కాకా యాదిలో.. మరువలేని మహానేత

గడ్డం వెంకటస్వామి సమకాలీన రాజకీయాల్లో విశిష్టమైన రాజకీయ శైలిని అవలంబించిన మహానేత.  ఆ రోజుల్లో దళితులంటేనే  వివక్షకు గురౌతున్న పరిస్థితులు. తిండి, గుడ్డ, గూడు ఉంటే చాలు అనుకునే దళిత సమాజం నుంచి భారత  రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు.  బడుగుల అస్తిత్వం కోసం తన జీవితాంతం శ్రమించి... శ్రామికులు, పేదలకు గూడు కల్పించేందుకు గుడిసెలు వేయించి తన ఇంటిపేరే గుడిసెల వెంకటస్వామి అనుకునేలా సేవించిన గొప్ప నాయకుడు కాకా.

దామోదరం సంజీవయ్య, టీ అంజయ్యల స్ఫూర్తి,  సహకారంతో కింది వర్గాల అభ్యున్నతి కోసం నూతన శైలిలో తన పంథాను కొనసాగించాడు. ఆనాడు జంట నగరాల్లో పీడితులను ఆదుకునే పెద్ద దిక్కుగా నిలిచాడు. అదే విధంగా  తన రాజకీయ జీవితంలో దేశంలోనే బడుగులకు దిక్కు అయినాడు. ఒక దశలో భారతదేశపు రాష్ట్రపతి అయ్యే స్థాయికి ఎదిగాడంటే ఎంత నిబద్ధతతో తన రాజకీయాలను కొనసాగించాడనేది ఆలోచించాలి.

ఒకవైపు వర్గ రాజకీయాలున్న కాలంలో కూడా ఆయన వాటిని అన్నింటినీ పక్కకు తోసి తనదైన ప్రత్యేకతను చాటుకున్న చాణక్యుడు.  పేదలకు పక్కా ఇండ్లు కట్టించడంలో దేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అగ్రగామి కావడానికి ఆయనే కారణం అని చెప్పడంలో సందేహం లేదు.  ప్రజాప్రతినిధిగా, మంత్రిగా  కేంద్ర ప్రభుత్వంలో  కూడా బడుగుల కోసం ఎన్నో  పథకాల రూపకల్పనకు తన ఆలోచనలతో భాగస్వామ్యం ఉన్న నాయకుడు.  దళితులు విద్య ఉంటేనే తమ జీవితాలను బాగు చేసుకోగలరని విద్యా సంస్థను ఏర్పాటు చేసి లక్షలాది మందికి విద్యను అందించిన నాయకుడు.  కార్మికశాఖను పటిష్టం చేయడమే కాకుండా అభాగ్యులను ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించిన ఉదారుడు మన కాకా.

సమాజసేవకు కాకా కుమారులు అంకితం
అర్థిక స్వావలంబన ఉంటేనే  ఏ వ్యక్తి అయినా జీవితాంతంలో తను బతుకుతూ పదిమందికి బతుకునివ్వొచ్చు అని భావించి వ్యాపారసంస్థలను స్వయంగా తనే ఏర్పాటు చేశాడు.  ‘విశాఖ’నే  కాదు నేడు  వీ6,  వెలుగు లాంటి సంస్థలు ఆ కుటుంబం నుంచి సమాజానికి సేవ చేస్తున్న సంస్థలు.  తన కుమారులను కూడా సమాజసేవ కోసం అంకితం చేసి తన సంస్థలతో ప్రజాసేవ చేయిస్తున్నాడు.  

తెలంగాణ ఉద్యమంలో తనదైన ప్రత్యేకతను చాటుతూ ఉద్యమం కోసం తను చేసిన ప్రయత్నాలు  తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదు. తొలిదశ,  మలిదశ  ఉద్యమాల్లో  చురుకైన రాజకీయ ఎత్తుగడలతో  రాష్ట్ర సాధన ఉద్యమంలో తనదైన కీలక  భాగస్వామ్యాన్ని ఇచ్చాడు. టీఆర్ఎస్​ ఉద్యమ పార్టీగా ఎదగడానికి కాకానే కారణం. 2004లో  కాంగ్రెస్తో పొత్తుకు బాటలు వేసి ప్రభుత్వంలో పాలుపంచుకోవడానికి కాకా ప్రధాన భూమిక పోషించడానికి కారణం తెలంగాణ అస్తిత్వ  రాజకీయం పెరగాలనే ఆలోచన. అయన ఆరోజుల్లో టీఆర్ఎస్​కు  సహకరించకపోతే  ఆ పార్టీ మనుగడే కష్టం అయ్యేది.  కానీ,  ఆ పార్టీ అయనపట్ల ఎప్పుడూ గౌరవం చూపించలేదు.  కనీస గౌరవం కూడా ఇవ్వలేకపోయింది.  కాకా పుట్టిన రోజు, మరణించిన రోజు గత బీఆర్ఎస్​ ప్రభుత్వం  అధికారికంగా జరిపించడానికి  కూడా ఇష్టపడలేదు.

