Ganesh Chaturthi 2024: ఇంట్లో గణపతి పూజ ఎలా చేయాలి.. కావాల్సిన సామాగ్రి ఏంటి?

ఈ ఏడాది ( 2024) సెస్టెంబర్​ 7 వ తేదీన అంటే శనివారం రోజున గణపతి పండుగ వచ్చింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండలి సభ్యులందరూ కలిసి విభిన్నమైన వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. అయితే వినాయక విగ్రహాలను ప్రతిష్టించే కొన్ని పద్ధతులు కచ్చితంగా పాటించాలి.. ముఖ్యంగా వినాయక విగ్రహాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలి.

వినాయకుడిని పూజించడం వల్ల ఎలాంటి విఘ్నాలైనా తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఎవరు ఏ కార్యం చేయాలన్నా, ఏదైనా కొత్త వాటిని ప్రారంభించాలన్నా ముందుగా గణేశుని పూజతో ప్రారంభిస్తారు. శాస్త్రాల ప్రకారం, విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు తొలగించే స్వామి మాత్రమే కాదు.. తన రూపం, స్వభావం వెనుక లోతైన అర్థం ఉంది.  ఈ ఏడాది సెస్టెంబర్​ 7 వ తేదీన అంటే శనివారం  రోజున గణపతి పండుగ వచ్చింది

దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండలి సభ్యులందరూ కలిసి విభిన్నమైన వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. అయితే వినాయక విగ్రహాలను ప్రతిష్టించే కొన్ని పద్ధతులు కచ్చితంగా పాటించాలి.. ముఖ్యంగా వినాయక విగ్రహాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. అదేవిధంగా ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించే వారు ఇంట్లో పూజను ఎలా చేయాలి. గణపతిని ఎలా ఆరాధించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సాధారణంగా ప్రతి ఒక్క హిందువు ఎలాంటి కార్యం తలపెట్టినా ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ఉండేందుకు ఆదిదేవుడుగా భావించే వినాయకుడికి పూజ చేస్తారు. అన్ని దేవుళ్ల కంటే వినాయకుడికి పూజ చేస్తారు. భాద్రపద చవితి నాడు గణపతి పుట్టినందుకు ఆ రోజే వినాయక చవితిగా ప్రసిద్ధి.  ఈ రోజు నుంచి నవరాత్రులు స్వామి వారిని పూజించి భక్తులు ఆశీస్సులు పొందుతుంటారు. పూజ ఎలా చేయాలంటే.. ముందుగా సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి.
 
ఈ పూజ కోసం ఉపయోగించే సామాగ్రి ఏంటో ఓసారి పరిసీలిస్తే, గణపతి మట్టి ప్రతిమ, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, బియ్యం, రెండు దీపపు కుందులు, వత్తులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, కొబ్బరికాయలు, కలశం, ఆచమన పాత్రలు, మూడు ఉద్ధరిణలు, ఆచమనానికి ఒక పళ్లెం, 21 రకాల పత్రి, నైవేద్యానికి పండ్లు, వివిధ రకాల పూలు, తమలపాకులు, యజ్ఞోపవీతం ..

ముందుగా పసుపుముద్దతో వినాయకుడిని చేయాలి. ఒక పీటమీద కొద్దిగా బియ్యం పరిచి, పూర్ణకుంభంలో కొత్త బియ్యం వేసి, వినాయకుడి విగ్రహం పెట్టి అలంకరించాలి. మామిడాకులు, వివిధ రకాల ఆకులు, లేత గడ్డి ఆకులు, పూలు, పండ్లతో పాలవెల్లి అలంకరించాలి. గొడుగు పెట్టాలి. నేతితో చేసిన 12 రకాల వంటకాలు. వీలు కాకపోతే శక్తి మేరకు రకరకాల పిండి వంటలు చేయవచ్చు. ఉండ్రాళ్లు, పాయసం గణపతికి ఇష్టమైన నైవేద్యం. ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార వంటి వాటిని వినియోగిస్తారు. 

 
​విగ్రహాన్ని ప్రతిష్టించేవారు..

వినాయక చవితి రోజున ఇంట్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాన్ని ప్రతిష్టించేవారంతా గణేశుని విగ్రహం తెచ్చే ముందు అది పరిపూర్ణంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు పొరపాటున మట్టి గణపతి విగ్రహాలు ముక్క పోవడం, విరిగిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా జాగ్రత్త పడాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం, వినాయకుని విగ్రహంలో మూషికం(ఎలుక), ఒక దంతం, అంకుశం, మోదక ప్రసాదం కచ్చితంగా ఉండాలి.

​తొండం ఎడమవైపే ఉండేలా..

