గడిచిన మూడేండ్లలో ప్రపంచం కరోనాతో సహా ఎన్నో కష్టాలు, నష్టాలు చూడాల్సి వచ్చింది. భౌగోళిక, రాజకీయ అనిశ్చితితో ఎంతోమంది ప్రజలు ఇబ్బందిపడ్డారు. చాలా దేశాలు ద్రవ్యోల్బణం, తక్కువ ఆర్థిక వృద్ధితో సతమతమయ్యాయి. అదే టైంలో మనకు చేదోడుగా ఉండేందుకు ‘ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ’ ఒక విప్లవంలా వచ్చింది.
అయితే.. 2023 కన్నా 2024లో దాని ప్రయోజనాలు ప్రపంచానికి చాలా ఎక్కువగా అందుతాయనేది ఎక్స్‌పర్ట్స్ అంచనా. అందుకే గడిచిన కాలం తాలూకు జ్ఞాపకాల నుంచి జ్ఞానం పెంచుకోవాలి. భవిష్యత్తు మీద ఆశతో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాలి. ఒక రకంగా చెప్పాలంటే టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లో ఈ దశాబ్దంలో ఇదే కీలకమైన ఏడాది.
ఏఐ భయం పుట్టిస్తోంది
మనుషులు కంప్యూటర్లతో మాట్లాడడం, రోబోలు మనుషులు చెప్పిన పనులు చేయడం, డ్రైవర్‌తో అవసరంలేకుండా కార్లు నడవడం... లాంటివి కొంతకాలం క్రితం వరకు సైన్స్ ఫిక్షన్. అలాంటివి సినిమాల్లో మాత్రమే కనిపించేవి. ఒకప్పుడు సినిమాల్లో చూపించినవే ఇప్పుడు నిజ జీవితంలోకి వచ్చేశాయి. ఒక్క వాయిస్ కమాండ్ ఇస్తే చాలు రయ్‌మని దూసుకుపోయే కార్లు, మనతో ఫ్రెండ్‌లా, గురువులా మాట్లాడే డివైజ్‌లు అందుబాటులోకి వచ్చాయి.
దీనంతటికీ కారణం.. ఏఐ టెక్నాలజీ. 2023లో చాట్‌జీపీటీతో ఏఐ ఒక విప్లవంలా వచ్చింది. 2024లో ఇది మరింత డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. అంతెందుకు మన తర్వాతి తరం ఏఐ అసిస్టెన్స్ లేకుండా ఉండలేరట! ఇప్పటికే జనరేటివ్ ఏఐ దాదాపు ప్రతి ఇండస్ట్రీలో గేమ్-ఛేంజర్‌గా మారింది.
ఏఐ ఎక్కువగా వాడుకలోకి వచ్చిన ఏడాది 2023. అందుకే ఈ ఏడాది ఇది ప్రపంచాన్ని ఆక్రమించేస్తుందని, మానవజాతిని నాశనం చేస్తుందని చాలామంది ఆందోళన పడ్డారు. ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు. అలాగే 2024 లో కూడా ఏఐ అందరినీ భయపెడుతుందనేది ఎక్స్‌పర్ట్స్ అంటున్నమాట. వచ్చే ఏడాది కూడా ఉద్యోగాలని ఎత్తుకెళ్లడానికి ఏఐ రెడీ అయిపోతోంది. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్‌ల నుండి ఆఫీస్ సాఫ్ట్‌వేర్, డిజైన్ ప్యాకేజీలు, కమ్యూనికేషన్ కోసం వాడే పరికరాలు.. ఇలా మనం ప్రతిరోజూ వాడే చాలా అప్లికేషన్లలో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఉండనుంది.
2024లో ఏఐని సరిగ్గా ఉపయోగించుకుంటే.. 24/7 చేతిలో సూపర్ స్మార్ట్ పర్సనల్ అసిస్టెంట్ ఉన్నట్టే. ఏఐ టెక్నాలజీ ముఖ్యంగా బ్రెయిన్‌వర్క్‌ను తగ్గిస్తుంది. మనుషుల పనులను షెడ్యూల్ చేయడం, ఐడియాల ఆర్గనైజ్, ప్రాజెక్ట్స్ రూపొందించడం లాంటివన్నీ ఏఐకి అప్పగించడం వల్ల హ్యూమన్ స్కిల్స్ వాడాల్సిన అవసరం కాస్త తగ్గుతుంది. కాబట్టి ప్రోగ్రామింగ్ మెషిన్‌ల కంటే మనుషులు క్రియేటివిటీని పెంచుకోవాలి. కొత్త ఆలోచనల అన్వేషణ మొదలుపెట్టాలి. అలాగైతేనే.. మనుగడ సాధ్యమవుతుంది. లేదంటే మన స్థానంలోకి ఏఐ టెక్నాలజీ వచ్చి చేరుతుంది.
