జనరల్​ స్టడీస్​​: ఎన్నికల సంఘం అధికారాలు ఏంటి.?

రాజ్యాంగంలోని  15వ భాగంలో 324 నుంచి 329 వరకు గల అధికరణలు కేంద్ర ఎన్నికల సంఘం గురించి వివరిస్తాయి. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్దమైన సంస్థ. దీనికి ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయి. దేశంలో రాజకీయ పార్టీలకు రిజిస్ట్రేషన్ కల్పించడంతోపాటు ఎన్నికల గుర్తులను కేటాయిస్తున్నది. సాధారణ ఎన్నికల తర్వాత పార్టీలకు జాతీయ లేదా ప్రాంతీయ హోదా కల్పించడం లేదా తొలగించడం చేస్తున్నది.  

రాజకీయ పార్టీల నమోదు: ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం సెక్షన్ 29ఏ కింద రాజకీయ పార్టీల ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించుకోవాలి. లోక్​సభ, రాష్ట్ర సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీలు తమ పూర్వ హోదాను కలిగి ఉండటం లేదా కోల్పోతాయి.

రిజిస్టర్డ్ పార్టీల గుర్తింపు: కొత్తగా ఏర్పడిన పార్టీ అసెంబ్లీ లేదా లోక్​సభ సాధారణ ఎన్నికల్లో సంబంధిత రాష్ట్రాల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేయాలి.

  •     ఏదైనా రాష్ట్రంలో 20 కంటే తక్కువ పార్లమెంట్ స్థానాలు ఉంటే కనీసం రెండింటిలో పోటీ చేయాలి.
  •     50 కంటే తక్కువ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాల్లో కనీసం ఐదు స్థానాల్లో పోటీ చేయాలి. 
  •     ఫ్రీ సింబల్స్ లో తాము కోరుకుంటున్న 10‌‌ గుర్తులను తెలిపితే వాటిలో ఒక గుర్తు లభిస్తుంది. ఒకవేళ ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఒకే గుర్తును కోరుకుంటే లాటరీ ద్వారా రిటర్నింగ్ అధికారి గుర్తును కేటాయిస్తారు.
  •     ఈ విధంగా కేటాయించిన గుర్తు ఆ ఒక్క ఎన్నికలకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత జరిగే ఎన్నికలకు ఈ గుర్తు వర్తించదు. 
  •     అప్పటికే గుర్తింపు పొంది ఉండి కామన్ సింబల్​ను కోల్పోయిన పార్టీలకు పాత గుర్తుతో ఒకసారి పోటీచేసే అవకాశం కల్పిస్తారు. 
  • రాజకీయ పార్టీల వర్గీకరణ
  • దేశంలో అధ్యయన సౌలభ్యం కోసం రాజకీయ పార్టీలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. జాతీయ పార్టీలు, ప్రాంతీయ/ రాష్ట్రీయ పార్టీలు, నమోదై గుర్తింపు పొందని పార్టీలు.

జాతీయ పార్టీగా గుర్తించాలంటే 

  • రాజకీయ పార్టీల నమోదు: ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం సెక్షన్ 29ఏ కింద రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించుకోవాలి. లోక్​సభ, రాష్ట్ర సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీలు తమ పూర్వ హోదాను కలిగి ఉండటం లేదా కోల్పోవడం జరుగుతుంది. 
  •     చివరి సాధారణ ఎన్నికల్లో లోక్​సభ స్థానాలకు గానీ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు గానీ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో సభ్యులు నిలబడి, పోలై చెల్లిన ఓట్లలో 6 శాతం కంటే తక్కువ కాకుండా ఓట్లను సాధించి, కనీసం నలుగురు అభ్యర్థులు లోక్​సభకు ఎన్నికై ఉండాలి. లేదా
  •     చివరి సాధారణ ఎన్నికల్లో లోక్​ సభలోని మొత్తం సీట్లలో కనీసం 2 శాతం సీట్లను 543 సీట్లలో 11 సీట్లు గెలుచుకుని ఉండాలి. వీరు కనీసం మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. లేదా 
  •     కనీసం నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. 

