అమెరికాలో లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అరెస్ట్

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య, గత నెలలో మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్‌ హత్య, రెండు నెలల క్రితం నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు వంటి కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్ వాంటెడ్‌గా ఉన్నాడు.

ఎవరీ అన్మోల్ బిష్ణోయ్..?

జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడే ఈ అన్మోల్ బిష్ణోయ్. ఇతనిపై ఎన్‌ఐఏ భారీ రివార్డు ప్రకటించింది. అన్మోల్‌ను అరెస్టు చేసేలా సమాచారం అందించిన వ్యక్తికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించింది. ఎన్‌ఐఏ నమోదు చేసిన రెండు కేసులుసహా 18 ఇతర క్రిమినల్ కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. అన్మోల్‌పై క్రిమినల్ కేసులు ఉండటంతో.. గతేడాది నకిలీ పాస్‌పోర్ట్ ఉపయోగించి దేశం దాటి పారిపోయాడు. కొన్నాళ్లు కెనడాలో నివసించినట్లు వార్తలు రాగా.. అక్కడి నుండి మెల్లగా అమెరికా చేరుకున్నాడు. అతని కస్టడీని కాలిఫోర్నియా పోలీసులు ధృవీకరించడంతో.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అన్మోల్‌ను అమెరికా నుండి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు.. 

బాబా సిద్ధిక్ హత్య వెనక అన్మోల్ హస్తం

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సిపి సీనియర్ నేత బాబా సిద్ధిక్ హత్య కేసులో అన్మోల్ పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బాబా సిద్ధిక్ ను కాల్చి చంపిన ముగ్గురు అనుమానిత షూటర్లకు అన్మోల్ బిష్ణోయ్‌తో పరిచయం ఉన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.

ALSO READ | ఎంపీ డీకే అరుణ అరెస్ట్.. మొయినాబాద్ దగ్గర ఉద్రిక్తత