పెరిగే చెత్త - అభివృద్ధికి కొలబద్దా?

ఇళ్లల్లోగానీ, ఆఫీసుల్లోగానీ ఏ చెత్తబుట్టలో చూసినా కనిపించేవి ప్లాస్టిక్ కవర్లు, గుట్కా కవర్లు, వక్కపొడి కవర్లు.. అంతా ప్లాస్టిక్ వేస్టుమయంగా ఉంటుంది. భూమిలో శిథిలమై కలిసిపోయే అలవాటు కూడా లేని ప్లాస్టిక్ వలన పర్యావరణానికి ఎంత హాని జరుగుతోందో ఎలుగెత్తి చాటడానికి బోలెడన్ని స్వచ్ఛంద సంస్థలు, మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. అయినా కూడా ప్రజల్లో మాత్రం సరైన అవగాహన రావడంలేదు. అభివృద్ధి దిశలో పయనిస్తున్నామన్న సంగతిని పదేపదే చెబుతున్న దేశాధినేతలు పర్యావరణ సమస్యల పట్ల పెద్దగా పట్టించుకున్నట్లు కనబడడం లేదు. ముఖ్యంగా పారిశ్రామిక ఉత్పత్తులు పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయి.  మారిన కాలం దృష్ట్యా అభివృద్ధి, ఉత్పత్తి  రెండూ సమాన స్థాయిలో పయనించడం కోసం మనం చేస్తున్న ప్రయత్నాలు పర్యావరణాన్ని తీవ్రంగా నష్టపరుస్తోంది. పునర్వినియోగం చేయగలిగిన వస్తువులను బాధ్యతారహితంగా చెత్తలో వేయడంవల్ల అవి చివరికి చెత్తదిబ్బలకు చేరిపోతున్నాయి. అలా దిబ్బలకు చేరిన చెత్త ఇక ఎప్పటికీ అలానే ఉండిపోతోంది. 

చెత్తను పెంచుతున్న జీవన శైలి

 ఉదయం లేచింది మొదలు రాత్రి విశ్రమించేవరకూ చేసే ప్రతిపనిలో కొంత చెత్తను తయారుచేస్తున్నాం. అమెరికాలో రోజుకు ఒక్కో వ్యక్తి నాలుగు పౌండ్ల చెత్తను తయారుచేస్తున్నాడట. అంటే అమెరికా రోజుకు ఆరు లక్షల టన్నుల చెత్తను తయారు చేస్తోంది.  బహుశా అధిక చెత్త అభివృద్ధికి  కొలబద్దగా చెప్పుకోవచ్చేమో.  పళ్లు తోముకునేందుకు, తుడుచుకునేందుకు చెత్త తయారుచేయడంతో మొదలుపెట్టి, కాగితం కప్పులో కాఫీ, పేపరులో చుట్టిన ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లు లేదా అల్యూమినియం క్యాన్‌లో కోక్... ఇలా చెప్పుకుంటూ పోతే ఉపయోగించేది పాతిక, చెత్తగా మార్చేది ముప్పాతిక అనిపిస్తుంది. ఇదంతా అభివృద్ధితో అనివార్యమవుతున్న వ్యర్థాలు.

40 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్​ వాడకం

ఏటా 40 కోట్ల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్​‌వ్యర్థాలు భూమిపై వచ్చి చేరుతున్నాయి. ఇలా చేరుతున్న ప్లాస్టిక్‌లో 9 శాతాన్ని మాత్రమే రీసైక్లింగ్‌చేసి ఉపయోగిస్తున్నాం. మరో 12 శాతం సురక్షితమైన పద్ధతిలో పూడ్చిపెడుతున్నాం. మిగిలిన 79 శాతం మన చుట్టూ వివిధ రూపాల్లో పేరుకుపోతుంది.  మట్టిలో కలిసిపోవడానికి వేల ఏండ్లు పడుతుంది. పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతోంది. అయినా కూడా ప్లాస్టిక్‌ ఉపయోగించకుండా ఉండలేకపోతున్నాం. కారణం అందుబాటులో ప్రత్యామ్నాయ వస్తువులు లేకపోవడమే.   

బాధ్యతారాహిత్యం

ఇళ్ళల్లో, వ్యాపార సంస్థల్లో ఉత్పత్తి అయిన చెత్తను చెత్త కుండీల్లోనే వేయాల్సిన పౌరులు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. దీంతో పలు చోట్ల చెత్తను రోడ్లమీదే పారబోస్తున్నారు. చెత్తకుండీలు లేక ఖాళీ స్థలం కనిపిస్తే చాలు చెత్తను వేస్తున్నారు. పట్టణాల్లో మురుగు నీటిపారుదల సౌకర్యాలు, మలమూత్ర విసర్జనకు సదుపాయాలు లేనందున వర్షాకాలంలో చెత్తాచెదారాలు, మురుగుతో మంచినీరు కలుషితం అవుతోంది. రోగకారక క్రిములు పెరుగుతున్నాయి.  ఈగలు, దోమలు వ్యాప్తి చెందడం వల్ల అనేక అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. 

