కాకా యాదిలో.. కార్మికుల పెన్షన్ పథకం రూపశిల్పి

శ్రమ శక్తిని గౌరవించడం ప్రతి పౌరుడి ధర్మం అయినప్పుడు శ్రామిక లోకం చిందించే చెమట చుక్కలను గుర్తించడం ప్రభుత్వాల కనీస ధర్మం. అందుకే శ్రామికుల స్వేదం ఆ దేశం, ఆ ప్రభుత్వాల ఆర్థిక పురోగతికి ఇంధనం లాంటిదని మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) తన అనుభవంలో ఇలా అనేక అంశాలు చెబుతుండేవారు. మంచి పనులతోనే మానవ జన్మకు సార్థకత ఉంటుందంటారు. అదే రాజకీయ నేతలు అందునా మంచి హోదాలో ఉన్నవారు తమ క్షేత్ర ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపనపడేవారున్నా వాటిని సాధించేవాళ్లు చాలా తక్కువ.  కానీ,  70 ఏండ్ల కార్మిక ప్రస్థాన ప్రయాణంలో, ఐదు దశాబ్దాల రాజకీయ జీవిత గమనంలో కాకా చెరగని ముద్రనే వేసుకున్నారు. 

తా ను ప్రాతినిధ్యం వహించిన పెద్దపల్లి, కార్మికులతో పనిచేసిన కార్యక్షేత్రాలు కలకాలం గుర్తుండే మంచి పనులెన్నో చేశారు.  ఇయ్యాల మాజీ కేంద్ర మంత్రి, పేదల పక్షపాతి, కార్మికవర్గపు బాంధవుడు గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన ప్రవేశపెట్టిన పెన్షన్ పథకంపై దేశ వ్యాప్త చర్చ జరుగుతున్నది. చైనా లాంటి కమ్యూనిస్టు దేశాలు అప్పటి పెన్షన్ పథకంకు మంత్రముగ్ధులయ్యాయి. ఇవాళ భారతదేశంతోపాటు మరికొన్ని దేశాలు అనుసరిస్తున్న కాకా పెన్షన్ పథకం దేశ కార్మిక రంగంపై చెరగని ముద్ర వేసింది. సహజంగా ప్రభుత్వరంగంలో పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం ఉంటుంది. కానీ, ప్రైవేట్ రంగంలో పదవీ విరమణ అనంతరం ఆ పెన్షన్ సౌకర్యం లేక లక్షల కుటుంబాలు రోడ్డున పడేవి. అనేక కుటుంబాలు బిక్షాటన చేస్తూ అర్ధాకలితో అలమటించిన రోజులూ ఉన్నాయి.  తన పేదరికపు అనుభవాలు, తాను ఎదిగిన కార్మిక క్షేత్ర కష్టాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి అనేక ప్రభుత్వాలకు మార్గదర్శిగా నిలిచారు. అంతేకాదు ప్రపంచ దేశాలు కాకా ప్రవేశపెట్టిన పెన్షన్ స్కీంపై అధ్యయనం చేసి ఆయా దేశాల్లో అమలు చేస్తున్నారు. 

ప్రైవేటు రంగంలోనూ పీఎఫ్​, పెన్షన్ ​తెప్పించారు
ఓసారి ఆల్విన్ కంపెనీకి వెళ్లినప్పుడు ఒకాయన కాకా దగ్గరకొచ్చి బిక్షమెత్తుకుంటుండగా ఎవరో తెలిసిన అతనే అని ఆరా తీస్తే సదరు వ్యక్తి అదే ఆల్విన్ కెంపెనీలో రిటైర్డ్ అయి తన కష్టమంతా కుటుంబానికి దారపోసిన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ప్రభుత్వ రంగంలో రిటైర్డ్ తర్వాత నెల నెలా పెన్షన్ సౌకర్యం ఉన్నప్పుడు ప్రైవేట్ రంగంలో ఎందుకు ఉండకూడదనే ప్రశ్న ఆయనలో మొదలైంది. 

కంపెనీలలో పీఎఫ్,​ పెన్షన్​లపై అప్పటి ప్రధాని పీవీ, ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్​సింగ్​లను ఒప్పించినా, అది ప్రభుత్వం వల్ల అయ్యే పనికాదని చెప్పినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఓ నిపుణుల కమిటీ వేయించి పెన్షన్ పథకం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి ఆ నివేదికను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఓకే చేయించారు.  ఫలితంగా 1995 నవంబర్ 16న పార్లమెంట్​లో బిల్లు ప్రవేశపెట్టారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్​ ఫండ్ అండ్ మిస్​లేనియస్ సవరణ చట్టం -1996 అధికారిక రూపుదిద్దుకున్నది. దీంతో రిటైర్డ్ అయిన కార్మికులకు, ఒకవేళ కార్మికులు చనిపోయినా వారి కుటుంబ సభ్యులు పెన్షన్ తీసుకుంటున్నారు. ఇవాళ దేశంలో ఉన్న దాదాపు ఈ కమిటీలో 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు, 7.5 కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఉద్యోగులు ఉన్నారు. వీరి కుటుంబాలకు వారికున్న జీతాలనుబట్టి నెలనెలా ఎంతో కొంత పెన్షన్ రూపంలో వచ్చేది.  

