం వల్ల శరీరంలోని వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. చంకలు, గజ్జలు, మెడ, వీపు భాగాల్లో ఐస్‌క్యూబ్స్‌తో మసాజ్ చేయాలి. ఎందుకంటే ఈ భాగాల్లో రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయి. ఐస్‌తో మసాజ్ చేస్తే అవి చల్లబడి బాడీ టెంపరేచర్ తగ్గుతుంది.
- వడదెబ్బ తగిలిన వాళ్లకు గాలి బాగా తగిలే ఏర్పాట్లు చేయాలి. వ్యక్తి స్పృహలో ఉంటే నీరు లేదా ఎలక్ట్రోలైట్స్ ఉన్న హెల్దీ డ్రింక్స్ తాగించాలి.
- చల్లటి నీళ్లతో స్నానం చేయించాలి లేదా చల్లని నీటి టబ్‌లో కూర్చోబెట్టాలి. ఇలా చేస్తే కాళ్ల వాపు తగ్గుతుంది. మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
- యంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్లు హెల్దీగా ఉండి, ఎక్కువగా వర్కవుట్స్ చేసి వడదెబ్బ బారినపడితే దాన్ని ‘ఎక్జర్షనల్ హీట్ స్ట్రోక్’ అంటారు. శరీరాన్ని చల్లబరిచేందుకు వాళ్లకు ఐస్ బాత్ చేయించాలి.
- బయట తిరగకూడదు. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్‌లు తాగుతూ బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి.
- బయటకు వెళ్లేటప్పుడు నీళ్లు, గొడుగు, క్యాప్ తీసుకెళ్లాలి. వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి.
- నూనె పదార్థాలు, వేపుళ్లు, జంక్ ఫుడ్, మసాలాలు, కారం, ఫాస్ట్‌ఫుడ్స్, కాఫీ, ఆల్కహాల్, ఐస్‌క్రీమ్, కూల్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి.
- కఠిన వ్యాయామం తగ్గించి ఉదయంపూట యోగా, వాకింగ్ వంటివి చేయాలి.
- పసిపిల్లలకు ఉదయం 8 గంటల లోపు, సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే స్నానం చేయించాలి.
- పసివాళ్లకు తరచూ తల్లిపాలు పట్టాలి. రబ్బరు లేదా ఎలాస్టిక్ డైపర్లు వాడకూడదు.
- వీలైతే ఇంట్లోనే ఉండాలి. కిటికీలు, తలుపులు మూసివేయాలి. సాధ్యమైనంతవరకు ఎండలో ప్రయాణాలు మానుకోవాలి. కాంక్రీట్ నేలపై పడుకోవద్దు. కాంక్రీట్ గోడలకు ఆనుకుని కూర్చోవద్దు. ఎలక్ట్రానిక్ పరికరాలను అన్‌ప్లగ్ చేసి ఉంచాలి.
1.5 సెల్సియస్ లిమిట్
వాతావరణ మార్పులు– ఇంపాక్ట్స్ మీద ఆందోళనలు పెరుగుతుండడంతో 2015లో 195 దేశాలు పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ప్రకారం.. ఈ శతాబ్దం చివరినాటికి భూఉష్ణోగ్రతలు తగ్గించాలి. అది.. ప్రి– ఇండస్ట్రియల్ లెవెల్స్‌తో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్‌కు మించకూడదు. కానీ ఈ ఒప్పందం లక్ష్యం మాత్రం పెరుగుదలను1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చేయడం. అయితే.. ఈ ఒప్పందంలో ప్రి–ఇండస్ట్రియల్ లెవెల్స్ ఎంత అనేది చెప్పలేదు. సైంటిస్ట్‌లు మాత్రం1850 నుండి 1900 వరకు సంవత్సరాలను బేస్‌లైన్‌గా పరిగణిస్తారు. అయితే.. 1.5 డిగ్రీల సెల్సియస్ లిమిట్‌గా పెట్టడం వెనక ఒక కారణం ఉంది. అదేంటంటే అంతకు మించితే.. అది చాలా ప్రమాదాలకు దారితీస్తుందని నిర్ధారించారు సైంటిస్ట్‌లు. అందువల్ల 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని ‘‘డిఫెన్స్ లైన్”గా సెట్ చేయాలని నిర్ణయించారు.
