గద్దర్ లాంటోళ్లు శతాబ్దానికి ఒక్కరే

  •  ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్తం: డిప్యూటీ సీఎం భట్టి 
  • నెక్లెస్ రోడ్ లో ఎకరంలో గద్దర్ స్మృతివనం 
  • గద్దర్ ఫౌండేషన్ కు రూ.3 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటన 
  • గద్దర్ పాటలతోనే పోరాటంలోకి: మంత్రి సీతక్క  
  • ప్రజల కోసమే బతికిండు: వివేక్ వెంకటస్వామి 

హైదరాబాద్, వెలుగు : గద్దర్​ విశ్వమానవుడని, అలాంటి వ్యక్తి తెలంగాణలో పుట్టడం మన అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్​ లాంటి వ్యక్తి శతాబ్దానికి ఒక్కరే పుడతారని, ఆయన ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. గద్దర్ తన జీవితాన్ని సమాజానికి అంకితం చేశారని.. గోసి, గొంగడి తప్ప మరేమీ సంపాందించలేదన్నారు. గద్దర్​ప్రథమ వర్ధంతి మంగళవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి మాట్లాడుతూ.. నెక్లెస్ రోడ్ లో ఎకరంలో గద్దర్ స్మృతివనం నిర్మిస్తామని తెలిపారు. 

గద్దర్ ఫౌండేషన్ కు రూ.3 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. ‘‘గద్దర్ అనేక తత్వాలను దాటి గొప్పగా ఆలోచించారు. అందుకే లెఫ్ట్, రైట్, సెంట్రిస్ట్ లకు కూడా గద్దర్​ అంటే అభిమానం. గద్దర్​ ఆట, పాట వల్లే తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రం వచ్చాక గద్దర్​ కు సరైన ప్రాధాన్యం దక్కలేదు. కాంగ్రెస్  ప్రభుత్వం వచ్చాక ఆదరిద్దామనుకునే టైమ్​లో ఆయన అందరికీ దూరమయ్యారు. గద్దర్ గుర్తుగా నంది అవార్డులను ఆయన పేరుతో ఇస్తున్నాం” అని చెప్పారు. తన తండ్రి జీవన పోరాటానికి చిహ్నంగా గద్దర్​ఫౌండేషన్​ఏర్పాటు చేశామని గద్దర్ కుమారుడు సూర్యం తెలిపారు. తన తండ్రే తన హీరో అని గద్దర్ ​కుమార్తె వెన్నెల అన్నారు. 

మాకెంతో అండగా ఉన్నరు: మంత్రి సీతక్క  

గద్దర్ అంటేనే పోరాటమని, ఆయన పాడిన పాటలతో స్ఫూర్తి పొందే తాను పోరాటంలోకి వచ్చానని మంత్రి సీతక్క అన్నారు. ‘‘గద్దర్ ప్రజాఉద్యమాలకు స్ఫూర్తి. భట్టి, రాహుల్ గాంధీ పాదయాత్రల్లో గద్దర్ తో కలిసి నడిచి ఎంతో నేర్చుకున్నా. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గద్దర్ అండగా ఉండి.. సలహాలు, సూచనలు ఇచ్చారు” అని అన్నారు. గద్దర్​చనిపోవడంతో తెలంగాణ తన దిక్సూచిని కోల్పోయిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 

ఆయన పోరాటాలకు ప్రతీక అని కొనియాడారు. గద్దర్ తన ఆటపాటలతో సమాజంలో చైతన్యం తీసుకొచ్చారని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. వరంగల్​లో నిర్మిస్తున్న కళాక్షేత్రానికి గద్దర్​పేరు పెట్టాలని, అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కూనంనేని సాంబశివరావు, ప్రొఫెసర్​ హరగోపాల్, గోరటి వెంకన్న, అందెశ్రీ, విమలక్క, మధుయాష్కి, పాశం యాదగిరి, పరుచూరి గోపాలకృష్ణ, బీజేపీ నేత రాంచందర్​రావు, వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావలవన్, మందుల సామేలు, సీపీఐ నేత నారాయణ, సీనీ నిర్మాత బండ్ల గణేష్​, బెల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

గద్దర్ చరిత్ర అందరు తెలుసుకోవాలి: వివేక్ వెంకటస్వామి 

గద్దర్ తన జీవితాన్ని ప్రజలు, ప్రజా ఉద్యమాలకే అంకితం చేశారని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘గద్దర్ ఎప్పుడూ బలహీనవర్గాల గురించే ఆలోచించేవారు. బుల్లెట్ గాయాలైనా ఎప్పుడూ భయపడలేదు. ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. ఆయన పాడిన పాటలు ఉద్యమ కాంక్షను ప్రతిబింబించాయి” అని చెప్పారు. 

గద్దర్​ను తన తండ్రి కాకా వెంకటస్వామి ఎంతో ప్రేమించేవారని తెలిపారు. గద్దర్ చరిత్ర అందరూ తెలుసుకోవాలని అన్నారు. గద్దర్ చరిత్రను చదివి.. ఆయన పాటలు, మాటల ద్వారా ఇచ్చిన సందేశాలతో అనేక విషయాలు నేర్చుకోవచ్చునని చెప్పారు. గద్దర్ సతీమణి చాలా కష్టపడి పిల్లలను పైకి తీసుకొచ్చారని అన్నారు. ‘‘గద్దర్ స్కూల్ పెట్టే సమయంలో అందులో భాగస్వాములు కావాలని అడిగారు. అప్పటి నుంచి గద్దర్ కి పెద్ద అభిమాని అయ్యాను. ఇదే రవీంద్రభారతీలో మా నాన్న కాకా వెంకటస్వామి సంస్మరణ సభ జరిగింది. ఆ సభలో గద్దర్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది” అని గుర్తు చేశారు. 

గద్దర్ పోరాట స్ఫూర్తిని మరచిపోలేం: పవన్ కల్యాణ్ 

పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా పోరాటాల్లో గద్దర్ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్అన్నారు. మంగళవారం  ప్రజా గాయకుడు గద్దర్  వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు ఆర్పిస్తున్నట్లు పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. గద్దర్ పోరాట స్ఫూర్తిని మరచిపోలేమన్నారు. నక్సల్ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకూ గద్దర్  తన గానంతో ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చారని తెలిపారు. పాటనే తూటాలుగా మలచి -తాను నమ్మిన సిద్ధాంతాన్ని, ప్రజల కష్టాలను తన రచనతో,  గానంతో ఎలుగెత్తి చాటారని కొనియాడారు.