వచ్చే ఏడాదిలో కంప్యూటర్ల తయారీ విపరీతంగా పెరుగుతుందనేది ఒక అంచనా. పెరుగుతున్న ఏఐ టెక్నాలజీకి అనుగుణంగా ఉండేందుకు అడ్వాన్స్‌డ్ కంప్యూటర్లు తయారుచేసే పనిలో పడ్డాయి కంపెనీలు. ప్రత్యేకంగా ఏఐ పీసీలను తయారు చేస్తున్నాయి. అంతే కాదు.. అప్లికేషన్స్‌లో వాడే ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ కోసం ‘హై డెన్సిటీ కంప్యూటింగ్’ అవసరం అవుతోంది.
ఏఆర్.. వీఆర్..
ఏఐ వాడకం పెరగడమే కాకుండా దాంతో పాటు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్) లాంటి టెక్నాలజీలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఇలాంటి టెక్నాలజీ వాడడం ఎక్కువైంది. టెక్నాలజీని బాగా వాడుకునేవాళ్లలో ఎక్కువమంది భౌతిక ప్రపంచంతో కాకుండా ఇలాంటి వర్చువల్ ప్రపంచంలోనే ఎక్కువ టైం గడుపుతున్నారు. డిజిటల్ అవతార్‌లుగా మారిపోతున్నారు. ఈ ట్రెండ్ 2024లో మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. ఏఐ టెక్నాలజీ ఆన్‌లైన్ గేమింగ్ మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది.
సస్టెయినబుల్ టెక్నాలజీ
డెవలప్ అయిన టెక్నాలజీ వల్ల ఇప్పటికే చాలా దేశాల్లో ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌ల వాడకం పెరిగింది. అలాగే ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌ల్లో చాలా ఫీచర్లు యాడ్ అవుతున్నాయి. ముఖ్యంగా టెస్లా లాంటి ఎలక్ట్రిక్ కార్లు ఏఐని బాగా వాడుకుంటున్నాయి. ముందుముందు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతుంది. వీటివల్ల 2024లో చాలా దేశాల్లో గాలి కాలుష్యం తగ్గే అవకాశాలు ఉన్నాయనేది ఎక్స్‌పర్ట్స్ మాట. దానివల్ల పర్యావరణానికి కూడా కొంత మేలు జరుగుతుందన్నట్టే కదా! కార్లు బైక్‌లు మాత్రమే కాదు.. 2024లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడకం పెరుగుతుంది.
సైబర్ ఎటాక్స్
కొన్నేండ్లుగా సైబర్ ఎటాక్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు వాటికి ఏఐ తోడైంది. ఏఐ వాడుకుని నేరగాళ్లు రకరకాలుగా సైబర్ దాడులు చేస్తున్నారు. ఇది 2024లో మరింత పెరిగే అవకాశం ఉంది. గత మూడేండ్లలో ప్రతి రెండు కంపెనీల్లో ఒకటి ఏదో విధంగా సైబర్ ఎటాక్‌కు గురైంది. 2024 చివరి నాటికి ఈ దాడుల వల్ల10 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లకు పైగా నష్టాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నాయి కంపెనీలు. దీనివల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి. సైబర్ ఎటాక్స్ కారణమయ్యే ఏఐతోనే దానికి అడ్డుకట్ట వేసేందుకు టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు.
క్వాంటం కంప్యూటింగ్
కొంతకాలంగా క్వాంటం కంప్యూటింగ్ డెవలప్‌మెంట్ మీద చాలా కంపెనీలు పనిచేస్తున్నాయి. 2024లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. క్వాంటం కంప్యూటింగ్ అనేది క్వాంటం మెకానిక్స్ ఈక్వేషన్స్ ఉపయోగించే ఒక రకమైన కంప్యూటింగ్. క్లాసికల్ కంప్యూటింగ్‌లో డేటా 0 లేదా1 బిట్‌లను ఉపయోగించుకుంటుంది.
కానీ.. క్వాంటం కంప్యూటింగ్ క్వాంటం బిట్‌లు లేదా క్విట్‌లను ఉపయోగిస్తుంది. అంటే 0 , 1 రెండింటినీ ఒకేసారి సూచించగలదు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. డ్రగ్ డిస్కవరీ, జీనోమ్ సీక్వెన్సింగ్, క్రిప్టోగ్రఫీ, మెటియోరాలజీ , మెటీరియల్ సైన్స్, ఆప్టిమైజేషన్, మెషిన్ లెర్నింగ్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలకు రిస్క్ మేనేజ్‌మెంట్ తగ్గుతుంది.