ఒకవేళ ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్రి–ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే.. ప్రజల మీద కోలుకోలేని ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నారు. ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ ప్రకారం.. 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితి దాటితే.. అనేక ప్రాంతాలలో భారీ వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో కరువు పెరుగుతుంది. మహాసముద్రాలు విపరీతంగా వేడెక్కుతాయి. బలమైన హరికేన్‌లు తీరప్రాంతాలను అతలాకుతలం చేస్తాయి. ఇవేకాకుండా ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి. ప్రపంచ వాతావరణ సంస్థ 2023లో ఇచ్చిన స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ ప్రకారం.. 2023నుంచి 2027 మధ్య కనీసం ఒక ఏడాది1.5 లిమిట్‌ని దాటే అవకాశం 66 శాతం ఉందని చెప్పింది. 2023 ఇప్పటికే అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఏడాదిగా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా... 2023లో ఈ లిమిట్ సగటు ప్రి–ఇండస్ట్రియల్ లెవల్ కంటే.. 1.48 డిగ్రీల సెల్సియస్ పెరిగింది.
ఓజోన్ హోల్ అంటే..
భూమి ఉపరితలం మీద పొరలు ఉంటాయి. వాటిలో మొదటిది ట్రోపో స్పియర్. రెండోది స్ట్రాటో స్పియర్. ఈ రెండింటి పైన ఉండేదే ఓజోన్ లేయర్. సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో అతి ప్రమాదకరమైనవి యూవీ కిరణాలు. అవి భూమ్మీద నేరుగా పడితే జీవరాశి నశించిపోతుంది. అలా జరగకుండా ఓజోన్ పొర అడ్డుగోడలా ఉంది. కానీ, గాల్లో విషవాయువులు, వేడి వాతావరణం పెరగడం వల్ల ఓజోన్ లేయర్ దెబ్బ తింటోంది. స్ట్రాటో స్పియర్ మీద యూవీ కిరణాలు పడడం వల్ల ఎలాంటి నష్టం జరగదు. దాన్ని ముందే పసిగట్టి ఓజోన్ పొరకు పడిన రంధ్రాన్ని మళ్లీ పూడ్చడం వల్ల ప్రమాదం తప్పుతుంది. కానీ భూమ్మీదకి యూవీ కిరణాలు చేరలేదు కదాని నిర్లక్ష్యం చేస్తే అవి కాస్త ట్రోపో స్పియర్ మీదకు వస్తాయి. అప్పుడు నేరుగా జీవరాశిపై ఎఫెక్ట్ పడుతుంది.
ఓజోన్ హీలింగ్
మనుషులైనా, జంతువులైనా రోజూ ఆరోగ్యంగా ఉండలేరు. ఏదో ఒకరోజు అనారోగ్యం బారిన పడాల్సిందే. తినే అలవాట్లు, చేసే పనులు, కంటి నిండా నిద్ర... ఇవన్నీ ఒక సైకిల్ ప్రకారం ఉంటే అంతా బాగానే ఉంటుంది. ఆ సైకిల్ ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడే అనారోగ్యం పలకరిస్తుంది. అలాగే.. ఓజోన్ పొర కూడా. మనం చేసే పనులను బట్టే అది ఆరోగ్యంగా ఉంటుంది. మోతాదుకు మించి విషవాయువులు విడుదల కావడం, గ్లోబల్ వార్మింగ్‌ని ఓజోన్ లేయర్ తట్టుకోలేకపోతోంది. దాంతో నెమ్మదిగా పొర క్షీణిస్తోంది. అలా ఒక రంధ్రం ఏర్పడే స్టేజ్‌కి వెళ్తోంది.
