కొందరు ఫుడీస్.. టేస్ట్ చూసి ఫుడ్ బాగుందో? లేదో? చెప్పేస్తారు. అలానే వైస్, కాఫీ టీ టేస్టర్స్ వాటి రుచి చెబుతారు. వాళ్లు ‘టేస్ట్ బాగుంది' అంటే చాలు... మార్కెట్లో ఆ బ్రాండికి గిరాకీ పెరుగుతుంది. ముంబైలో ఉంటున్న గణేశ్ అయ్యర్ కూడా అచ్చం అదే పని చేస్తాడు. కాకపోతే ఇతను మినరల్ వాటర్ టేస్ట్ ఎలా ఉందో చెప్తుంటాడు. ఈయనొక 'వాటర్ సొమెలియె'. మనదేశంలో వాటర్ సొమెలియె సర్టిఫికెట్ ఉన్న మొదటి వ్యక్తి ఈయనే.
నేచురల్ మినరల్ వాటర్... ఈ నీళ్లు ప్రకృతిలో సహజసిద్ధంగా ఏర్పడిన ఊటలు, చెలిమెలు, కాల్వల్లో దొరుకుతాయి. ఈ నీళ్లు ఆరోగ్యానికి అన్నివిధాలా మంచివి. అందుకే ఈ నీళ్ల బాటిల్ ధర ఎక్కువైనా కొనుక్కుని తాగుతారు చాలామంది. అయితే, అన్ని మినరల్ వాటర్స్ రుచి ఒకేలా ఉండదు. టేస్ట్ ని బట్టి నేచురల్ మినరల్ వాటర్స్ లోని రకాల్ని గుర్తిస్తాడు గణేశ్. ఆ నీళ్లలోని మినరల్ కంటెంట్, టేస్ట్, ఎక్కడ దొరుకుతాయి? అనేదాన్ని బట్టి వాటి రుచి చెప్పేస్తాడు.
నెలకి రెండు లక్షల నుంచి నాలుగున్నర లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. ఇతర దేశాల్లో ఇప్పటి వరకూ ఏడు రకాల నీళ్లని రుచి చూశాడు గణేశ్. వాటిలో 120 నేచురల్ మినరల్స్, స్పార్క్ లింగ్ మినరల్ వాటర్ బ్రాండ్లు ఉన్నాయి.
వాటర్ సొమెలియె ఎలా అయ్యాడంటే..
బెవరేజ్ ఇండస్ట్రీలో వైన్ సొమెలియెగా చాలా ఏండ్లు పనిచేశాడు గణేశ్. ఆయన టేస్ట్ చేసి, 'ఓకే' చెప్పిన బెవరేజ్ బ్రాండ్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. అప్పటికే వైన్ సొమెలియేలు చాలామంది ఉన్నారు. అయితే, 2000 సంవత్సరం మొదట్లో మినరల్ వాటర్ బ్రాండ్స్ పుట్టుకొచ్చాయి. దాంతో ఆయా కంపెనీలకి మినరల్ వాటర్ రుచి చూసి, ఎలా ఉందో? చెప్పగలిగే క్వాలిఫైడ్ వాటర్ సొమెలియ కావాల్సి వచ్చింది. దాంతో, సర్టిఫైడ్ వాటర్ సోమెలియె అవ్వాలి అనుకున్నాడు గణేశ్. వాటర్ సొమెలియె కోర్స్ చేశాడు. అప్పట్లో మనదేశంలో రెండు రకాల మినరల్ వాటర్ బ్రాండ్స్ ఉండేవి. ఇప్పుడు దాదాపు తొమ్మిది మినరల్ వాటర్ బ్రాండ్స్ ఉన్నాయి.
ఇంతకీ వీళ్లు ఏం చేస్తారంటే...
నేచురల్ మినరల్ వాటర్లో ఏమేం మినరల్స్ ఉన్నాయి? ఆ నీళ్ల కఠినత్వం?, ఆ నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? వాటిలో కార్బన్-డై-ఆక్సైడ్ ఎంత ఉంది? ఇంకా ఏమేం ఉన్నాయి? వంటి విషయాల ఆధారంగా మినరల్ వాటర్స్ లోని రకాల్ని గుర్తిస్తారు వాటర్ సొమెలియేలు. అంతేకాదు ఆ నీళ్లని ఏయే వంటకాల్లో వాడాలి? ఏ వైన్లో కలపాలి? అనేది చెప్తారు కూడా.
వాటర్ సొమెలియె కోర్స్ అందిస్తున్న సంస్థలు ప్రపంచవ్యాప్తంగా రెండో మూడో స్పెషల్ ఉన్నాయంటే, అవి కూడా ఆన్లైన్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. వాటర్ సోమెలియె సర్టిఫికెట్ ఇచ్చే సంస్థల్లో జర్మనీలోని మ్యునిక్ లో ఉన్న 'డొమెన్స్ అకాడమీ' చాలా పాతది. మనదేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, నేచురల్ మినరల్ వాటర్ అమ్ముతారు. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బిఎస్ఐ), స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ ఎఐ) అప్రూవల్ ఉంది వీటికి.