పెద్దపల్లిలో లక్షా 31 వేల మెజారిటీతో గడ్డం వంశీకృష్ణ విక్టరీ

 రాష్ట్రంలోని లోక్ సభ ఫలితాల్లో సత్తాచాటాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఎంపీ ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లు పోరాడిన కమలం, హస్తం పార్టీ నేతలు.. చెరో 8చోట్ల నెగ్గారు. ఇక మజ్లీస్ పార్టీ హైదరాబాద్ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికల్లో సైతం చేతులెత్తేసింది. 2019 ఎన్నికల్లో 9సీట్లు గెలిచిన గులాబీ పార్టీ..ఈసారి ఖాతా తెరవలేదు. ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే కొనసాగింది. బీఆర్ఎస్ సున్నాకే పరిమితమైంది. ఖమ్మం, మహబూబాబాద్ లో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. మిగతా అన్ని చోట్ల మూడో ప్లేస్ కే పరిమితమైంది గులాబీ పార్టీ.

 తెలుగు రాష్ట్రాల ఎంపీ ఎన్నికల చరిత్రలో నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి రికార్డు విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 5లక్షల 59వేల మెజార్టీతో గెలుపొందారు. ఇక ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి నాలుగు లక్షల 67వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. భువనగిరిలో కాంగ్రెస్ క్యాండిడేట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై 2లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. నాగర్ కర్నూల్ లో పోతుంగంటి భరత్ ఫై 94వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి విక్టరీ కొట్టారు.  

పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ పై లక్షా 31వేల 364ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు. ఇక మహబూబాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితపై 3లక్షల 44వేల మెజార్టీతో విజయం సాధించారు.వరంగల్ లో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ పై దాదాపు రెండు లక్షలకుపైగా ఓట్ల తేడాతో రికార్డు విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య. జహీరాబాద్ లో సురేష్ షెట్కార్..బీబీ పాటిల్ పై 46వేల మెజార్టీతో గెలిచారు.

బీజేపీ సిట్టింగ్ ఎంపీలైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మరోసారి గెలిచారు. కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై 2లక్షల 20వేల రికార్డు మెజార్టీతో ఘన విజయం సాధించారు బండి సంజయ్.  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి దానంపై దాదాపు 50వేల ఓట్ల తేడాతో గెలిచారు.