- 6 నెలలు రోడ్లు ఊడ్వడానికి టెండర్లు పిలిచిన బల్దియా
- ఇప్పుడున్న అద్దె మెషీన్లు సరిగ్గా పనిచేయడం లేదన్న విమర్శలు
- అయినా అటు వైపే అధికారులు మొగ్గు
- సొంతంగా మెషీన్లు కొంటే అయ్యే ఖర్చు రూ.12 కోట్లు లోపే
- 400 మంది కార్మికులను తీసుకుంటే 6 నెలలకు అయ్యే ఖర్చు రూ.కోటే
హైదరాబాద్ సిటీ, వెలుగు : కాంప్రెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) కింద సిటీ రోడ్ల నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న ఏజెన్సీల గడువు పూర్తికావస్తోంది. కొన్నింటికి ఈ నెలలో, మరికొన్నింటికి వచ్చే నెలలో గడువు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో సిటీ రోడ్ల బాధ్యతలను ఆరు నెలల పాటు జీహెచ్ఎంసీ నేరుగా చూసుకోనుంది. ఇందుకోసం అద్దె ప్రతిపాదికన స్వీపింగ్ మెషీన్లు తీసుకోవాలని భావించి ఇటీవల జోన్ల వారీగా టెండర్లను ఆహ్వానించింది.
ఈ ఆరు నెలల కోసం దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేయనుంది. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ అద్దె ప్రతిపాదికన తీసుకున్న స్వీపింగ్మెషీన్లు పని చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై కమిషనర్కూడా గతంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జీహెచ్ఎంసీ మళ్లీ సీఆర్ఎంపీ రోడ్ల క్లీనింగ్కోసం అద్దె ప్రాతిపదికన మెషీన్లు తెస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెషీన్లకు బదులు పారిశుద్ధ్య కార్మికులను నియమించుకుంటే ఖర్చు చాలా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఐదేండ్లకు రూ.2వేల కోట్లు..
సిటీలోని ప్రధాన రోడ్లతో పాటు వివిధ ప్రాంతాల్లో 811.9 కిలోమీటర్ల రోడ్లను గత ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పింది. ఇందుకోసం ఏటా రూ.400 కోట్ల చొప్పున ఐదేండ్ల పాటు రూ.2 వేల కోట్ల వరకు ఏజెన్సీలకు చెల్లించాలనేది ఒప్పందం. ఈ లెక్కన ఒక్కో కిలోమీటరుకు ఏడాదికి రూ.50 లక్షల చొప్పున ఖర్చు పెడుతున్నారు. రోడ్ల క్లీనింగ్తోపాటు ఏజేన్సీలే రోడ్లు వేయడం, మెయింటనెన్స్, ఫుట్పాత్నిర్వహణచూస్తున్నాయి. త్వరలో ఐదేండ్ల కాల పరిమితి ముగియనుంది. ఏజెన్సీలు రోడ్ల క్లీనింగ్బాధ్యత నుంచి తప్పుకోనున్నాయి.
ఇప్పటికే 21 అద్దె మెషీన్లు
ఇప్పటివరకు నగరంలోని ప్రధాన రోడ్ల బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించిన బల్దియా... ముఖ్యమైన అంతర్గత రోడ్లను స్వయంగా చూసుకుంటోంది. ఈ రోడ్లను ఊడ్వడానికి 38 స్వీపింగ్ మెషీన్లను అందుబాటులో ఉంచుకుంది. ఇందులో 17 సొంతవి, మిగిలినవి అద్దెవి. అద్దె ప్రతిపాదికన తీసుకువచ్చిన వాటిలో ఒక్కో వాహనానికి ఏడాదికి రూ.కోటి13లక్షల33వేల250 చెల్లిస్తోంది. ఇలా ఏటా ఒక్కోదానికి రూ.23కోట్ల79 లక్షల98 వేల 250 ఖర్చు చేస్తోంది. అయితే, రోజూ రాత్రి ఈ మెషీన్లు అన్నిరోడ్లు క్లీన్చేయాల్సి ఉండగా ఎక్కడా కనిపించడం లేదు.
ఏజెన్సీలు పని చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నాయన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గడువు ముగిశాక మళ్లీ అద్దె వాహనాలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ భావించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వాహనాలు కొంటే బాగుంటుందంటున్నారు. ఒక్కో కొత్త స్వీపింగ్మెషీన్కు రూ.60 లక్షలు అవుతుందని, ఇలా టెండర్ల ద్వారా ఏజెన్సీలకు ఇచ్చే రూ.12కోట్లకు 20 వరకు వాహనాలు వస్తాయంటున్నారు. ఆరు నెలల్లో అద్దె వాహనాలకు ఇచ్చే డబ్బులతో 20 వాహనాలు వస్తే కొన్నేండ్ల పాటు నడిపించుకోచ్చంటున్నారు.
కార్మికులను పెట్టుకున్నా లాభమే..
నగరంలో ఇప్పుడు సుమారు 13వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరు తమకు అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లోనే కాకుండా మధ్యాహ్నం కూడా రోడ్లను ఊడుస్తూ కనిపిస్తున్నారు. ఆరు నెలల పాటు అద్దె వాహనాలకు రూ.12 కోట్లు ఖర్చు చేసే బదులు 400 మందిని కొత్తగా తీసుకుని నెలకు రూ.25వేలు జీతం ఇచ్చినా నెలకు రూ.కోటి మాత్రమే ఖర్చవుతుందని, ఆరు నెలలకు రూ.6 కోట్లు మాత్రమే అవుతుందంటున్నారు. లేదా 800 మందిని తీసుకున్నా ఆరు నెలలకు రూ. 12 కోట్లు మాత్రమే అవుతుందంటున్నారు. ఎలా చూసినా బల్దియా అనుకున్న మొత్తానికి మించదని, పైగా వందల మందికి ఉపాధి కల్పించినట్టు అవుతుందంటున్నారు.
గత నెలలో కమిషనర్ ఫైర్
అద్దె స్వీపింగ్మెషీన్ల పనితీరుపై కమిషనర్ ఇలంబరితి గతంలోనే సీరియస్అయ్యారు. రాత్రి వేళల్లో రోడ్లు క్లీన్ చేయకుండానే వెహికల్స్ ఊరకనే తిప్పుతున్నారని గుర్తించారు. జీపీఎస్ అమర్చి ఉండడంతో రీడింగ్ కోసం ఇలా చేస్తున్నారని తెలుసుకున్నారు. జోనల్స్థాయిలో బిల్లులు ఇచ్చే పరిస్థితి ఉండడంతో భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా రోడ్లు క్లీన్ చేయకున్నా బిల్లులు చెల్లించారు. ఎల్బీనగర్పరిధిలో ఎక్కువగా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మళ్లీ సీఆర్ఎంపీ రోడ్ల స్వీపింగ్కు కొత్త యంత్రాలు అద్దె ప్రాతిపదికన తీసుకువస్తుండడంపై అనుమానాలు వ్యక్తవుతున్నాయి.