అధికారికంగా కాకా జయంతి, వర్ధంతి
దళితుణ్ని  ముఖ్యమంత్రి చేస్తా అని ఢంకా బజాయించిన కేసీఆర్..​ ఒక దళితుడు జాతీయస్థాయిలో ఎదిగి తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించి, తన రాజకీయం బలోపేతానికి కృషి చేసిన కాకాను అవమానించాడు. కాకా వారసులను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అవమానించాడు.  కాకా కుమారులు వినోద్​, వివేక్​ తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా ఉద్యమించడానికి వారి తండ్రే స్ఫూర్తి.  ఆయన ఆలోచనలతోనే  కేసీఆర్​కు సహకరించినా  కాకా కుమారులను కూడా అవమానించి కాకా యాదిని కూడా మరిచిపోయేలా ప్రయత్నాలు చేశాడు. కాగా,  కాంగ్రెస్​ ప్రభుత్వం రేవంత్​రెడ్డి నాయకత్వంలో కాకాను గౌరవించుకునేలా ఆయన జయంతి, వర్ధంతులను అధికారికంగా జరుపుకునేందుకు జీవో జారీ చేసింది.  

ఇది కాంగ్రెస్​ పార్టీ నాయకుడిగా కాదు  దేశంలోనే  అరుదైన  వ్యక్తిత్వం, గుర్తింపు ఉన్న తెలంగాణ ప్రాంతపు నాయకుడికి కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన మర్యాద.  దేశం గర్వించదగ్గ నాయకుడి ఆలోచనలకు భవిష్యత్​లో  ప్రధాన కార్యాచరణకు  కూడా పూనుకుంది కాంగ్రెస్​ ప్రభుత్వం.  పేదలకు ఇండ్ల స్థలాలు,  గృహనిర్మాణం,  మురికివాడల అభివృద్ధి, విద్య, వైద్యం  ప్రస్తుత ప్రభుత్వం ప్రధాన లక్ష్యాలు.  వాటికోసం కాకా పోరాడిన నేపథ్యమే స్ఫూర్తి.  పారిశ్రామికీకరణ కోసం తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, లేనప్పుడు అన్ని సందర్భాల్లో కృషి చేయడమే కాకుండా కొన్ని వర్గాలకే పరిమితమైన వ్యాపారం, పరిశ్రమల స్థాపన కిందివర్గాల్లో కూడా విస్తరించడానికి ప్రయత్నించాడు.  బడుగులు నేడు  దేశంలో  ఆర్థిక,  వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారంటే కాకా కీలక పాత్ర ఉంది. 

కాకాపై  గాంధీ కుటుంబానికి ప్రత్యేక గౌరవం
ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీ,  సోనియా గాంధీ లాంటి నేతలు గౌరవంగా చూసే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు కాకా.  ఆయన మరణించిన రోజు స్వయంగా రాహుల్ గాంధీ రావడమే.. గాంధీ కుటుంబానికి ఆయన మీద ఉన్న ప్రత్యేక గౌరవం చాటుతోంది.  కాంగ్రెస్​  ప్రభుత్వాలు సజావుగా సాగడానికి ఆయన సామర్థ్యం ఎంతో ఉపయోగపడింది.  తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా వాటిని లెక్క చేయకుండా అన్నింటినీ  ఎదిరించి  నిలబడ్డ ఆత్మగౌరవ దిగ్గజం కాకా.

ఆధునిక కాలంలో  సమాజంలో అన్నివర్గాల ప్రజలు అనుసరించదగ్గ మార్గదర్శకాలను నెలకొల్పిన దళిత దిగ్గజం. తనతోనే తన ఆలోచనలు మరుగునపడొద్దని  తన వారసులను అదే పంథాలో కొనసాగించాలని నిర్దేశించిన నాయకుడు.  కులాంతర వివాహాలు ప్రోత్సహించడమే కాకుండా తన కుటుంబంలో ఆ ఆదర్శాన్ని పాటించిన వ్యక్తి. అంబేద్కర్​ఆలోచనా విధానాన్ని తు.చ తప్పకుండా పాటించి నిబద్ధత  కలిగిన నాయకుడు. అంబేద్కర్​ పేరు మీదనే అకాడమీని ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన ఆలోచనల వారసుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుపొందాడు.  బడుగులు, పీడితుల కోసం దశాబ్దాలుగా పోరాడి ఎన్నో విజయాలను సాధించి  భవిష్యత్​ తరాల కో సం ఎన్నో ప్రణాళికలను  చేసిన  నాయకుడి జీవితం అందరికీ ఆదర్శనీయం.

డా. అద్దంకి దయాకర్
ప్రధాన కార్యదర్శి, టీపీసీసీ