స్వీపింగ్ మెషీన్లు కోట్లను ఊడ్చేస్తున్నయ్..ఒక్కో దానికి రూ.కోటి13లక్షలు అద్దె కడుతున్న జీహెచ్ఎంసీ

  • మొత్తం 21 అద్దె మెషీన్లకు ఏటా రూ.24 కోట్ల సమర్పణ
  • కేవలం రీడింగ్ కోసమే రోడ్లపై తిప్పుతున్నట్లు ఆరోపణలు 
  • కొత్త స్వీపింగ్​ మెషీన్​ ఖరీదు రూ.60 లక్షలే..
  • అయినప్పటికీ కొనేందుకు ఇష్టపడని బల్దియా అధికారులు

హైదరాబాద్ సిటీ, వెలుగు : సిటీలోని రోడ్లు ఊడ్వడానికి అద్దెకు తీసుకున్న స్వీపింగ్​మెషీన్లకు జీహెచ్ఎంసీ భారీగా రెంట్​చెల్లించాల్సి వస్తున్నది. ఒక్కో మెషీన్​కు ఏడాదికి రూ.కోటికి పైగానే చెల్లిస్తున్నా రోడ్ల క్లీనింగ్​అనుకున్నంత స్థాయిలో ఉండడం లేదు. బల్దియాలో మొత్తం 38 స్వీపింగ్ మెషీన్లు ఉండగా, ఇందులో 17 మాత్రమే జీహెచ్ఎంసీవి. మిగతా 21 మెషీన్లు అద్దె ప్రతిపాదికన కొనసాగుతున్నాయి. యేటా ఏజెన్సీలకు ఒక్కో వాహనానికి రూ.1,13,33,250 అద్దె చెల్లిస్తోంది. 

అన్నింటికి కలిపి రూ.23,79,98,250 ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ రోడ్లపైన ఊడుస్తూ కనిపిస్తున్నవి చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. అద్దెకు నడుస్తున్న వాహనాలను పక్కన పెట్టి కొత్తవి కొంటే ఒక్కోటి రూ.60లక్షలకే వచ్చే అవకాశం ఉంది. బల్దియా ఉన్నతాధికారులు మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు.   

వీఐపీ ఏరియాల్లోనే.. 

గ్రేటర్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో.. అది కూడా వీఐపీలు ఉండే ప్రాంతాల్లోనే బల్దియా స్వీపింగ్​మెషీన్లు పని చేస్తున్నాయి. కమర్షియల్ కారిడార్లు, మెయిన్​రోడ్లపై స్వీపింగ్​మెషీన్లు చూద్దామన్నా కనిపించడంలేదు. అక్కడక్కడా కనిపిస్తున్నా రోడ్లు క్లీన్ చేయకుండా రీడింగ్​కోసం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ వాహనాలకు జీపీఎస్ అమర్చి ఉండడంతో పని చేస్తున్నామని చెప్పుకోవడానికి రోడ్లపై తిప్పుతూ ఆయా ఏజెన్సీలు బిల్లులు తీసుకుంటున్నట్టు చాలాసార్లు అధికారులు గుర్తించారు. 

పనితీరు చూడకుండానే బిల్లులు

బల్దియా సొంత వాహనాలతోపాటు ఏజెన్సీలకు అప్పగించిన స్వీపింగ్ మెషీన్ల పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదు. అద్దె వాహనాలకు జోనల్ స్థాయిలోనే బిల్లులు అవుతుండడంతో వాటి ఓనర్లు ఆడింది ఆట పాడింది పాటగా తయారైంది. గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు రోడ్లు క్లీన్ చేయకపోయినా ఏజెన్సీలకు బిల్లులు అందజేసినట్టు సమాచారం. ఎల్బీనగర్​జోన్​లో అత్యధికంగా బిల్లులు జారీ చేసినట్టు తెలిసింది. ఇందులో  కొంతమంది ఇంజినీరింగ్, మెడికల్ ఆఫీసర్ల హస్తం ఉన్నట్టు సమాచారం. 

కమిషనర్​ దృష్టికి అంశం 

స్వీపింగ్​మెషీన్ల వ్యవహారం కమిషనర్​ ఇలంబరితి దృష్టికి రాగా ఆయన వీటి బాధ్యతలను ఇంజినీర్ స్థాయి అధికారులకు అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం జార్ఖండ్​ ఎన్నికల డ్యూటీలో ఉన్న ఆయన వచ్చిన వెంటనే ఒక్కో మెషీన్​ బాధ్యతను ఒక్కో ఇంజినీర్​కు అప్పగిస్తారని బల్దియాలో చెప్పుకుంటున్నారు. అలాగే ఇప్పటివరకు పని చేయకున్నా బిల్లులు చెల్లించిన అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.