నాడు తాత, తండ్రి.. నేడు మనుమడు

మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్​అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. తన తాత గడ్డం వెంకటస్వామి, తండ్రి వివేక్ వెంకటస్వామి బాటలోనే పార్లమెంట్​లో అడుగుపెట్టనున్నారు. కాకా వెంకటస్వామి1989 ఎన్నికల్లో మొదటిసారి పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 30,635 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

తర్వాత 1991 ఎన్నికల్లో తిరిగి హస్తం గుర్తుపై పోటీ చేసిన ఆయన 1,09,965 ఓట్ల ఆధిక్యం సాధించారు. 1996 ఎన్నికల్లో మరోసారి అదే పార్టీ నుంచి బరిలో నిలిచి 65,465 ఓట్లతో గెలిచి హ్యాట్రిక్ రికార్డు సాధించారు. 2004 లోక్​సభ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2,63,135 ఓట్ల రికార్డు మెజారిటీ సొంతం చేసుకున్నారు. నాలుగుసార్లు పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కాకా కేంద్రమంత్రిగా ఈ ప్రాంతానికి అనేక సేవలందించారు. 2009 ఎన్నికల్లో వెంకటస్వామి వయోభారంతో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 

ఆ ఎన్నికల్లో కాకా వారసుడిగా వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్​లో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిపై 49,017 ఓట్ల మెజారిటీతో గెలిచి తండ్రి పేరును నిలబెట్టారు. తాజాగా జరిగిన 2024 లోక్​సభ ఎన్నికల్లో వెంకటస్వామి మనుమడు, వివేక్​ తనయుడు గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. తాత, తండ్రికి తగ్గ వారసుడిగా పేరు తెచ్చుకున్నారు. పెద్దపల్లి లోక్​సభ సెగ్మెంట్​కు ఇప్పటి వరకు 16సార్లు ఎన్నికలు జరిగితే కాకా ఫ్యామిలీ నుంచే ఆరుసార్లు ఎంపీలుగా గెలువడం విశేషం. 

కాంగ్రెస్​ కంచుకోట పెద్దపల్లి.. 

పెద్దపల్లి లోక్​సభ సెగ్మెంట్ (ఎస్సీ రిజర్వుడ్) 1962 సంవత్సరంలో ఆవిర్భవించింది. మూడో లోక్​సభ సమయంలో మొదటిసారి ఎంపీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 16 సార్లు ఎలక్షన్స్​ జరిగితే అత్యధికంగా 10 పర్యాయాలు కాంగ్రెస్ గెలిచింది. ఈ నియోజకవర్గం నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది. 

తండ్రీ కొడుకుల చేతిలో ఓడిన గోమాస...  

పెద్దపల్లి ఎంపీగా రెండుసార్లు పోటీ చేసిన గోమాస శ్రీనివాస్​ తండ్రీకొడుకులు వివేక్​, వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు. 2009లో కాంగ్రెస్ నుంచి వివేక్, బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ తలపడ్డారు. ఆ ఎన్నికల్లో వివేక్​ 49,017 ఓట్ల మెజారిటీతో గోమాసను ఓడించారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీకృష్ణ, బీజేపీ నుంచి శ్రీనివాస్ తలపడ్డారు. ఈసారి కూడా గోమాసకు నిరాశే ఎదురైంది. వంశీకృష్ణ 1.31 మెజారిటీతో ఘన విజయం సాధించారు.

పెద్దపల్లి ప్రజల రుణం తీర్చుకుంటా..

పెద్దపల్లి ఎంపీగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణాన్ని తీర్చుకుంటా. కేంద్రంతో పోరాడి, అధికంగా నిధులు తీసుకొచ్చి.. పదేండ్లుగా పూర్తిగా వెనుకబాటుకు గురైన పెద్దపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. దివంగత మహానేత కాకా వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్ఫూర్తి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పార్లమెంట్​ పరిధిలోని ఎమ్మెల్యేల సహకారంతో ప్రజలతో మమేకమై పనిచేస్తా. నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కాంగ్రెస్​ శ్రేణులకు కృతజ్ఞతలు.
‑ గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి ఎంపీ