గద్వాల మెడికల్​ కాలేజీ ఓపెనింగ్​కు రెడీ

  • ఎన్​ఎంసీ క్లియరెన్స్​ కోసం వెయిటింగ్​
  • సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఆఫీసర్ల ప్లాన్
  • మొదటి ఏడాది 50 సీట్లు మంజూరయ్యే అవకాశం

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్మించిన మెడికల్  కాలేజీ ఈ అకడమిక్  ఇయర్ లోనే ప్రారంభించేందుకు రాష్ట్ర, జిల్లా ఆఫీసర్లు కృషి చేస్తున్నారు. ఎన్ఎంసీ(నేషనల్  మెడికల్  కౌన్సిల్) క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మెడికల్  కాలేజీకి కావాల్సిన అన్ని సౌలతులు ఏర్పాటు చేశారు. ల్యాబ్ కు సంబంధించిన మెటీరియల్, ఎక్విప్​మెంట్లు రెడీగా ఉంచారు. 

మొదటి ఏడాదికి సంబంధించి మూడు సబ్జెక్టులకు మెడికల్  కాలేజీలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెడికల్  కాలేజీని ప్రారంభించే అవకాశం ఉంది. ఎన్ఎంసీ క్లియరెన్స్​ వస్తే ఈ ఏడాది నుంచే గద్వాల మెడికల్  కాలేజీలో మొదటి ఏడాది 50 సీట్లు ఫిలప్  కానున్నాయి. ఇప్పటికే బిల్డింగ్  ఓపెనింగ్  కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. గద్వాల మెడికల్  కాలేజీతో పాటు రాష్ట్రంలోని 8 మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ సర్టిఫికెట్  రావాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు చేసిన దృష్ట్యా ఎన్ఎంసీ టీమ్​ పరిశీలించి అనుమతి ఇస్తుందని ఆఫీసర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రూ.183 కోట్లతో పనులు..

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో దౌదర్ పల్లి దర్గా సమీపంలో రూ.183 కోట్లతో 275 బెడ్స్​ హాస్పిటల్ నిర్మాణం చేపట్టారు. అందులోనే మెడికల్  కాలేజీని ఈ ఇయర్ లో స్టార్ట్  చేయనున్నారు. 60 శాతం ఫండ్స్​  కేంద్ర ప్రభుత్వం సమకూర్చగా, 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ నిర్మాణానికి కేటాయించింది. 

హెచ్ వోడీలు, సిబ్బంది నియామకం..

మెడికల్  కాలేజీ కోసం ఇక్కడి ఆఫీసర్లు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. కౌన్సెలింగ్  స్టార్ట్  అయితే మెడికల్  కాలేజీకి 50 సీట్లను భర్తీ చేసే అవకాశం ఉండడంతో ఐదు డిపార్ట్​మెంట్లకు హెచ్ వోడీలను నియమించారు. గైనకాలజిస్ట్  డిపార్ట్​మెంట్ కు శోభారాణి, వరలక్ష్మి, సర్జికల్  డిపార్ట్​మెంట్ కు కిశోర్ కుమార్, కేసరి, ప్యాథాలజీకి నవీన్ క్రాంతిని నియమించారు. వీటితో పాటు మరో రెండు డిపార్ట్​మెంట్లకు హెచ్ వోడీలను కేటాయించారు. త్వరలోనే ఫ్యాకల్టీని కూడా నియమించనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. అలాగే మెడికల్  కాలేజీకి అవసరమైన సిబ్బందిని ఇటీవలే ఔట్  సోర్సింగ్  ద్వారా ఫిలప్  చేశారు. 11 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 9 మంది ఆఫీస్  సబార్డినేటర్లు, ఒక థియేటర్  అసిస్టెంట్, ముగ్గురు ల్యాబ్  అటెండర్లతో కలిపి 24 పోస్టులను భర్తీ చేశారు.

ఎక్విప్​మెంట్స్​ వచ్చేసినయ్..

మెడికల్  కాలేజీలో ఫస్ట్​ ఇయర్​ మూడు సబ్జెక్టులు ఉండనుండగా, అందుకు కావాల్సిన అన్ని ఎక్విప్​మెంట్లు ప్రస్తుతం కాలేజీలో రెడీగా ఉన్నాయి. వాటిని బిల్డింగ్ లో ఇన్ స్టాల్  చేస్తున్నారు. ఈ అకడమిక్  ఇయర్ లోనే కాలేజీని ప్రారంభించాలనే గట్టి పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ఎంసీ టీమ్​ రాక కోసం ఎదురుచూస్తున్నారు. వారు ఇక్కడి సౌలతులు పరిశీలించి క్లియరెన్స్​ ఇస్తే 50 సీట్లతో కాలేజీ షురూ కానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు, సెప్టెంబర్ లో గద్వాల మెడికల్  కాలేజీలో క్లాసెస్  స్టార్ట్ అయ్యే ఛాన్స్  ఉంది.

ఎన్ఎంసీ టీమ్​ రావాల్సి ఉంది..


మెడికల్  కాలేజీకి సంబంధించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఎన్ఎంసీ టీమ్​ రాక కోసం ఎదురుచూస్తున్నాం. వారు ఒకసారి విజిట్  చేసి క్లియరెన్స్​ ఇస్తే ఈ అకడమిక్  ఇయర్ లోనే క్లాసెస్  స్టార్ట్  చేసే అవకాశం ఉంది. మెడికల్  కాలేజీ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం.
- పార్వతి, ప్రిన్సిపాల్