నల్లమల కొండల్లో పొడుస్తున్న పొద్దు

మార్పు కోరుకుని అందుకు కంకణం కట్టుకుని ముందుకు సాగేవారు చాలా అరుదు. అట్లాంటి అరుదైన వ్యక్తే  కొల్లూరి సత్తయ్య. తాను బాగుండటమే కాదు తన చుట్టూ ఉన్నవారూ బాగుండాలని తపించే  వ్యక్తి.  అందుకే మన దేశంలో ఫూలే  విద్యపై దృష్టి పెట్టారు. శూద్రులను  బానిసత్వం నుంచి బయట వేయాలంటే విద్యే మార్గమని నమ్మాడు.  తన జీవిత సహచరిణిని కూడా టీచర్​ను చేశాడు.

మన దేశ చరిత్రలో ఈ దంపతులు త్యాగమయ జీవితాలకు పునాదులు. సామాజిక చైతన్యపు మైలురాళ్లు.  తనకు సామాజిక  సోయిని ఇచ్చిన వ్యక్తులను. మార్గదర్శులను  మరువబోమని చెప్పడమే కాదు. వారి గుర్తులను ముందు తరాలకు అందిస్తున్నారు.  అందులో భాగంగానే నాగర్​కర్నూల్​ జిల్లా, అమ్రాబాద్​ మండలంలోని, నల్లమల  ముఖద్వారం మన్ననూర్​లో  ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు.  గద్దర్ తన  మాట, పాట, ఆట ద్వారా యావత్  తెలుగు సమాజాన్ని జాగృతం చేశారు.  ప్రశ్నించాలని చెప్పారు. అందుకు బుద్ధుడు, అంబేద్కర్ మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పారు. ఆయన గుర్తుగా. ఆయన అందించిన వారసత్వానికి కొనసాగింపుగా ఈ విగ్రహం ఉండబోతున్నది. 

హైదరాబాద్ కేంద్రంగా  సత్తయ్య  తాను నిర్వహిస్తున్న పాక్ పెట్ సంస్థ  చేస్తున్న సామాజిక ప్రయోగం మంచి ఫలితాలనిస్తున్నది. పూర్వ విద్యార్థులుగా మేం దేశంలోని పలు రాష్ట్రాల నుంచి అక్కడ ఇంగ్లీషు, సైకాలజీలో శిక్షణ పొందాం. అంబేద్కర్, ఫూలే ఆలోచనా విధానాన్ని మాకు బోధించారు.  అంతేకాదు డాటా సైన్స్​లో శిక్షణ ఇచ్చారు.  ఈ కోర్సులో ఇక్కడ శిక్షణ   పొందిన అందరూ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. తమకాళ్లపై తాము నిలబడ్డారు.  భారత రాజ్యాంగంలో  పొందుపర్చిన స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం, భారతీయులంతా ఒక్కటనే సర్వమానవ సమానత్వాన్ని  బోధించారు.  తెల్లాపూర్​లోని అంబేద్కర్,  ఫూలే శిక్షణ కేంద్రానికి  వచ్చిన తర్వాత  మా ఆలోచనల్లో చాలా తేడా వచ్చింది.  దేశాన్ని, మనుషుల మధ్య సంబంధాలను అర్థం చేసుకునే సరి కొత్త ఆలోచన మాకు వచ్చింది.  ఈ కోవలో చూసినప్పుడు గద్దర్  విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వెనుక కూడా గద్దర్ బోధించిన  బుద్ధుని తాత్విక చింతన చాలా బలంగా ఉన్నది. 

