‘గిరిప్రదక్షిణ’కోసం యాదగిరిగుట్ట ముస్తాబు

యాదగిరిగుట్ట, వెలుగు:  యాదగిరిగుట్ట  లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం నిర్వహించే ‘గిరిప్రదక్షిణ’ కోసం యాదగిరిగుట్ట ముస్తాబైంది. కార్తీకమాసంలో వస్తున్న స్వాతి నక్షత్రం కావడంతో.. గిరిప్రదక్షిణ కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.   గిరిప్రదక్షిణ చేసిన అనంతరం భక్తులు భజనలు, కీర్తనలు, భక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు చేయడానికి వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.

శుక్రవారం ఉదయం 5:30 గంటలకు మొదలయ్యే గిరిప్రదక్షిణలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొననున్నారు. ఉదయం 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద నారసింహుడి పాదాలకు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రత్యేక పూజలు చేసి భక్తులతో కలిసి కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేయనున్నారు. అనంతరం కాలినడకన కొండపైకి వెళ్లి ప్రధానాలయంలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.