క్లౌడ్ నుంచి పర్సనల్
ఇప్పటివరకు ఏఐ టెక్నాలజీ క్లౌడ్ ఆధారంగా పనిచేస్తుంది. దానికి కావాల్సిన డాటాని క్లౌడ్‌లోనే సేవ్ చేసుకుంటుంది. దీని వల్ల మెయింటెనెన్స్‌కి కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ.. 2024లో క్లౌడ్-బేస్డ్ నుండి హైబ్రిడ్ లేదా ఆన్- డివైజ్‌కి మారే అవకాశం ఉంది. అంటే పర్సనల్ డివైజ్‌లో ఉండే స్టోరేజీలో ఏఐ డేటాను సేవ్ చేసుకునే టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. అంటే స్మార్ట్‌ఫోన్‌లు, పీసీలు, వెహికల్స్, ఐఓటీ పరికరాల్లో ఇన్‌బిల్ట్‌గా ఏఐ టెక్నాలజీ ఉంటుంది.
జీనోమిక్స్
ఆరోగ్యంగా ఉండడానికి, వ్యాధులతో పోరాడడంలో సాయం చేసేందుకు డీఎన్‌ఏని స్టడీ చేసే టెక్నాలజీ ఇది. జీన్స్, డీఎన్‌ఏ... వాటి మ్యాపింగ్, నిర్మాణం మొదలైన వాటన్నింటి గురించి స్టడీ చేస్తుంది జీనోమిక్స్. అంతేకాదు.. జన్యువులను లెక్కించడంలో కూడా సాయపడుతుంది. వ్యాధులను గుర్తించడంలో, భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను కనుగొనడంలో ఉపయోగపడుతుంది. ఈ జీనోమిక్స్ టెక్నాలజీ 2024లో ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో పనిచేసే టెక్నికల్ జాబ్స్ కూడా పెరుగుతాయి.
ఎడ్జ్ కంప్యూటింగ్
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ కంప్యూటింగ్‌కి బాగా డిమాండ్ ఉంది. చాలా కంపెనీలు క్లౌడ్ సర్వీసులను వాడుకుంటున్నాయి. అందుకోసం ఏడబ్ల్యూఎస్ (అమెజాన్ వెబ్ సర్వీసెస్), మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫాం లాంటి వాటిపై ఆధారపడుతున్నాయి. కానీ.. క్లౌడ్ కంప్యూటింగ్‌ని వాడుకోవడంలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అందుకే 2024లో దాని స్థానంలో ఎడ్జ్ కంప్యూటింగ్ వాడకం పెరిగే అవకాశం ఉందంటున్నారు టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్. క్లౌడ్ కంప్యూటింగ్‌లో డాటా సెంటర్ నుంచి డాటాను పొందడానికి కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. కానీ.. ఎడ్జ్ కంప్యూటింగ్‌లో ఆ సమస్య తలెత్తదు.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)
ఇప్పుడు చాలా రకాల ఐఓటీ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. 2024లో మరిన్ని ఐఓటీ ఆవిష్కరణలు జరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. ఇవి ఇంటర్నెట్ సాయంతో పనిచేస్తాయి. లేదా ఇంటర్నెట్ ద్వారా మరో డివైజ్‌కి కనెక్ట్ అవుతాయి. ఇప్పటికే ఇంట్లో, పరిశ్రమల్లో వాడే ఐఓటీలు ఎన్నో మార్కెట్‌లోకి వచ్చేశాయి. కార్లలో కూడా వీటిని వాడుతున్నారు. 2024లో ఈ టెక్నాలజీ ట్రెండ్ బాగా పెరుగుతుందనేది అంచనా. 2030 నాటికి దాదాపు 50 బిలియన్ల ఐఓటీ పరికరాలు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉంటాయని, దానివల్ల స్మార్ట్‌ఫోన్స్ నుండి కిచెన్‌లో వాడే పరికరాల వరకు ప్రతీది ఒకదానితో మరొకదానికి కనెక్టివిటీ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
5జీ
ఇప్పటికే మన దేశంలో 5జీ లాంచ్ అయ్యింది. చాలామంది వాడుతున్నారు కూడా. అయితే.. చాలామంది దగ్గర 4జీకి సపోర్ట్ చేసే పాత ఫోన్లు మాత్రమే ఉన్నాయి. కానీ.. 2024లో వాటి స్థానంలో చాలామంది 5జీ ఫోన్లను వాడే అవకాశం ఉంది. దీనివల్ల యూట్యూబ్ లాంటి స్ట్రీమింగ్ యాప్స్ వాడకం బాగా పెరుగుతుంది. క్లౌడ్ బేస్‌డ్ గేమింగ్ సర్వీసులు పెరుగుతాయి.2027 చివరి నాటికి 5జీ నెట్‌వర్క్ సబ్‌స్క్రిప్షన్‌లు 4.4 బిలియన్లకు చేరుకుంటాయనేది అంచనా.