గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్​–2024

ఆక్స్ఫర్డ్​ పావర్టీ అండ్​ హ్యూమన్​ డెవలప్​మెంట్​ ఇనీషియేటివ్​ (ఓపీహెచ్​ఐ), ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ (యూఎన్​డీపీ)లు సంయుక్తంగా గ్లోబల్​ మల్టీ డైమెన్షనల్​ పావర్టీ ఇండెక్స్​(ఎంపీఐ)–2024ను విడుదల చేశాయి. మొత్తం 112 దేశాల్లో పేదరిక స్థాయిలను అంచనా వేశాయి. సంఘర్షణలతో పేదరికంలో మగ్గుతున్న దేశాలు అనే శీర్షికతో ఈ నివేదిక రూపొందించారు. ఇళ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, వంట గ్యాస్​, పోషకాహారం లేమి తదితర అంశాలపై 2022–23 మధ్య అందుబాటులోని సమాచారం ఆధారంగా రూపొందించారు. 

ప్రపంచంలో అత్యధికంగా పేదలు భారత్​ (23.4 కోట్లు), పాకిస్తాన్​ (9.3 కోట్లు), ఇథియోపియా (8.6 కోట్లు), నైజీరియా (7.4 కోట్లు), కాంగో (6.6 కోట్లు) ఉన్నారు. ఈ ఐదు దేశాల్లోనే ప్రపంచ పేదల్లో 48.1 శాతం ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదల్లో 83.2 శాతం మంది ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లోనే ఉన్నారని నివేదిక గుర్తించింది. మొత్తం పేదల్లో 83.7 శాతం మంది గ్రామాల్లోనే ఉన్నారని నివేదిక పేర్కొంది. 

45.5 కోట్ల మంది పేదలు నిత్య సంఘర్షణలతో అల్లాడుతున్న దేశాల్లో నివసిస్తున్నారని నివేదిక పేర్కొన్నది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 2023లో అత్యధికంగా దేశాల్లో అంతర్గత ఘర్షణలు, పలు దేశాల మధ్య యుద్ధాలు నెలకొన్నాయని, దీనివల్ల 11.7 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవాల్సి వచ్చిందని నివేదిక తెలిపింది. 

ప్రపంచమంతా కడు పేదరికం అనుభవిస్తున్న 110 కోట్ల మందిలో సగానికి పైగా మైనర్లేనని (18 ఏండ్లలోపు చిన్నారులు) తెలిపింది. మొత్తం 110 కోట్ల మంది పేదల్లో ఘర్షణలు, యుద్ధాలు, అశాంతియుత పరిస్థితులు నెలకొన్న రీజియన్లలో 40 శాతం (45.5 కోట్లు) ఉన్నారని వెల్లడించింది. 

భారత్​లో పరిస్థితి

భారతదేశంలో సుమారు 234 మిలియన్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని నివేదిక తెలిపింది. 2013–14లో 29.17 శాతంగా ఉన్న బహుముఖ పేదరిక నిష్పత్తి 2022–23 నాటికి 11.28 శాతానికి తగ్గింది. 
మెథడాలజీ: మూడు కోణాల్లో 10 సూచికల ద్వారా పేదరికాన్ని కొలుస్తారు. 

ఆరోగ్యం: పౌష్టికాహారం, శిశు మరణాలు 

విద్య: పాఠశాల విద్యా సంవత్సరాలు, పాఠశాల హాజరు

జీవన ప్రమాణాలు: వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు, గృహ నిర్మాణం, ఆస్తులు.