కానీ, కాకా స్ఫూర్తితో ఇదే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్- 1995 పథకాన్ని సవరణలు చేస్తూ సెప్టెంబర్ 2014లో కనీస పెన్షన్ రూ.1000 అమలు చేస్తున్నది. అంటే కనిష్ట ఉద్యోగికి విధిగా నెలనెలా రూ.1000 లభిస్తుంది. అయితే, ఈ కనీస పెన్షన్ రూ.2000 పెంచాలని కోరుతూ ఆర్థికశాఖకు కార్మిక శాఖ గతేడాది ప్రతిపాదనలు పంపినా కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదు. అంటే కాకా స్ఫూర్తితో పెన్షనర్ల సంఘంగా ఏర్పడి తమ సమస్యలను ప్రస్తావించే అవకాశం లభించింది. ఇప్పటికీ పెన్షనర్లు జాతీయస్థాయిలో ఆందోళన చేస్తూ కనీస పెన్షన్ రూ.7,500 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. జీవిత చరమాంకంలో సామాజిక భద్రత, పనిచేసే శక్తి లేక నిస్సహాయులుగా ఉంటున్నవారందరికి 1995లో  కాకా చూపిన మార్గం దోహదపడుతున్నదని గుర్తెరిగి కార్మికులకు బాసటగా నిలవాలి.

అజాత శత్రువుగా..
నిలువ నీడలేని నిరుపేదలు, ముఖ్యంగా కార్మికలోకం ఉద్వేగానికి లోనయ్యే పేరు కాకా. పేదరికం, సామాజిక ఉద్యమాలు, నక్సల్​బరి పోరాటాల ప్రాంతం నుంచి అలుపెరగక ఆరున్నర దశాబ్దాల రాజకీయాలతో అజాత శత్రువుగా ఎదిగిన ఆయన సామాజిక, రాజకీయ జీవనం తెలంగాణ రాష్ట్ర సాధన వరకూ సాగి అనేక కీలక ఘట్టాలకు వేదికైంది. 

ప్రతిపనికి వన్నె తెచ్చారు..
1949లో జాతీయ గుడిసెల సంఘం స్థాపించి తన ఇంటిపేరునే గుడిసెల వెంకటస్వామిగా మార్చుకున్న కాకా చేపట్టిన ప్రతి పదవికీ వన్నె తెచ్చారు. ముఖ్యంగా ఆయా హోదాల్లో పేదలకు పక్కాగా న్యాయం చేసే ప్రయత్నం చేశారు. 1973-–77లో కేంద్ర మంత్రిగా నిత్యావసర సరుకులకు తక్కువ ధరకే రేషన్ దుకాణాల్లో ఏర్పాటు చేశారు. నేటికీ కోట్లాది మంది పేద లబ్ధిదారులకు ఆయన చొరవ వల్లే ఆ సరుకులందుతున్నాయి. 1991–-93 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేసిన కాకా 7వేల కోట్లున్న గ్రామీణాభివృద్ధి  బడ్జెట్​ను ఏకంగా 25వేల కోట్లు పెంచడమే గాకుండా 1992లో 73వ రాజ్యంగ సవరణ చేసి పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న రాజీవ్ గాంధీ కలను నిజం చేయడంలో భాగంగా ఆ బిల్లును పార్లమెంట్​లో పెట్టారు. 

1993–-95 కేంద్ర జౌళి శాఖ మంత్రిగా నష్టాల్లో ఉన్న వస్త్ర పరిశ్రమకు రాయితీలిచ్చి గట్టెక్కించడమే కాకుండా ఖాయిలా పడ్డ 79 టెక్స్​టైల్ కంపెనీలను నేషనల్ టెక్స్​ టైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటిని ఆధునీకరించారు. 1995లో యావత్తు ప్రపంచం మెచ్చేవిధంగా రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ స్కీం విధానాన్ని ప్రవేశపెట్టారు. 1995లోనే సింగరేణి బొగ్గు గని కార్మికుల కోసం ప్రత్యేక పెన్షన్ స్కీం అందించడమే కాకుండా దాని ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి మార్పించారు.  ఇలా చెప్పుకుంటే ఇవాళ పేదలు అనుభవిస్తున్న ప్రతి పథకంలో కాకా ముద్ర ఉన్నదని చెప్పాలి.

వెంకట్ గుంటిపల్లి
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం