Ganesh Chaturthi 2024: గణేశుడికి ఈ నైవేద్యాలు ట్రై చేయండి..

 విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడి పండుగే వినాయకచవితి. ఈ రోజు భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి.. విజయాలు చేకూరాలని దేవుడిని కోరుకుంటారంతా! గణపయ్య భోజనప్రియుడు. ఆయన కృపావీక్షణలు మనపై కురవడానికి విలక్షణ నైవేద్యాలను సమర్పించి గణనాథుడిని ప్రసన్నం చేసుకోండి..

పాల ఉండ్రాళ్లు తయారీ కి కావలసినవి 

  • బియ్యపు పిండి : కప్పున్నర 
  •  పాలు : 2 1/2 కప్పులు
  • చక్కెర : 100 గ్రా. 
  • యాలకుల పొడి : చిటికెడు 
  •  నూనె : పావు టీస్పూన్‌
  • నీళ్లు: నాలుగు కప్పులు

తయారీ విధానం : ఒక గిన్నెలో నీళ్లు, నూనె పోసి మరిగించాలి. దీంట్లో బియ్యపు పిండి ఉండలు లేకుండా కలపాలి. కొద్దిగా నూనె చేతులకు రాసుకొని వీటిని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టాక ఇడ్లీ కుక్కర్‌లో కొన్ని నీళ్లు పోసి ఆవిరి మీద ఈ ఉండ్రాళ్లను ఉడికించాలి. ఈలోపు గిన్నెలో పాలు పోసి మరిగించాలి. దీంట్లో  చక్కెర, యాలకుల పొడి వేసి సన్నని మంటమీద పది నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా బియ్యం పిండి వేసి చిక్కగా అయ్యేలా చూడాలి. ఆ తర్వాత ఉండ్రాళ్లను వేసి సన్నని మంటమీద నాలుగు నిమిషాలు ఉంచి దించేయాలి.

ALSO READ | Ganesh Chaturthi 2024 : మీ బంధుమిత్రులకు వినాయకచవితి శుభాకాంక్షలు ఇలా చెప్పండి

రవ్వ లడ్డు తయారీకి కావాల్సినవి

  • బొంబాయి రవ్వ : ఒక కప్పు
  •  చక్కెర : ఒక కప్పు
  •  ఎండు కొబ్బరి పొడి : అర కప్పు
  • పాలు : పావు కప్పు
  • యాలకులు : 4
  •  నెయ్యి : 3 టేబుల్‌ స్పూన్స్‌
  •  జీడిపప్పు : 10 
  • కిస్మిస్‌ : 10

తయారీ విధానం : చక్కెర, యాలకులను మిక్సీ పట్టాలి. మెత్తటి పొడి అయ్యేవరకు గ్రైండ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌లను వేయించాలి. బంగారు వర్ణం వచ్చాక కళాయిలో నుంచి తీసి ఓ ప్లేటులో వేసుకోవాలి. అదే కళాయిలో మిగతా నెయ్యి వేసి సన్నని మంటమీద రవ్వను వేయించుకోవాలి. రవ్వ రంగు మారిన తర్వాత పొడి చేసుకున్న చక్కెర, వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను వేసి కలపాలి. చివరగా పాలు వేసి మరికొద్దిసేపు కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌమీది నుంచి దించి వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని లడ్డూల్లా చేసుకోవాలి. చల్లగా అయితే లడ్డూలు చేయడం కష్టం.

మోదక్‌ తయారీకి కావాల్సినవి 

బియ్యపు పిండి : ఒక కప్పు
నెయ్యి : 3 టీస్పూన్స్‌
 బెల్లం తురుము : ఒక కప్పు
కొబ్బరి తురుము : 2 కప్పులు
 యాలకులు : 3
 ఉప్పు : చిటికెడు

తయారీ విధానం : కళాయిలో నెయ్యి వేసి బెల్లం, కొబ్బరి తురుము వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోయొచ్చు. దీంట్లో యాలకులు వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో ఉప్పు, నెయ్యి వేసి కాసేపు ఉంచి దించేయాలి. ఈ నీళ్లు చల్లారక ముందే.. బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా పూరీ పిండిలా కలుపుకోవాలి. వీటిని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఈ ముద్దని మధ్యలో చిన్న దొప్పలా చేసుకోవాలి. దీంట్లో బెల్లం మిశ్రమాన్ని ఉంచి మళ్లీ బంతిలా చేసుకోవాలి. దీన్ని మనకు నచ్చిన రీతిలో ముడుచుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్నాక.. ఇడ్లీ కుక్కర్‌లో ఒక గుడ్డ వేసి ఈ మోదక్‌లు ఉంచాలి. పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకుంటే స్వామికి ఇష్టమైన మోదకాలు సిద్ధం.