వినాయక చవితి పండుగ రోజున విగ్రహాన్ని ప్రతిష్టించే వారు గణపతి తొండం ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. మత విశ్వాసాల ప్రకారం విగ్రహం ఎడమ వైపున చంద్రుడు ఉంటాడు. కుడి వైపున తొండం ఉండే విగ్రహంలో సూర్యుడు ఉంటాడు. ఇంట్లో విగ్రహాన్ని ప్రతిష్టించే వారు కుంకుమ, తెలుపు రంగులో ఉండే విగ్రహాలను తీసుకోవాలి. అది కూడా కూర్చున్న విగ్రహాన్ని మాత్రమే తీసుకోవాలి. ఏదైనా ఆసనంలో కూర్చున్నా లేదా సింహాసనంపై కూర్చున్నా కూడా పర్వాలేదు. మట్టి గణపతినే పూజించాలి. కెమికల్స్ కలర్స్ తో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్టించరాదు.

​పూజకు ముందు..

వినాయక పూజను ప్రారంభించడానికి ముందు జిల్లేడు ఆకులు, రేగు పండ్లు, రావి, దానిమ్మ, బిల్వ పత్రాలు, గరిక, మారేడు, జమ్మి, ఉమ్మెత్త, పత్రి, మామిడి, గన్నేరు, అరటి ఆకులు, వెలక్కాయ, మొక్కజొన్న కంకులు, అరటిపండ్లు, జాజి, గండలీ, బంతిపూలు, పారిజాతంతో పాటు మీ ప్రాంతంలో దొరికే రకరకాల పండ్లు, పూలతో నైవేద్యాలను సిద్ధం చేసుకోవాలి.

ఇంటి లోపల చూస్తున్నట్టు..

మత విశ్వాసాల ప్రకారం, వినాయక విగ్రహాన్ని ఈశాన్య ప్రాంతంలోనే ప్రతిష్టించేలా చూసుకోవాలి. విగ్రహం బయట చూసేలా ఉండకూడదు. ఇంటిలోపలే చూస్తూ ఉండేలా ప్రతిష్టించాలి. ఈ పవిత్రమైన రోజున మీకు వీలైనంత మేరకు పేదవారికి దానధర్మాలు చేయాలి. వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారం.  నవరాత్రి ఉత్సవాల్లో బుధవారం రోజున మీరు గోమాతను ఆరాధించడం వల్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు పోటీ పరీక్షల్లో కచ్చితంగా విజయం దక్కుతుందని పండితులు చెబుతారు.

​అందంగా అలంకరించాలి..

వినాయక చవితి రోజున ఇంటిని శుభ్రంగా కడిగి, ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులను కట్టాలి. ఒక పీటకు పసుపు పూసి దానిపై కుంకుమ కలిపిన బియ్యం వేయాలి. వెదురు ముక్కలతో అందమైన పందిరిని ఏర్పాటు చేసి దానికి పండ్లు, వెలగకాయ, మొక్కజొన్న, పూలు కట్టి అలంకరించాలి. అనంతరం వినాయకుడిని ప్రతిష్టించాలి. ఆ తర్వాత గణపతి కోసం తయారు చేసిన గారెలు, పాయసం, ఉండ్రాళ్లు, కుడుములను విగ్రహం ముందు ఉంచాలి.

పూజను ఎలా చేయాలి..

ఓం శ్రీ మహాగణాధిపతయే నమ: అని చెప్పి, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే.. శ్లోకం చదివి పూజను ప్రారంభించాలి. ముందుగా ఆచమనం.. ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః (అని మూడుసార్లు చేతిలో నీళ్లు పోసుకొని తాగాలి. తర్వాత గణపతికి నమస్కరించి దైవ ప్రార్థన చేయాలి. ఇందులో భాగంగా.. భూతోచ్చాటన, ప్రాణాయామం, సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత షోడశోపచార పూజ చేయాలి. 
 
అనంతరం పుష్పాలతో పూజిస్తూ అథాంగ పూజ నిర్వహించాలి. 21 రకాల పత్రాలతో ఏకవింశతి పత్ర పూజ చేయాలి. ఆ తర్వాత శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి జపించాలి. అథ దూర్వాయుగ్మ పూజ చేస్తూ నమస్కారం చేయాలి. పూజ పూర్తయ్యాక గణపతి వ్రత కథను వినాలి లేదా చెప్పుకోవాలి. వినాయక చవితి పద్యాలు చదవాలి. అనంతరం మంగళహారతి పట్టుకొని దీపాన్ని గణపతికి చూపిస్తూ మంగళాచరణాలు ఆలపించాలి. చివరగా గణపతి ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్ఠాంగ నమస్కారం చేయాలి

​ఈ పనులు చేయొద్దు..

ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించే వారు పొరపాటున కూడా నాట్యం చేస్తున్న విగ్రహాన్ని ప్రతిష్టించరాదు. అంతేకాదు ఇలాంటి విగ్రహాలను ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడదట. ఒకవేళ ఇలా చేస్తే మీ కుటుంబంలో నిత్యం వాదులాట, ఘర్షణలు పెరిగే అవకాశం ఉంటుందట. మీ ఇంట్లోనే విగ్రహాన్ని నేరుగా నిమజ్జనం చేయకండి. మీ ఇంటి సమీపంలో పెద్ద విగ్రహాల మండపాల వద్దకు వెళ్లి ఇవ్వాలి.