న్యూ రూల్స్​

ఒక సార్వత్రిక ఎన్నిక కాకుండా వరుసగా రెండు ఎన్నికల్లో కూడా హోదాకు నిర్దేశించిన ఓట్లు, సీట్లు సాధించకపోతే జాతీయ హోదా రద్దు చేస్తారు. ఈ నిబంధనలు 2014, జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో 2014 లోక్​సభ ఎన్నికలకు ముందు జాతీయ హోదా ఉన్న ఎన్సీపీ, బీఎస్పీ, సీపీఐలకు హోదాను తొలగించారు. 

జాతీయ పార్టీ హోదా వల్ల లాభాలు 

  •     లోక్ సభ ఎన్నికల్లో దూరదర్శన్, రేడియో తదితర ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో ప్రచార అవకాశం.
  •     40 మంది ప్రధాన ప్రచారకర్తల ప్రచార ఖర్చును అభ్యర్థి ప్రచార ఖర్చులో కలపరు. 
  •     జాతీయ పార్టీ ఎన్నికల గుర్తును ఇంకెవరికీ కేటాయించరు. దాంతో ఓటర్ల జాబితా కాపీలు రెండు ఉచితం.
  •     నామినేషన్ల సమయంలో అభ్యర్థికి ఇద్దరు ప్రతిపాదకులు అవసరం లేదు. ఒక్కరు చాలు.
  • రాష్ట్రస్థాయి పార్టీగా గుర్తించాలంటే  
  •     రాష్ట్ర శాసనసభకు జరిగిన చివరి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు రాష్ట్రంలో పోలై చెల్లిన మొత్తం ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లు రావాలి. దాంతోపాటు కనీసం ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవాలి. లేదా 
  •     చివరి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ మొత్తం సీట్లలో కనీసం 3 శాతం సీట్లను గెలుపొంది ఉండాలి లేదా కనీసం 3 సీట్లను గెలుపొంది ఉండాలి. వీటిలో ఏది ఎక్కువైతే అది పరిగణనలోకి తీసుకుంటారు. లేదా
  •     లోక్​సభకు జరిగిన చివరి సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు రాష్ట్రంలో పోలై చెల్లిన మొత్తం ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లు రావాలి. దాంతోపాటు కనీసం ఒక అభ్యర్థి లోక్​సభ సభ్యునిగా ఎన్నిక కావాలి. లేదా
  •     చివరి లోక్​ సభ ఎన్నికల్లో సాధారణ రాష్ట్రానికి కేటాయించిన మొత్తం లోక్​ సభ సీట్లో ప్రతి 25 సీట్లకు కనీసం ఒక అభ్యర్థి చొప్పున లోక్​ సభకు ఎన్నికై ఉండాలి. లేదా
  •     లోక్​ సభకు గాని లేదా రాష్ట్ర శాసనసభకు గాని జరిగిన చివరి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నిలబడిన అభ్యర్థులకు రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో కనీసం 8 శాతం ఓట్లు వచ్చి ఉండాలి.   

నమోదిత గుర్తింపు పొందని పార్టీలు

జాతీయ పార్టీలుగా కాని ప్రాంతీయ పార్టీలుగా గాని గుర్తింపు పొందకుండా కేవలం ఎన్నికల కమిషన్ వద్ద నమోదైన పార్టీలు. ఉదా: జోరాం పీపుల్స్ మూమెంట్ (మిజోరాం), లోక్ సత్తా పార్టీ, జనసేన పార్టీ

 2019 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం వద్ద నమోదైన మొత్తం రిజిస్టర్డ్ పార్టీలు 2698. వాటిలో ఏడు జాతీయ పార్టీలు, 52 రాష్ట్రీయ పార్టీలు, 2638 గుర్తింపు పొందని పార్టీలు ఉన్నాయి. 2022, ఫిబ్రవరి నాటికి ఇండియాలో మొత్తం 8 జాతీయ పార్టీలు, 66 ప్రాంతీయ లేదా రాష్ట్రీయ పార్టీలు, 2796 గుర్తింపు పొందని పార్టీలు ఉన్నాయి. తాజాగా సీపీఐ, బీఎస్పీ, ఎన్సీపీలకు జాతీయ హోదా తొలగించగా, ప్రాంతీయ పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పించారు.