రవ్వ అప్పాలు తయారీకి కావాల్సినవి :

  •  బొంబాయి రవ్వ : ఒక కప్పు
  •  చక్కెర : 3/4 కప్పు
  • యాలకులు : 3 
  • నెయ్యి : 5 టేబుల్‌స్పూన్స్‌
  •  నూనె : తగినంత

తయారీ  విధానం: ఒక గిన్నెలో కప్పు నీళ్లు పోసి మరిగించాలి. ఇది మరుగుతున్నప్పుడు.. నెయ్యి వేసి రెండు నిమిషాల తర్వాత రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి. ఐదు నిమిషాలు సన్నని మంటమీద ఉంచి మూత పెట్టి దించేయాలి. కాస్త చల్లారనిచ్చి చక్కెర, యాలకుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు దీన్ని మళ్లీ స్టౌ మీద పెట్టి సన్నని మంటమీద రెండు నిమిషాలు ఉంచాలి. కలిపినప్పుడు తప్ప.. మిగతా సమయంలో మూత పెట్టే ఉంచాలి. ఐదు నిమిషాలయ్యాక దించేయాలి. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని వీటిని అప్పాల్లా ఒత్తుకోవాలి. ఇలా పిండి మొత్తం చేయాలి. ఆ తర్వాత కడాయిలో నూనె పోసి అప్పాలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

ALSO READ | Vinayaka Chavithi 2024: వినాయక చవితి.. విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం ఎప్పుడంటే..

స్వీట్‌ పొంగల్‌ తయారీకి కావాల్సినవి 

  •  బియ్యం : అర కప్పు
  •  పెసరపప్పు: అర కప్పు
  •  బెల్లం తురుము : అర కప్పు
  •  యాలకుల పొడి : చిటికెడు
  •  పచ్చ కర్పూరం : చిన్నది
  •  నెయ్యి : 3 టేబుల్‌స్పూన్‌
  •  జీడిపప్పు : 12
  •  కిస్మిస్‌ :12
  •  లవంగాలు : 2
  •  ఎండు కొబ్బరి ముక్కలు : 2 టేబుల్‌ స్పూన్స్‌

తయారీ విధానం : కుక్కర్‌లో పెసరపప్పు వేయించుకొని దించేయాలి. ఇందులోనే బియ్యం పోసి రెండూ కలిపి బాగా కడగాలి. ఆ తర్వాత నీళ్లు పోసి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో బెల్లం వేసి నీళ్లు పోసి సన్నని మంటమీద చిక్కగా అయ్యే వరకు ఉంచి దించేయాలి. ఇప్పుడు అన్నం, పెసరపప్పును మరీ మెత్తగా కాకుండా పప్పు గుత్తితో మెదపాలి. దీంట్లో బెల్లం పాకం, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. దీన్ని స్టౌ మీద పెట్టి సన్నని మంటమీద ఉంచాలి. రెండు నిమిషాల తర్వాత నెయ్యి వేసి కలపాలి. ఇది అయ్యేలోపు.. చిన్న కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌, లవంగాలు, కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి. దించేముందు పచ్చ కర్పూరం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పొంగల్‌లో వేసి రెండు నిమిషాలు ఉంచి దించేస్తే సరి.

చింతపండు పులిహోర తయారీకి కావాల్సినవి :

  • బియ్యం : ఒక కప్పు
  • చింతపండు: కొద్దిగా
  •  పసుపు : ఒక టేబుల్‌ స్పూన్‌
  • పల్లీలు : 3 టేబుల్‌ స్పూన్స్‌
  •  ఆవాలు : ఒక టీ స్పూన్‌
  •  శెనగపప్పు : ఒక టేబుల్‌ స్పూన్‌
  •  జీలకర్ర : ఒక టేబుల్‌ స్పూన్‌
  •  ఎండు మిరపకాయలు : 4, నూనె
  • ఉప్పు : తగినంత

తయారీ విధానం : చింతపండును వేడి నీళ్ళు పోసి నానబెట్టాలి. బియ్యాన్ని కడిగి కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత అన్నం మెత్తగా కాకుండా వండి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో చింతపండు రసం, కొన్ని నీళ్ళు పోసి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. ఈలోపు కళాయిలో నూనె పోసి ఆవాలు, శెనగపప్పును వేయించాలి. ఇందులోనే జీలకర్ర, పల్లీలు, ఎండు మిరపకాయలు, పసుపు కూడా వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. దీన్ని బాగా ఉడికిన చింతపండులో వేసి కాసేపు మరగనివ్వాలి. ఉప్పును, ఈ మిశ్రమాన్ని చల్లార్చిన అన్నంలో వేసి బాగా కలపాలి. పులిహోర నైవేద్యం మీ ముందుంటుంది.

ALSO READ | వినాయక రూపం వెనుక రహస్యాలు ఇవే...