హైదరాబాద్, వెలుగు: వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. సెప్టెంబర్ 7న గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. సెప్టెంబర్ 17న నిమజ్జనం జరుగుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని కోరారు.
మండపాల నిర్వాహకులు హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం ‘గణేశ్ పండుగ-2024’ పై ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. వారం రోజుల్లో ప్రజా ప్రతినిధులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీతో మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్ (ఎమ్‌సీహెచ్‌ఆర్‌డీ) సెంటర్‌లో మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పర్యావరణ రక్షణ కోసం అందరూ మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని కోరారు.
అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి హైదరాబాద్ సహా జిల్లాలకు తరలించే రూట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మెట్రో వాటర్ వర్క్స్, జీహెచ్‌ఎమ్‌సీ, హెచ్‌ఎండీఏ సమాచారం కోసం అప్లికేషన్, మండపాల సమాచారం కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.