నిజామాబాద్ లో మహిళపై గ్యాంగ్​రేప్...ఆటో డ్రైవర్, అతని ముగ్గురు ఫ్రెండ్స్ అరెస్ట్​

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ లో దారుణం జరిగింది. భర్తతో గొడవపడి ఇల్లు వదిలి బయటకు వచ్చిన మహిళపై ఓ ఆటో డ్రైవర్ తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. పోలీసుల ప్రకారం.. నిజామాబాద్ టౌన్ కు చెందిన 32 ఏండ్ల వివాహిత శుక్రవారం భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. రాత్రి 11 గంటలకు బస్టాండ్​లో ఒంటరిగా ఉన్న సదరు మహిళతో స్వామి అనే ఆటో డ్రైవర్ మాట కలిపాడు.

ఇంట్లో దిగబెడతానని నమ్మబలికి ఆమెను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆటోను రూట్​మళ్లించి డిచ్ పల్లి వైపు తీసుకెళ్లి రోడ్డు పక్కన ఆపాడు. అప్పటికే స్వామి స్నేహితులు మోసిన్, సుల్తాన్, జైను అక్కడే ఉన్నారు. నలుగురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం బాధిత మహిళ వన్​టౌన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళను మెడికల్ టెస్టుల కోసం ఆస్పత్రికి తరలించారు.