టెక్నాలజీ : ఏఐ చాట్‌ మెమొరీ

మెటా వాట్సాప్​లో ఏఐ ఫీచర్​ని చేర్చాక ఏఐ వాడకం పెరిగింది. ఏఐని యూజర్లకు మరింత దగ్గర చేసేందుకు మెటా మరో ఫీచర్​ తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. అదే ‘చాట్​ మెమొరీ’. ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే.. మెటా ఏఐ మరింత బాగా పనిచేస్తుంది. పర్సనల్​ అసిస్టెన్స్​ మెరుగవుతుంది. యూజర్లు ఏఐని అడిగిన ప్రశ్నలను గుర్తుంచుకుంటుంది. వాటి ద్వారా యూజర్స్​​ ఏం తింటారు? ఎలాంటి వస్తువులు ఇష్టపడతారు? లాంటివన్నీ తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్​ని గుర్తుంచుకుని, మళ్లీ ఎప్పుడైనా ప్రశ్న అడిగితే ఆ డాటా సాయంతో సమాధానం ఇస్తుంది.

ఉదాహరణకు అడిగిన ప్రశ్నల ద్వారా యూజర్​ ‘వెజిటేరియన్’ అని చాట్ అసిస్టెంట్‌‌ తెలుసుకుంటే.. ఆ యూజర్​ ఎప్పుడైనా ఫుడ్​ గురించి అడిగితే.. వెజిటేరియన్​ రెసిపీస్​ రిజల్ట్స్​నే చూపిస్తుంటుంది. యూజర్​ బర్త్​డే, పర్సనల్ ప్రిఫరెన్స్​, ఫేవరెట్ బుక్స్, డాక్యుమెంటరీస్, పాడ్​కాస్ట్​లు, అలెర్జీస్, ఇంట్రెస్ట్స్​... ఇలాంటివన్నీ ఏఐ గుర్తుంచుకుంటుంది.

దీనివల్ల యూజర్లు తమకు కావాల్సిన ఇన్ఫర్మేషన్​ని మరింత సులభంగా, వేగంగా తెలుసుకోవచ్చు. ఇది యూజర్స్ లైఫ్​స్టయిల్​కు సరిపోయే రికమండేషన్స్, సలహాలు కూడా ఇస్తుంటుంది. మరో విషయం ఏంటంటే.. యూజర్లకు ఏఐ గుర్తుంచుకునే ఇన్ఫర్మేషన్​ను అప్​డేట్​ లేదా డిలీట్ చేసుకునే అవకాశం కూడా ఉంది.