చెత్త నివారణ మన వాడకంలోనే ఉంటది

చెత్తను తయారుచేయడం తగ్గించడానికి ఎవరికి వీలయినంతలో వారు పాటుపడాలి.  ఇళ్ళల్లో పేపర్ కప్పులూ, పేపరు కంచాలూ వాడటం మానివేయాలి. చిన్న చిన్న వాటర్ బాటిళ్ళూ, కోక్ డబ్బాల స్థానంలో పెద్ద పెద్ద బాటిళ్లూ లేదంటే పూర్తిగా మానివేయడమో చేయాలి. చేతులు తుడుచుకోవడానికి మన పద్ధతిలోలా నీళ్ళు ఉపయోగించి పొడి టవల్‌తో తుడుచుకోవాలి. మన భావితరాలకు అందమైన భూగోళాన్ని ఇవ్వకపోయినా ఫర్వాలేదు. చెత్త నింపిన, దుర్గంధ, ప్రమాదకారి అయిన భూగోళాన్ని  చేయకపోతే చాలు. 
పర్యావరణ పరిరక్షణలో నేతలు ప్రకటనలు, ఉపన్యాసాలకే పరిమితమవుతున్నారన్నది వాస్తవం.   పర్యావరణ అసమతుల్యత వలన జరుగుతున్న పెనుమార్పులకు తీవ్రంగా ప్రభావితం అవుతామని తెలిసినా ప్రజలు   నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడమే బాధాకరమైన విషయం. ప్లాస్టిక్‌  నిరోధానికి చట్టాలున్నా ప్రజల ఆచరణ అంతంతమాత్రమే. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా వాటిని ప్రజలు పాటించినప్పుడే అవి సార్థకమవుతాయి.

ప్రకృతి ఆరాధన కరువైంది

ప్రాచీన సంస్కృతులన్నీ ప్రకృతిని ఆరాధిస్తూనే పెరిగాయి. చెట్లు, నదులు, పర్వతాలు, ప్రకృతి వీటన్నింటిని ఎల్లప్పుడూ పూజించారు. మన దేశంలో ఒక చెట్టును నరికేముందు ఐదు మొక్కలు నాటడం ఆచారంగా ఉండేది. అన్ని ముఖ్యమైన పండుగలు, సంప్రదాయాలలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. నదులను తల్లులుగా, భూమిని దేవతగా కొలిచిన దేశం మనది.  ప్రకృతిని  పవిత్రంగా భావించి, ఆరాధించి, గౌరవించే ఈ సంప్రదాయాన్ని ఈనాటి నవీన సమాజంలో మరలా ప్రారంభించాల్సి ఉంది.  వినూత్న విధానాలలో నీటిని పొదుపు చేయడం, రసాయనాల వాడకం తగ్గించి వ్యవసాయం చేయడం మొదలైనవి చేయాలి. 

అడవులు తగ్గడానికి..

మన దేశ భూభాగంలో పర్యావరణ చట్టాల ప్రకారం 33 శాతం అడవులుండాలి. కానీ, ప్రస్తుతం 23 శాతానికి తక్కువగా ఉన్నాయి. క్రమంగా వాటి విస్తీ ర్ణం తగ్గుతూనే ఉన్నది. అభివృద్ధి, పరిశ్రమల పేర అడవులు తగ్గుతున్నాయి.  వానపాములు చచ్చిపోతే నేల గట్టిపడి, వాననీరు భూమిలోకి ఇంకలేక వృధాగా పోతుంది. ఈ రెండింటి వలన భూమి సేద్యానికి పనికిరాని పరిస్థితి వస్తుంది. ఇది తీవ్రమైన ఆహార కొరత సమస్య సృష్టిస్తుంది. అంటే మానవాళి మనుగడయే ప్రశ్నార్థకంగా మారుతుంది.  ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాలంటే గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను తగ్గించాలి. ఇది ప్రభుత్వాలు చిత్తుశుద్ధితో వ్యవహరించి సాధించాల్సిన పని. ఈ విషయంలో ప్రజలు పాలకులపై ఒత్తిడి తెచ్చి ప్రకృతిని కాపాడుకోవాలి.  

తగ్గుతున్న ఆయువు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1600 నగరాల్లో అధ్యయనం చేసి వెలువరించిన నివేదిక పర్యావరణవేత్తలను దిగ్భ్రాంతిపరిచాయి. అందులో మన దేశ రాజధాని నగరం అత్యంత కాలుష్యవంతమైన నగరంగా ప్రథమ స్థానంలో నిలవడం దురదృష్టకరం. వాయు కాలుష్యంవల్ల మనిషి ఆయుఃప్రమాణం 3.2 ఏళ్ళు తగ్గిపోతున్నదనేది నిపుణుల బృందం నివేదిక తెలిపింది. ప్రతి తొమ్మిది మరణాల్లో ఒకటి కాలుష్యంవల్లేనని తేలింది. 2040 నాటికి 90 శాతం మరణాలకు కారణం కాలుష్యమే అవుతుందట. నగరాల్లో 90 శాతం మంది కలుషితగాలినే పీలుస్తున్నారట. కలుషిత వాయువుల్లో నైట్రేట్, సల్ఫేట్, కార్బన్, సోడియం క్లోరైడ్, కాడ్మియం, పాదరసం అణువులు శరీరంలోని మూల మూలలకుపోయి మనల్ని నాశనం చేస్తాయి. ఆస్తమా, క్షయ వంటి వ్యాధులతోపాటు కాన్సర్ మహమ్మారిన పడవేస్తున్నాయి. ప్రాణాన్ని హరించడంలో వాయు కాలుష్యం అయిదో స్థానాన్ని,  గుండెపోటు నాల్గవ స్థానాన్ని పొందింది. ప్రపంచవ్యాప్తంగా 20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయి. అందుకే  వ్యర్థాలు అభివృద్ధికి కొలమానం కాకూడదు. 

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి,
ఫ్రీలాన్స్ రైటర్