రంధ్రం పడిందంటే.. ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఎప్పుడు? ఏం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే ప్రకృతి విలయాలు ఎలా? ఎప్పుడు? జరుగుతాయో అంచనా వేయడం కష్టం. ప్రస్తుతం చూస్తున్న విపరీతమైన వరదలు, కాలుష్యం, తీవ్రమైన ఉష్ణోగ్రతలకు కారణం మనిషే. కాబట్టి మనిషే వాటికి చెక్ పెట్టాలి. చెట్లు పెంచాలి. కాలుష్యాన్ని తగ్గించాలి. ప్రకృతికి హాని చేసే వాటిని వాడడం మానేయాలి. అప్పుడే ఓజోన్ పొర బాగుపడుతుంది. క్రమంగా ఏర్పడిన రంధ్రం పూడిపోతుంది. దీన్నే ‘ఓజోన్ హీలింగ్’ అంటారు.
అయితే... ఒక్కసారి రంధ్రం పూడిందంటే మళ్లీ ఏర్పడదని కాదు. రంధ్రం ఏర్పడాలన్నా, పూడాలన్నా మనిషి చేసే పనుల మీదే ఆధారపడి ఉంది. కాబట్టి ప్రకృతిని సరిగా కాపాడుకోకపోతే ఎన్నిసార్లైనా రంధ్రం పడొచ్చు. అది చిన్నగా ఉన్నప్పుడే గుర్తిస్తే ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవచ్చు. లేదంటే చినుకు చినుకు కలిసి గాలి వాన అయినట్టు.. చిన్న రంధ్రమే పెరిగి పెద్దదవ్వొచ్చు. అప్పుడు ఎంత జాగ్రత్తపడినా లాభం ఉండకపోవచ్చు.
కరోనా టైంలో..
ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించింది కరోనా మహమ్మారి. ఏడాదంతా చావుకేకలతో అల్లాడించింది. ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతికారు. మనిషి వైరస్‌కు భయపడి తీసుకున్న జాగ్రత్తల వల్ల ఓజోన్ పొరకు పడిన రంధ్రం పూర్తిగా పూడిపోయి, చాలా ఆరోగ్యంగా అయిపోయింది. కరోనా టైంలో వెహికల్స్ తిరగలేదు. ఫ్యాక్టరీలు పనిచేయలేదు. చె
ట్లు నరకలేదు. ఫలితంగా గాలి, నీరు కలుషితం కాలేదు. చెట్ల పచ్చదనంతో వాతావరణంలో కార్బన్– డై– యాక్సైడ్ తగ్గింది. ఒక్కసారిగా మురికి నీళ్లు తేటగా మారిపోతే ఎలా ఉంటుందో అలా.. క్లియర్‌గా కనిపించింది వాతావరణం. అంటే... ప్రకృతి బాగుండాలంటే మనమంతా పనులు చేసుకోకుండా ఇంట్లోనే ఉండాలా? అనొచ్చు. ఇంట్లో కూర్చుంటే బతికేదెలా? అందుకే ఇంట్లో ఉండమని చెప్పడంలేదు. కాకపోతే చేసే ప్రతి పని, వేసే అడుగు ఆచితూచి పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలి.
వడదెబ్బ లక్షణాలు ఇవే
- వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో శారీరక శ్రమ చేయడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ కొన్ని గంటల్లోనే చూపిస్తుంది. ఎండలోకి వెళ్లినప్పుడు ఒక్కసారిగా తల తిరగడం. కళ్ల ముందు చీకట్లు కమ్మడం
- బీపీ, షుగర్ లెవల్స్ పడిపోవడం
- నాలుక పొడిబారడం
- కళ్లు బైర్లు కమ్మడం
- విపరీతమైన దాహం
- చర్మం పొడిబారడం
- పెదవులు పగిలిపోవడం
- మాట్లాడేటప్పుడు తడబాటు
- మూర్ఛ
- కడుపు నొప్పి, తలనొప్పి, తల తిరగడం
- ఛాతిలో ఇబ్బంది
- నీరసం, నిస్సత్తువ (హీట్ ఎగ్జాషన్) వంటి సింప్టమ్స్ కనిపిస్తాయి.
డాటా ప్రకారం, హీట్‌వేవ్ ఇండెక్స్ 40 – 50 డిగ్రీల సెల్సియస్ వరకు కనిపిస్తోంది. కేరళతో పాటు తూర్పు తీరంలోని పలు ప్రాంతాల్లో ఈ సూచీ 50 నుంచి 60 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది.
దర్వాజ డెస్క్