రెచ్చిపోతున్న దొంగలు

  • వరంగల్ సిటీలో వరుస దొంగతనాలు
  • డోర్లు ధ్వంసం చేసి చోరీలు
  • యూపీ, ఎంపీ గ్యాంగులపై అనుమానాలు
  • భయాందోళనలో పట్టణ ప్రజలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరాన్ని అంతర్రాష్ట్ర దొంగల ముఠా టార్గెట్ చేసింది. వరంగల్ ట్రై సిటీలో అర్ధరాత్రి తాళం వేసి ఉన్న ఇండ్లను కొల్లగొడుతోంది. మూడు రోజుల్లోనే నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ గ్యాంగ్ పదికి పైగా దొంగతనాలకు పాల్పడగా, దుండగులను గుర్తించేందుకు పోలీసులు తలమునకలవుతున్నారు. క్లూస్ టీమ్స్ ను రంగంలోకి దించి, పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

దొంగతనాల తీరును బట్టి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గ్యాంగులపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలో రాత్రి పూట పెట్రోలింగ్ సరిగా లేకనే చోరీలు ఎక్కువవుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వరుస ఘటనలతో కలకలం..

వరంగల్ సిటీలోని మడికొండ సమీపంలోని కపిల్ గుల్​మోర్ అపార్ట్​మెంట్స్ లో ఈ నెల 22న అర్ధరాత్రి చోరీ జరిగింది. అక్కడ కక్కెర్ల అశ్వంత్ అనే యువకుడి బైక్ ఎత్తుకెళ్లగా, మరో రెండు ప్లాట్లలో కూడా చొరబడి అందినకాడికి దోచుకున్నారు. ఆ తరువాత వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ సమీపంలోని టీజీ ఎన్​పీడీసీఎల్​ కు చెందిన ఓ సబ్ ఇంజినీర్ ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. 

ఇంటి యజమానులు వ్యక్తిగత పనుల మీద ఊరికి వెళ్లగా, తాళం పగులగొట్టి దాదాపు రూ.లక్ష విలువైన నగలు, నగదు చోరీ చేశారు. సుబేదారి పీఎస్ పరిధిలో కూడా తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి ఇత్తడి, రాగి వస్తువులు ఎత్తుకెళ్లారు. చోరీలకు పాల్పడుతున్న వారు డే టైమ్ లో వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి, జనాలంతా గాఢ నిద్రలో ఉండే అర్ధరాత్రి 2 గంటల తరువాత చోరీలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.

యూపీ, ఎంపీ​ గ్యాంగ్ ల పనేనా..?

గతేడాది కూడా ఘజియాబాద్ గ్యాంగ్ ఇలాగే అపార్ట్​మెంట్లను టార్గెట్ చేసి వరుసగా 9 చోరీలకు పాల్పడగా, ఏపీలోని కర్నూలు వద్ద అక్కడి ఫోర్త్ టౌన్ సీఐ సహకారంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా నగరంలో అలాగే వరుస దొంగతనాలు జరుగుతుండగా, ఇది కూడా ఆ గ్యాంగ్​ పనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్​ ముఠాలు కూడా నగరంలోకి ఎంటర్ అయ్యాయనే సమాచారం ఉండగా, ఆ దిశగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో కూడా గస్తీని పెంచి చోరీలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

నిరుప్ నగర్ తండాలో దొంగల హల్​చల్..​

గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ నిరుప్ నగర్ తండాలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్య భీమా నాయక్ అలియాస్​ బుల్లెట్ భీమన్న ఫ్యామిలీతో కలిసి రెండు రోజుల కింద  బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండగా, గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి ఇంటి డోర్​ను ధ్వంసం చేసి లోపలికి వెళ్లి, బీరువాలో ఉన్న దాదాపు 10 తులాల బంగారం, సుమారు కిలో వెండి ఆభరణాలు, లక్షన్నర నగదు ఎత్తుకెళ్లారు.

 ఉదయం ఇంటికొచ్చిన భీమా నాయక్​ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇదే తండాకు సమీపంలో ఉండే రాజగోపాల్ రెడ్డి కుటుంబంతో కలిసి ఊరెళ్లగా, వారింట్లో కూడా దొంగలు పడి దాదాపు మూడున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. డీసీపీ సలీమా, ఏసీపీ తిరుమల్, కేయూ సీఐ సంజీవ్​ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్​ టీమ్ ను  రంగంలోకి దించి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.