కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన.. వివాదంలో సౌరభ్‌ గంగూలీ

కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచారం- హత్య ఘటనను ఖండిస్తూ భారత మాజీ క్రికెటర్ సౌరభ్‌ గంగూలీ చేసిన వ్యాఖ్యలు  విమర్శలకు దారితీశాయి. దాంతో, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు మరోసారి వివరణ ఇచ్చారు. తన మాటలు వక్రీకరించారన్న భారత మాజీ సారథి.. నేరస్థుడికి కఠిన శిక్ష పడాలని కోరారు. అసలు గంగూలీ ఏమన్నారు..? ఎందుకు విమర్శలకు దారి తీశాయి..? అనేది తెలుసుకుందాం..

ఇది ఒక సంఘటన మాత్రమే

ఆగస్టు 9న ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్య జరిగింది. ఈ ఘటనపై గతవారం గంగూలీ స్పందిస్తూ.. "ఇది చాలా దురదృష్టకర ఘటన. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళల భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం అవసరం. అయితే ఈ ఒక్క ఘటనతో రాష్ట్రంలో భద్రతా సమస్యలను అంచనా వేయడం సరికాదని భావిస్తున్నా.. ఇది ఒక సంఘటన మాత్రమే. ఇటువంటి ప్రమాదాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరుగుతాయి.." అని వ్యాఖ్యానించారు.

గంగూలీ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక క్రికెటర్ అయ్యుండి ఇలా మాట్లాడటం ఏంటని గంగూలీపై ఆమె మండిపడ్డారు. మహిళను అత్యంత పాశవిషంగా హత్యాచారం చేసి చంపితే.. బాధ్యత గల మనిషి కేవలం ఒక సంఘటనగా పేర్కొనడం బాధాకర విషయమని ఆమె చెప్పుకొచ్చారు.

"మిమ్మల్ని పీఠంపై కూర్చోబెట్టి, ఓ క్రికెటర్‌గా మిమ్మల్ని మహారాజాగా పిలుచుకున్నందుకు మాకు బుద్ది వచ్చేలా మాట్లాడారు. ఉన్మాది అత్యంత పాశవికంగా ఓ మహిళను చెడిస్తే, సాధారణ సంఘటనగా చెప్పడానకి మీకు నోరు ఎలా వచ్చింది?.." అని శ్రీలేఖ మండిపడింది.

తప్పుగా అర్థం చేసుకున్నారు..

తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో గంగూలీ మరోసారి స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటే, మరికొందరు వక్రీకరించారని గంగూలీ అన్నారు. ఏదేమైనా జరిగిన ఘటన భయంకరమన్న మాజీ క్రికెటర్.. నేరస్థులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలా శిక్షించిన్నప్పుడే, భవిష్యత్తులో ఇంకెవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడే సాహసం చేయరని గంగూలీ అన్నారు.