సామాజిక ఉద్యమాలకు గద్దర్ అండ రాబోయే రోజుల్లో  మనదేశానికి బుద్ధుడు, ఫూలే, సంత్ రవిదాస్​ల తాత్విక ఆలోచన చాలా అవసరం ఉంది.  గద్దర్ వీరి గురించి రాశాడు. పాడాడు.  వాస్తవానికి గద్దర్ కుటుంబానికి ప్రేరణ కూడా బుద్ధుడే.  తాను ఏ  బావజాలంతో  పాటలు రాసినా అందులో  సర్వమానవ  హితాన్ని కోరుకోవడమే మనకు కన్పిస్తుంది.  అంతే కాదు, ‘బాబా సాహెబ్ నీకు జోహార్లు.. దీనబంధు నీకు జోహార్లు’ అంటూ అంబేద్కర్ వ్యక్తిత్వాన్నే కాదు ఆయన చేసిన త్యాగాన్ని,  కళ్లకు కట్టినట్లు  ఎలుగెత్తి చాటారు.  అంబేద్కర్ వాదాన్ని భుజానికి ఎత్తుకోవడం అంటే ప్రజాస్వామికంగా మనిషి మారాడని అర్థం. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికీ గద్దర్ మద్దతునిచ్చారు. పాటలు రాశారు. పలు సామాజిక ఉద్యమాలకు గద్దర్​ అండగా నిలబడ్డారు.  అందుకే గద్దర్  గురించి ముందు తరాలకు కేవలం పాటల ద్వారానే కాదు  విగ్రహాల ద్వారా ఒక సందేశం ఇవ్వాలని సత్తయ్య భావించారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. 

గద్దర్​ ఒక చైతన్య ప్రవాహం

భక్తి గురించి రాసినా... భుక్తి గురించి రాసినా గుండెను తాకి తీరాల్సిందే. గద్దర్ పాటల ఊట. చైతన్యపు బావుటా.  గద్దర్  విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే కేవలం వేదికపై పెట్టిన బొమ్మ మాత్రమే కాదు. అదో చైతన్యపు ప్రవాహం. ఈ దేశంలో  బుద్ధుడు.  ఫూలే. అంబేద్కర్​ల చైతన్యం కేవలం  మైదాన ప్రాంతాల్లోనే కాదు  నలుదిక్కులా ఉందని చెప్పేందుకు ఓ సంకేతం. గద్దర్ తెలంగాణ ఉద్యమంలో పాట రాసిన పాడినట్లుగా పొడుస్తున్న పొద్దులాగా మన్ననూర్ అడవిలో ఆయన మనకు కన్పించబోతున్నారు. ఈ విగ్రహావిష్కరణ  కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు దళిత బహుజన మేధావులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు.

జనచైతన్య బావుటా గద్దర్

సత్తయ్య నిర్వహిస్తున్న సామాజిక  చైతన్య కేంద్రం ద్వారా  దక్షిణ, ఉత్తర,  ఈశాన్య భారత రాష్ట్రాల నుంచి అన్ని సామాజిక వర్గాల విద్యార్థులు శిక్షణ  పొందారు.  ఆయా రాష్ట్రాల్లో కూడా గద్దర్ గురించి  అవగాహన ఉన్నది.  హైదరాబాద్​ నగరం విస్తరించి విశ్వనగరంగా మారింది. తెల్లాపూర్​లో గద్దర్ విగ్రహం సరి కొత్త నగరంలో  ఠీవిగా  దర్శనం ఇస్తూ ఉంటుంది.  ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోనూ గద్దర్  విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  ఇప్పుడు  నలమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు.  శ్రీశైలం వెళ్లే మార్గంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే శ్రీ మల్లిఖార్జున స్వామి దర్శానికి ఈ కనుమల ద్వారా వెళ్లేవారు గద్దర్ విగ్రహాన్ని చూసే వెళ్తారు.  ఈ అడవిలో గద్దర్ విగ్రహాన్ని చూసినవారికి ‘అడవి తల్లికీ దండాలో.. మా అడవి తల్లీకి దండాలో’ పాట చప్పున గుర్తుకు వస్తుంది.  గద్దర్ పాటలు అడవంతా చిక్కగా జనజీవితాల్లో అల్లుకుపోయాయి. - ఫూలే, అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ, పూర్వ విద్యార్థులు (పాక్ పెట్)